Site icon HashtagU Telugu

Murder : భార్య హత్య కేసులో తెలంగాణ యూత్ కాంగ్రెస్ లీడ‌ర్‌ అరెస్ట్

Murder

Murder

హైదరాబాద్‌లో భార్యను హత్య చేసిన కేసులో యువజన కాంగ్రెస్ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వ‌ల్ల‌భ‌రెడ్డి అనే యూత్ కాంగ్రెస్ నేత త‌న భార్య లహరి(27) గుండెపోటుతో మరణించిందని పోలీసుల‌కు త‌ప్పుడు స‌మాచారం అందించాడు. అయితే విచార‌ణ‌లో ఆమె మృతికి కార‌ణం భ‌ర్తే అని పోలీసులు అరెస్ట్ చేశారు. జులై 14న తలకు గాయమైన లహరిని ఆమె భ‌ర్త వ‌ల్ల‌భ‌రెడ్డి కార్పోరేట్ ఆసుపత్రికి తీసుకురాగా అప్ప‌టికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఇంటి పనులు చేస్తుండగా లహరి కిందపడిపోయి తలకు గాయమైందని వల్లభరెడ్డి వైద్యులకు తెలిపారు. లహరిరెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ లహరిరెడ్డి తండ్రి కోటి జైపాల్‌రెడ్డి నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

లహరి కిందపడిపోయిందని, తలకు గాయమైందని తనకు కాల్ వచ్చిందని జైపాల్ రెడ్డి పోలీసులకు తెలిపారు. వెంటనే భార్యతో కలిసి ఆస్పత్రికి వెళ్లగా.. లహరికి గుండెపోటు వచ్చిందని వ‌ల్ల‌భ రెడ్డి తెలిపాడ‌ని చెప్పారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అదే రోజు శవపరీక్ష నిర్వహించారు. అయితే శవపరీక్ష నివేదికలో లహరి కడుపులో అంతర్గతంగా గాయాలు కూడా ఉన్నాయని తేలింది.దీంతో హత్యా నేరం కింద వల్లభరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సాక్ష్యాలు మాయమైనందుకు ఆయనపై కేసు కూడా నమోదైంది. జూలై 13వ తేదీ రాత్రి జరిగిన గొడవలో నిందితుడు తన భార్యను కొట్టాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. భార్య‌ను గోడపైకి నెట్టాడంతె త‌ల‌కి గాయ‌మైన‌ట్లు విచార‌ణలో తేలింది. గతేడాది వివాహం చేసుకున్న వీరు హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు.నల్గొండకు చెందిన కాంగ్రెస్ నాయకుడు రంగసాయిరెడ్డి కుమారుడు వ‌ల్ల‌భ‌రెడ్డి అని పోలీసులు తెలిపారు.