Marriage Trends : పెళ్లి అనేది జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం. మనిషి జీవితంలో పుట్టుక, పెళ్లి, చావు.. ఈ మూడు చాలా స్పెషల్. అందుకే వీటిని అందరూ సీరియస్‌గా తీసుకుంటారు. ఎవరితోనైనా పెళ్లి కుదిరి.. అకస్మాత్తుగా ఆ సంబంధం వాళ్లు నో చెప్పడం సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితి చాలామంది యువతులకు, యువకులకు ఎదురవుతుంటుంది. దీన్ని చాలామంది లైట్‌గానే తీసుకుంటారు. దాన్ని అక్కడితే వదిలేస్తారు. దాని కంటే మంచి పెళ్లి సంబంధం మరొకటి వస్తుందిలే అనే ఆశాభావంతో ఉంటారు. వాస్తవానికి ఇది సరైన ఆటిట్యూడ్. కానీ ఇటీవలకాలంలో కొందరు యువకులు అరాచకంగా ప్రవర్తిస్తున్నారు. తమతో పెళ్లి సంబంధం కుదిరాక.. అకస్మాత్తుగా నో చెప్పిన ఆడపిల్ల వాళ్లను వేధిస్తున్నారు. ఈ తరహా కేసులు ఇటీవలకాలంలో చాలానే పోలీసు స్టేషన్ల దాకా చేరుతున్నాయి.
Also Read :December Horoscope : డిసెంబరులో ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..
ఇంతకుముందు పెళ్లిళ్లు అంటే.. పెళ్లి జరిగే దాకా ఎవరి ఫోన్ నంబరు(Marriage Trends) ఎవరికీ ఇచ్చేవాళ్లు కాదు. ఇప్పుడు అలా కాదు.. నిశ్చితార్ధం జరిగిందో లేదో అమ్మాయి ఫోన్ నంబరు అబ్బాయికి, అబ్బాయి నంబరు అమ్మాయికి ఇచ్చేస్తున్నారు. ఇది విచ్చలవిడితనానికి దారితీస్తోంది. ఒకవేళ అకస్మాత్తుగా యువతి తరఫున వాళ్లు పెళ్లి సంబంధానికి నో చెబితే.. సీన్ మారిపోతోంది. అప్పటిదాకా ఫోనులో యువతితో టచ్‌లో ఉన్న యువకుడు సైకోలా ప్రవర్తిస్తున్నాడు. ప్రతీకారానికి తెగబడుతున్నాడు. సోషల్ మీడియాలో సదరు యువతి గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. కొందరు యువకులైతే తమతో పెళ్లికి నో చెప్పిన యువతుల ఫొటోలను మార్ఫింగ్ చేసి పోర్న్ సైట్లలో పెట్టారు. ఈ తరహా కేసులో ఇటీవలే వార్తల్లోకి వచ్చాయి. మొత్తం మీద పెళ్లి సంబంధాలను కుదుర్చుకునే వ్యవహారంలో ఈ తరహా ట్రెండ్ మొదలుకావడం అనేది ఆందోళన రేకెత్తిస్తోంది. అందుకే పెళ్లి సంబంధం కుదిరినా.. పెళ్లి ప్రక్రియ మొత్తం పూర్తయ్యే దాకా వధువు, వరులకు వారి ఫోన్ నంబర్లు ఇవ్వకపోవడమే బెటర్ అని పరిశీలకులు సూచిస్తున్నారు.