World Economic Forum: దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (World Economic Forum) రెండో రోజున వివిధ సదస్సులు, సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పాలుపంచుకుంటుంది. స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ 55వ వార్షిక సదస్సు మూడు రోజుల పాటు జరుగుతోంది. ఈసారి సమావేశాల్లో ‘ఇండస్ట్రీస్ ఇన్ ఇంటిలిజెంట్ ఏజ్’ అనే థీమ్ ను వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఎంచుకుంది. శాస్త్ర సాంకేతిక అధునాతన పరిజ్ఞానానికి అనుగుణంగా పారిశ్రామిక వ్యూహాల మార్పు, పెరుగుతున్న ఇంధన అవసరాలు సమకూర్చుకోవాలనే ఇతివృత్తంతోనే రౌండ్ టేబుల్ సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు, రాష్ట్రాల ప్రతినిధులతో పాటు ఆయా రంగాలు, పరిశ్రమలకు చెందిన నిపుణులు, పారిశ్రామికవేత్తలు దాదాపు మూడు వేల మంది ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఇటీవల అమల్లోకి వచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, పునరుత్పాదక ఇంధనం, పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ఉత్పత్తికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై దేశ విదేశాల్లో పేరొందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇంధన ఉత్పత్తితో పాటు హైదరాబాద్లో ఫోర్త్ సిటీ అభివృద్ధి, ఏఐ ఆధారిత ఐటీ సేవల విస్తరణ, అత్యాధునిక డేటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టేందుకు సంప్రదింపులు జరుపుతున్నాయి.
Also Read: World Economic Forum : గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ సమ్మిట్‌లో చంద్రబాబు పిలుపు
ఈ నేపథ్యంలో దావోస్ లో రెండో రోజున పలు కంపెనీల సీఈవోలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారులు సమావేశమవనున్నారు. అమెజాన్, యుని లివర్, స్కై రూట్ ఏరో స్పేస్, సిఫీ టెక్నాలజీస్ కంపెనీల ప్రతినిధులతో వేర్వేరుగా చర్చలు జరుపుతారు. అనంతరం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సారధ్యంలో వివిధ కంపెనీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. ప్రధానంగా ఐటీ, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ టీమ్ చర్చలు జరుపనుంది. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు చేసుకోనుంది. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ. 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రానికి ఈసారి భారీ పెట్టుబడులు వస్తాయనే అంచనాలున్నాయి.