MLC Kavitha: రేవంత్ రెడ్డిలో పచ్చ రక్తం ప్రహిస్తోంది, సీఎంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  • Written By:
  • Updated On - February 8, 2024 / 12:46 PM IST

MLC Kavitha: టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయనను తప్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జ్యుడిషియల్ విచారణ జరిపించాలని సూచించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తెలంగాణ యువతకు ఎలా న్యాయం చేయగలుగుతారని ప్రశ్నించారు. గురువారం నాడు తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవత మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని దూషించడంలో ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు ముందున్నారని, వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఆ క్రమంలో బీఆర్ఎస్ హయాంలో డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డిని రేవంత్ రెడ్డి అత్యంత భయంకరంగా ఉచ్ఛరించడానికి వీలులేని భాషలో దూషించారని ప్రస్తావించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదేళ్లు డీజీపీగా పనిచేసిన వ్యక్తిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించారని, రిటైర్డ్ అధికారులను కేసీఆర్ ఆయా పోస్టుల్లో నియమిస్తే విమర్శలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు అదే పనిచేస్తున్నదని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమించిన వై రామ్మోహన్ రావు తెలంగాణకు చెందిన వ్యక్తి కాదని, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే సంస్థలో ఆంధ్ర వ్యక్తిని నియమిస్తే సరిగ్గా ఉద్యోగాలు ఇవ్వగలుగుతారా ? అన్నది సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఉన్న వారిని సభ్యులుగా నియమించబోమని చెప్పిన సీఎం టీడీపీలో పనిచేసిన రజని కుమారిని ఎలా నియమించారు? అని అడిగారు. మహేందర్ రెడ్డి రూ. లక్ష కోట్ల మేర అక్రమార్జన చేశారని అవినీతి ఆరోపణలు వచ్చాయని, టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్న మహేందర్ రెడ్డిని తక్షణమే తప్పించి జ్యుడిషియల్ విచారణ జరపించాలని డిమాండ్ చేశారు. త్వరలో తాము ఈ అంశంపై గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందిస్తామని వెల్లడించారు.

స్టాఫ్ నర్స్, పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు చేపట్టడంతో పాటు మినీ అంగన్ వాడీలను బీఆర్ఎస్ ప్రభుత్వమే అప్ గ్రేడ్ చేసిందని, కానీ ఇప్పుడు తాము నియామకపత్రాలు ఇస్తామంటున్నారని తప్పుబట్టారు. కేసీఆర్ చేసిన పనులు తామే చేస్తున్నామని చెప్పకుంటుంటే ఇక ప్రజలు అధికారం ఎందుకిచ్చినట్లని అడిగారు. ప్రజలు అధికారమిచ్చినప్పుడు కొత్త పనులు, ప్రజలకు పనికివచ్చే పనులు చేయాలని సూచించారు. ఈ ఏడాది డిసెంబరులోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కేవలం 60 మాత్రమే కొత్త ఉద్యోగాలను నోటిఫై చేసిందని ప్రస్తావించారు. గతంలో కేసీఆర్ నోటిఫై చేసిన ఉద్యోగాలను ఇప్పుడు ఇస్తున్నారని చెప్పారు. చేయని పనులు చేస్తున్నామని చెప్పడం మానేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు.

సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చిన వారికి నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీయే డిపెండెంట్ ఉద్యోగాలను రద్దు చేసిందని, అందుకు అంగీకరిస్తూ ఐఎన్ టీయూసీ సంతకాలతో ఏఐటీయూసీ సంతకాలు చేశాయని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించిన కేసీఆర్ …. ఒక్కసారి కూడా నియామక పత్రాలు అందించలేదని, ఇది కేవలం సాధారణంగా జరిగే ప్రక్రియగా భావించి జనరల్ మేనేజర్ స్థాయిలో నియామక పత్రాలు ఇచ్చేవారని అన్నారు. జీఎం స్థాయిలో జరిగే పనిని హైదరాబాద్ లో సీఎం స్థాయిలో నియమకా పత్రాలు ఇస్తున్నాయని ఎద్దేవా చేశారు. కొత్తగా 400 డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడైనా నిజాలు చెప్పాలని సూచించారు. కేసీఆర్ సింగరేణిని కన్నతల్లిలా చూశారని, సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకించారని, ఉద్యోగుల సంఖ్య పెరగాలని చూశారని వివరించారు. “మీ గురువు చంద్రబాబు హయాంలో సింగరేణిలో గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇచ్చి ఉద్యోగులను తొలగించి సంఖ్యను కుదించారు. కాబట్టి అబద్దాలు చెప్పడం మానేసి కొత్తగా వేసిన ఉద్యోగాలు ఎన్నో చెప్పాలి” అని డిమాండ్ చేశారు.

అత్యంత కీలకమైన విద్యుత్తు సంస్థలో నలుగురు డైరెక్టర్లను ప్రభుత్వం నియమిస్తే అందులో ముగ్గురు ఆంధ్రా అధికారులే ఉన్నారని మండిపడ్డారు. నందకుమార్, నర్సింలు, సుధా మాధూరి ని డైరెక్టర్లుగా నియమించారని పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన ఏడుగురు సీనియర్ అధికారులను పక్కనబెట్టి ధర్మాధికారి కమిషన్ నివేదికను సాకుగా చూపించి ఆంధ్ర వాళ్లను నియమించారని, తెలంగాణ ప్రయోజనాలపై వాళ్లకు ఏం ఆసక్తి ఉంటుందని ప్రశ్నించారు. “కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒక్క నిమిషమైన కరెంటు పోయిందా ? హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనుకున్న దగ్గర 3-4 గంటలు కరెంటు పోతుందంటే… దీని వెనుక ఆంధ్రా కుట్ర లేదా ? మీలో ఉన్న పచ్చరక్తం మీ చేత ఈ పని చేపించడం లేదా ? ” అని మండిపడ్డారు. ఈ ముగ్గురు డైరెక్టర్లను తొలగించి వారి స్థానంలో తెలంగాణ వారిని నియమించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వానికి సలహాదారులే ఉండవద్దని కోర్టుల్లో బీఆర్ఎస్ హయాంలో కేసులు వేసిన రేవంత్ రెడ్డి …. ఇవాళ ఎంత మందిని సలహాదారులుగా నియమించుకున్నారో చెప్పాలని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులను సలహాదారుగా నియమించుకుంటే ఏదో అనుకోవచ్చు కానీ ఢిల్లీలో ఒక మాజీ న్యాయమూర్తి వద్ద పనిచేసిన వ్యక్తిని లేని కొత్త పోస్టును సృష్టించి అసెంబ్లీకి సలహాదారునిగా నియమించడమేంటి ? అని ప్రశ్నించారు. వ్యక్తిగత కేసులు, ఓటుకు నోటు కేసులో వాదించిన దేవనా సైగల్ ను సుప్రీం కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా, తేర రజినీకాంత్ రెడ్డిని అదనపు అడ్వొకేట్ జనరల్ లా నియమించడంతో పాటు ఆయన అధికారంలోకి రాకముందు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను ఆపడానికి దొంగ కేసులు వేసిన ఒక న్యాయవాదిని సుప్రీం కోర్టులో అడ్వొకేట్ ఆన్ రికార్డుగా నియమించడాన్ని తీవ్రంగా ఖండించారు.