Site icon HashtagU Telugu

Karimnagar Crime: రెండ్రోజుల్లో పెళ్లి.. సంగీత్ లో ఊహించని విషాదం

tragedy in sangeet

tragedy in sangeet

Karimnagar Crime: పెళ్లంటే పెద్ద వేడుక. జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే పండుగ. అలాంటి పెళ్లి జీవితాంతం గుర్తుండిపోవాలని.. ఉన్నంతలో వైభవంగా చేసుకుంటున్నారు. కరీంనగర్ జ్యోతినగర్ కు చెందిన రాజేశ్వర్ మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నారు. అని కుమార్తెకు వివాహం నిశ్చమైంది. అంతా బాగుంటే.. ఈ పాటికి ఘనంగా పెళ్లి జరగాల్సింది. కానీ.. ఊహించని రీతిలో ఎదురైన విషాదం వారి అవధుల్లేని ఆనందానికి అడ్డుకట్ట వేసింది.

అక్క పెళ్లికి నవంబర్ 29న ముహూర్తం ఫిక్స్ అవడంతో.. తమ్ముడు శివతేజ ఆనందానికి అవధుల్లేవు. శరవేగంగా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం (నవంబర్ 26) రాత్రి సంగీత్ కు ఏర్పాట్లు చేశారు. చుట్టాలు, సన్నిహితులు, తెలిసిన వారు, చుట్టుపక్కల వారంతా సంగీత్ లో పాల్గొన్నారు. అర్థరాత్రి వరకూ సంగీత్ అట్టహాసంగా జరిగింది. కుటుంబమంతా సంగీత్ సంబరాల్లో ఆడిపాడింది. శివతేజ కూడా చాలా సంతోషంగా డ్యాన్స్ చేసి అందరినీ అలరించాడు. అలా వేదిక దిగి కింద కుర్చీలో కుర్చున్న అతను.. కాసేపటికి ఉలుకుపలుకు లేకుండా ఉండిపోయాడు.

శివతేజ చనిపోయాడని తెలుసుకున్న కుటుంబం నిర్ఘాంతపోయింది. అప్పటివరకూ సంగీత్ సంబరాల్లో మునిగితేలిన వారంతా షాకయ్యారు. పెళ్లి వేడుకతో ఆనందం వెల్లివిరియాల్సిన ఆ కుటుంబంలో.. విషాద ఛాయలు అలుముకున్నాయి. రోదనలు మిన్నంటాయి. ఇటీవల కరోనా సోకినవారే ఉన్నట్టుండి చనిపోతుండగా.. శివతేజకు కరోనానే రాలేదని కుటుంబం చెబుతోంది. బీటెక్ సివిల్ పూర్తిచేసిన శివతేజ, అతని కుటుంబం భవిష్యత్ పై ఎన్నో కలలు కనగా.. అవన్నీ కల్లలుగానే మిగిలిపోయాయి.

 

Exit mobile version