Yadadri : వాట్స ప్ యూనివ‌ర్సిటీలో ‘యాదాద్రి’ య‌వ్వారం

స్వ‌యంభూ శ్రీ ల‌క్ష్మి నర‌సింహుని క్షేత్రం యాద‌గిరిగుట్ట నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్, త్రిదండి చిన జీయ‌ర్ స్వామి మ‌దిలో నుంచి పుట్టిన‌ యాదాద్రి ని ద‌ర్శించుకోవాలని భ‌క్తులు ఆస‌క్తిగా ఉన్నారు

  • Written By:
  • Publish Date - April 5, 2022 / 04:41 PM IST

స్వ‌యంభూ శ్రీ ల‌క్ష్మి నర‌సింహుని క్షేత్రం యాద‌గిరిగుట్ట నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్, త్రిదండి చిన జీయ‌ర్ స్వామి మ‌దిలో నుంచి పుట్టిన‌ యాదాద్రి ని ద‌ర్శించుకోవాలని భ‌క్తులు ఆస‌క్తిగా ఉన్నారు. ల‌క్ష‌లాది మంది ద‌ర్శ‌నాల‌కు వ‌స్తార‌ని అంచ‌నా వేశారు. ఆ మేర‌కు నిర్మాణాల‌ను చేప‌ట్టామ‌ని తెలంగాణ స‌ర్కార్ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చింది. కానీ, భ‌క్తులు అక్క‌డికి వెళ్లిన త‌రువాత యాదాద్రి మ‌రోలా క‌నిపిస్తుంద‌ట‌. ఓ భ‌క్తుడు త‌న మ‌నోభావాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు యాదాద్రి దేవాల‌య పున‌ర్నిర్మాణంపై వ్యాసాన్ని సోష‌ల్ మీడియాలో వ‌దిలాడు. జై నర‌సింహా అంటూ ముగిస్తూ ఆయ‌న రాసిన వ్యాసం వాట్స‌ప్ గ్రూప్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఆ వ్యాసం యథాత‌దంగా ఇలా ఉంది.

“అధ్వానపు ప్లానింగుకు అతి చక్కని ఉదాహరణ… యాదాద్రి పునర్నిర్మాణం అని చెప్పవచ్చు…

ఓ పెద్ద సంకల్పాన్ని తీసుకున్నప్పుడు… దాన్ని సంపూర్ణం చేయడానికి… మంచి ప్రణాళిక కావాలి, సమర్థులైన టీం కావాలి, సరైన పర్యవేక్షణ కావాలి, సరిపోయే నిధులు కావాలి, లక్ష్యం ఏమిటనే స్పష్టత కావాలి, భావి అవసరాల మీద మంచి అంచనాలు కావాలి… అవేవీ లేకపోతే… దాన్నే యాదాద్రి పునర్నిర్మాణం అంటారు… ఈ నిర్మాణంలోని లోటుపాట్లు, ప్రణాళికారాహిత్యం కొట్టొచ్చునట్లు కనిపిస్తుంది….కట్టడాలు కడతారు, మళ్ళీ కొత్త ప్లాన్లు చెబుతారు, పాతవి పడగొట్టి కొత్తవి కట్టారు… మార్పుచేర్పులు సాగుతూనే ఉంటయ్… కడుతారు, కూల్చేస్తారు, మళ్లీ కడతారు… ఏం కడుతున్నామో, ఏం చేస్తున్నామో అక్కడ ఎవరికీ క్లారిటీ లేదు…

వందల కోట్లు పోశారు… అసలు ఆయన ఎవరికి బాధ్యతలు అప్పగించారు, వాళ్ల అనుభవం ఏంటి, వాళ్లు ఏం చేస్తున్నారు..? అంతా అయోమయం, గందరగోళం… పదీపదిహేను రోజులకు ఒకసారి నాలుగు ఫోటోలు బయటకి వచ్చేది… భక్తులు వెంటనే కళ్లకద్దుకుని…. ‘‘శిలలపై శిల్పాలు చెక్కినారూ, మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారూ’’ అని సంతోషపడేది… ఆహా, ఓహో… వర్షం వస్తే గుళ్లోకి నీళ్లెందుకు వస్తున్నయ్, ఎక్కడుంది లోపం అని మాత్రం ఆఆలోచించలేదు… పుష్కరిణికి (గుండం) మూడుసార్లు ఎందుకు మార్పులు చేశారో తెలీదు…

అప్పట్లో వెలుగు పత్రికలో ఓ ఇంట్రస్టింగు కథనం కనిపించింది… అక్కడేం జరుగుతున్నదో ప్రొఫెషనల్‌గా రిపోర్ట్ చేసినట్టు అనిపించింది… ముఖ్యాంశాలు… రథమండపం రెండుసార్లు మార్చారు… దాదాపు 4 కోట్లు వృథా ఖర్చు… వేలాది మంది సత్యనారాయణ వ్రతం చేసుకునేందుకు కాంప్లెక్స్ కట్టారు… నరసింహస్వామి దగ్గర సత్యనారాయణ వ్రతాలకు ప్రాధాన్యమేమిటి అనడక్కండి… దాన్ని మళ్లీ క్యూ కాంప్లెక్స్ చేశారు, దాని పొడవు తగ్గించారు… కొంత తీసేశారు, ఇంకొంత మళ్లీ కట్టారు… శివాలయం ఆవరణలో రామాలయం కట్టారు మొదట్లో… మళ్లీ తీసేశారు, శివాలయం ఎలివేషన్ సరిగ్గా లేదని ప్రహరీ తీసేశారు… గుడి చుట్టూ రెండుసార్లు ఫ్లోరింగు, కారణం, సాయిల్ టెస్టింగు చేయకపోవడం… పాత ఘాట్ రోడ్డుపై హాల్టింగ్ షెల్టర్ మొదలుపెట్టారు, తరువాత ఆపేశారు… కొండ కింద తులసివనంలో ఓ సరస్సు, బోటింగుకు 2 కోట్లు పెట్టారు… అర్రెర్రె, ఫ్లై ఓవర్ కట్టాలి కదాని నాలుక కర్చుకుని, బోటింగ్ నిలిపేసి, పిల్లర్లు వేస్తున్నారు…

