YS Bhaskar Reddy: తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటీషన్

వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

  • Written By:
  • Updated On - March 20, 2023 / 12:34 PM IST

వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో ఏ4 దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటీషన్ వేశారు. దస్తగిరి స్టేట్ మెంట్ ఆధారంగా తమను నేరంలోకి నెట్టడం సమంజసం కాదని, సీబీఐ చెప్పినట్టుగా దస్తగిరి స్టేట్ మెంట్ ఇస్తున్నారంటూ పిటీషన్ లో భాస్కర్ రెడ్డి ఆరోపించారు. వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడని, అలాంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వడం సరికాదంటూ పిటీషన్ లో పేర్కొన్నారు. వివేకా హత్య కేసుకు ఉపయోగించారని భావిస్తున్న ఆయుధాన్ని దస్తగిరే కొనుగోలు చేశాడని కోర్టుకు తెలిపారు. బెయిల్ సమయంలోనూ దస్తగిరికి సీబీఐ సహరించిందంటూ ఆరోపించారు. దస్తగిరిపై ఉన్న ఆధారాలను కూడా కింది కోర్టు పట్టించుకోలేదని, అతనికిచ్చిన బెయిల్ రద్దు చేయాలని పిటీషన్ లో పేర్కొన్నారు.

వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని కూడా సీబీఐ పలుసార్లు విచారించింది. వివేకా హత్య జరిగిన రోజు ఘటనాస్థలంలో సాక్ష్యాధారాలు చెరిపేయడంతో పాటు కేసులో భారీ కుట్ర కోణం దాగి ఉందనే కోణంలో వీరిని విచారించినట్టు కూడా వార్తలు వచ్చాయి. వివేకా హత్య జరగడానికి కొన్ని గంటల ముందు నిందితుడు సునీల్‌యాదవ్‌.. భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్లు సీబీఐ అధికారులు గూగుల్‌ టేక్‌ అవుట్‌ ద్వారా నిర్ధారణ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డిలను విచారించింది.

కాగా వివేకా హత్య కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లిన తర్వాత నిందితుల్లో ఒకరైన షేక్ దస్తగిరి అఫ్రూవర్ గా మారారు.
వివేకానందరెడ్డి హత్యకు దారి తీసిన పరిస్థితులు.. హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు.. వంటి వివరాలన్నీ దస్తగిరి కోర్టు ముందు చెప్పినట్లుగా తెలుస్తోంది. సీబీఐ కూడా దస్తగిరి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. అయితే సీబీఐ విచారణ తీరుపై భాస్కర్ రెడ్డి, ఎంపి అవినాశ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో దొరికిన లేఖపై విచారణ జరపకుండా… నిందితుల్లో ఒకరిగా ఉన్న దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా తమను విచారించడం సరికాదంటున్నారు. దీనిపై ఇప్పటికే అవినాశ్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరగా.. కోర్టు తిరస్కరించింది. తాజాగా భాస్కర్ రెడ్డి దస్తగిరికి బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు.