RMP Doctor : తెలిసీతెలియని వైద్యంతో యువకుడి ప్రాణం తీసిన ఆర్ఎంపీ

జ్వరం వచ్చిందని సదరు ఆర్ఎంపీ వద్దకు వెళ్తే..గంటలో 7 ఇంజెక్షన్లు ఇచ్చి యువకుడి ప్రాణాలు తీసాడు

  • Written By:
  • Publish Date - April 30, 2024 / 08:28 AM IST

ఇటీవల కాలంలో డాక్టర్ల (Doctors) పరువు తీస్తున్నారు కొంతమంది ఆర్ఎంపీలు(RMP)..ఆరు నెలలు ఏదొక హాస్పటల్ లో పనిచేయడం..వెంటనే ఆర్ఎంపీ అనే బోర్డు తగిలించుకొని వైద్యం చేయడం మొదలుపెడుతున్నారు. దీంతో అమాయకపు ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తెలిసి తెలియని వైద్యం చేసి..ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో చూసాం..చూస్తూనే ఉన్నాం. తాజాగా వరంగల్ జిల్లాలో ఇదే తరహాలో జరిగింది. జ్వరం వచ్చిందని సదరు ఆర్ఎంపీ వద్దకు వెళ్తే..గంటలో 7 ఇంజెక్షన్లు ఇచ్చి యువకుడి ప్రాణాలు తీసాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..

వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన కత్తి నవీన్(28) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈనెల 26 న తీవ్ర జ్వరం, నీరసంతో బాధపడుతుండగా భార్య మేఘన ఫిరంగిగడ్డలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ ఆడెపు శ్రీనివాస్‌ వద్దకు తీసుకెళ్లింది. కత్తి నవీన్‌ను పరీక్షించిన సదరు డాక్టర్ 2 ఇంజక్షన్లు ఇవ్వడంతో పాటు గ్లూకోజ్‌లో మరో 4 ఇంజక్షన్లు వెంటనే ఇచ్చాడు. దాంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. సదరు ఆర్ఎంపీ వెంటనే మరో ఇంజక్షన్ ఇచ్చాడు. ఇలా గంట వ్యవధిలోనే 7 ఇంజక్షన్లు ఇవ్వడంతో పరిస్థితి విషమించింది.

ఇది గమనించిన కుటుంబసభ్యులు సదరు ఆర్ఎంపీని నిలదీయడంతో అతను భయపడి వెంటనే నవీన్‌ను ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లామని సూచించాడు. వెంటనే వారు వరంగల్‌లోని గార్డియన్ హాస్పిటలకు తీసుకెళ్లగా..నవీన్ పరిస్థితి చాల సీరియస్ గా ఉందని..ఇప్పుడే ఏంచెప్పలేమని తెలిపారు. వరంగల్ లో ఒక్క రోజు చికిత్స తర్వాత పరిస్థితి మరింత విషమించడంతో ఈనెల 28న హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్దారించారు. సదరు ఆర్ఎంపీ డాక్టర్ తెలిసి తెలియని వైద్యం చేయడం వల్లే తన భర్త ప్రాణాలు కోల్పోయాడంటూ భార్య మేఘన, వర్థన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం సదరు RMP పరారీలో ఉన్నాడు.