అదివో అల్లదివో.. యాదాద్రి క్షేత్రం!

ఆంధ్రప్రదేశ్ అనగానే తిరుపతి.. కేరళ అనగానే అనంత పద్మనాభస్వామి.. తమిళనాడు పేరు చెప్పగానే మీనాక్షమ్మ ఆలయాలు భక్తుల కళ్ల ముందు ఎలా కదలాడుతాయి.. ఇప్పుడు తెలంగాణ పేరు చెప్పగానే యాదాద్రి లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయం కూడా ప్రముఖంగా ఆకర్షిస్తోంది.

  • Written By:
  • Updated On - October 12, 2021 / 11:38 AM IST

ఆంధ్రప్రదేశ్ అనగానే తిరుపతి.. కేరళ అనగానే అనంత పద్మనాభస్వామి.. తమిళనాడు పేరు చెప్పగానే మీనాక్షమ్మ ఆలయాలు భక్తుల కళ్ల ముందు ఎలా కదలాడుతాయి.. ఇప్పుడు తెలంగాణ పేరు చెప్పగానే యాదాద్రి లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయం కూడా ప్రముఖంగా ఆకర్షిస్తోంది. తెలంగాణలోని ప్రముఖ క్షేత్రమైన ఈ యాదాద్రి గుడి.. తిరుపతి పుణ్యక్షేత్రానికి ఏమాత్రం తీసిపోకుండా రెడీ అవుతోంది. గుట్టపై మండపాలు, క్యూలైన్స్, గర్భగుడి, ఆలయ ప్రధాన ద్వారాలు, ప్రహరీలు ప్రతిదీ అత్యంత సర్వాంగ సుందరంగా రూపుద్దిద్దుకుంటోంది. అన్ని హంగులతో ముస్తాబైన ఈ ఆలయం త్వరలోనే ప్రారంభానికి సిద్దమవుతోంది.

తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా అవతరించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి గుడిని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దాలని భావించారు. ఇందుకోసం ప్రత్యేక శిల్పులను సైతం రప్పించారు. తిరుమల తిరుపతికి ఏమాత్రం తీసిపోకుండా యాదగిరిగుట్టను తీర్చిద్దిదేందుకు కంకణం కట్టుకున్నారు. సమయం కుదిరినప్పుడలా ఆలయాన్ని సందర్శించి పునర్ నిర్మాణ పనులను పరిశీలిస్తూ వస్తున్నారు. అసెంబ్లీలో ఈ ఆలయ ప్రస్తావన తీసుకొస్తూ యాదాద్రి గుడి సుందీకరణ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ప్రారంభిస్తామని కేసీఆర్ అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు యాదాద్రి పనులను పర్యవేక్షిస్తుండటంతో సుందరీకరణ, పునర్ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో క్యూ లైన్లు, ప్రసాదం కాంప్లెక్స్, లైటింగ్, ప్రాంగణ డెవలప్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం, గట్ట నుంచి పుణ్యక్షేత్రానికి యాత్రికులను తీసుకువెళ్లే ఎస్కలేటర్‌లకు సైడ్ రెయిలింగ్‌ల ఏర్పాటు, గోపురాలపై కలశాల బంగారు పూత, ద్వజస్థంభం (ఫ్లాగ్‌స్టాఫ్) పనులు దాదాపుగా పూర్తికావొచ్చు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆలయ పనర్ నిర్మాణ పనులను వీడియోను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునఃనిర్మాణం, ప్రారంభంపై మున్సిపల్‌, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ ఆదివారం ట్వీట్‌చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సైతం ఆయన పంచుకొన్నారు. ‘యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అందంగా పునఃనిర్మాణం పూర్తి చేసుకొన్నది. అద్భుతమైన క్షేత్రం త్వరలో ఆవిష్కారమవుతుంది. యాదాద్రిని ఇండియన్‌ టూరిజం డెస్టినేషన్‌గా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్‌కు అభినందనలు. ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణ’ అని హాష్‌ ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు.

13 ఎకరాలలో విస్తరించిన కాటేజీల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని, ఆలయ ప్రారంభోత్సవ సమయంలో భక్తులకు అన్ని రకాల వసతులు సిద్ధంగా ఉంటాయని  అధికారులు అంటున్నారు. కల్యాణ మండపం, కల్యాణ కట్ట, స్నానాలు, పుష్కరిణి, వ్రత మండపం మరియు ఇతర సౌకర్యాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. యాదాద్రి అభివృద్ధికి ఇప్పటివరకు సుమారు రూ .950 కోట్లు ఖర్చు చేశారు. వీటిలో రూ .250 నుంచి రూ .280 కోట్లు కొండపై ఉన్న ప్రధాన దేవాలయ పునర్నిర్మాణం, మిగిలిన మొత్తాన్ని భూ సేకరణ, రహదారి పనులు మరియు వివిధ సౌకర్యాల ఏర్పాటు కోసం ఖర్చు చేసినట్లు యాదాద్రి అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాని గుర్తింపు తీసుకొచ్చేలా నిర్మించిన ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోడీని ఆహ్వనించారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని సుమారు 1,000 నుంచి 1,500 మంది రుత్విక్‌లతో మహా సుదర్శన యాగం నిర్వహించి, అంగరంగ వైభవంగా ఆలయాన్ని ఆవిష్కరించనున్నారు.