మొత్తం ఇలాగే… ఓ శృతి లేదు, సమన్వయం లేదు, సరైన ప్లానింగ్ లేదు… ప్రజాధనం అపరిమితంగా వృథా చేసారు… గిరి ప్రదక్షిణ పేరిట గండి చెరువు వైపు కొండను తొలిచారు… ఇప్పుడు దాన్ని వదిలేసి రింగ్ రోడ్డు కట్టారు… రింగ్ రోడ్డు లోపల వైపు, కొండ మీదకు వెళ్లే ఫ్లైఓవర్ కోసం పిల్లర్లు వేశారు, తీసేశారు, ఇప్పుడు మళ్లీ వేసారు… వాస్తుకు విరుద్ధంగా ఉందని కొండ మీద సబ్‌స్టేషన్ తీసేశారు… గుండం ఓ చిత్రమైన వ్యథ… మొత్తం కొత్తగా నిర్మిస్తున్నాం కదా, పాత పుష్కరిణి ఎందుకులే అని మొత్తం తీసేశారు, కొత్తగా కట్టారు, అక్కడే స్నానాలు చేయాలి కదా భక్తులు… నో, నో, కొండ కింద మాత్రమే స్నానాలు అని నిర్ణయించారు, సగం కూల్చి మళ్లీ కట్టారు… స్నానాలు వద్దని చెప్పి, అక్కడ బాత్రూంలు ఎందుకు కట్టి కూల్చారో ఎవరికీ తెలియదు… రాస్తూ పోతే ఇంకా చాలాచాలా ఉన్నయ్… అసలు స్థంభాల మీద టీఆర్ఎస్ సర్కారు పథకాల ప్రచారం, కేసీయార్ బొమ్మలు పెట్టినప్పుడే గుడి ప్రతిష్ఠను, పవిత్రతను బాగా దెబ్బతీశారు… ఇప్పుడు ఈ లోపాలతో సర్కారు పరువు మరింత మసకబారుతోంది… ఏమో, ఏ నరసింహుడు ఓసారి కోరలు సవరించుకుంటే తప్ప ఇది గాడినపడేట్టు లేదు… లేదు…!!

అభిషేక సమయంలో యాదారుషి స్వామి వారి కోసం ఘోరతపస్సు చేసి స్వామి వారిని కొండమీద వెలవాలని… తన కోరిక మేరకు వెలిశాడని చెబుతారు… కానీ యాదర్షి మహర్షి విగ్రహం తీసి రోడ్డు నిర్మాణం చేయాలని చూశారు కానీ హిందూ సంఘాల నిరసన తో మళ్ళీ అక్కడే ఏర్పాటు చేశారు… మహా కుంభసంప్రోక్షణ విశ్వక్సేనుని పూజతో మొదలు పెట్టారు అర్చకులు… కానీ కొండకింద ఉన్న విశ్వక్సేనుని ఆలయాన్ని కూల్చేసి విగ్రహాన్ని ఎక్కడ పడేశారో కూడా తెలిదు… మళ్ళీ ఆలయం నిర్మించలేదు…వేలమంది ఋత్వికులతో లక్షల మంది ప్రజల సమక్షంలో ఆలయ పునప్రారంభం ఉంటది అని చెప్పి… సాదాసీదాగా కార్యక్రమం కానిచ్చారు…

ఇక ఈఓ గారి విషయానికి వస్తే… భక్తులని కానీ… స్థానికులని కానీ ఏనాడు మనుషులుగా గుర్తించలేదు…
వందల కోట్ల అక్రమ సంపాదన పోగేసిందని స్థానికుల గుసగుసలు…
ఆలయం ప్రారంభించారు… కానీ అన్నీ షరతులే… 3 ఎకరాలు ఉన్న ప్రాంగణాన్ని 15 ఏకరాలకి పైగా పెంచినప్పటికి వాహనాలు పైకి రావొద్దని ఆదేశాలు… ఆలయ పునః నిర్మాణం కోసం విలువైన వ్యవసాయ భూములు, దుకాణాలు,ఇండ్లు కోల్పోయిన స్థానికులు స్వామీ వారికి దర్షించాలంటే కూడా షరతులు…
ఇక భక్తుల సౌకర్యాల గురుంచి పట్టించుకునే నాధుడే లేడు…vip లకు మాత్రం 25 సూట్ కాటేజ్ లు కటించారు, సామాన్య భక్తులకు కనీసం ఒక్క రేకుల షెడ్డు కూడా వేయలేదు. నీటి వసతి లేదు సులబ్ కాంప్లెక్స్ లెదు…
అయిన వారికి కంచంలో కానీ వారికి విస్తారాకులో వడ్డించే ఆలయ అధికారులు…
ఇలా చెప్పుకుంటు పోతే…. సమయం సరిపోదు… పెన్నులో ఇంకు సరిపోదు.. పెన్ను పట్టి సమాజానికి సమాచారం ఇవ్వాల్సిన వాళ్ళు మౌనంగా ఉన్నారు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న వాళ్ళు వెంటనే స్పందించాలి. “
జై లక్ష్మినరసింహ