Musi Riverfront : మహానగరం హైదరాబాద్‌లో మురికి కూపంగా మారిన మూసీ నదిని ప్రక్షాళన చేసే దిశగా తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు అడుగులు వేస్తోంది. అందుకోసమే మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం భారీ రుణం కావాలి. రూ.4100 కోట్ల రుణాన్ని ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకోవాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. మరో రూ.1763 కోట్ల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా భరించనుంది. అంటే రూ.5863 కోట్లలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పూర్తవుతుంది.ప్రపంచ బ్యాంకు దాకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెళ్లాలంటే.. తొలుత కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల క్లియరెన్స్ పొందాలి. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు విషయంలో మోడీ సర్కారును ఒప్పించాలి, మెప్పించాలి. ఈ దిశగా కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ప్రయత్నాల్లో ప్రస్తుతానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. అవేంటో చూద్దాం..
Also Read :Pakistan-India Ceasefire: మే 18 తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య మరోసారి యుద్ధం?
కేంద్రం అభ్యంతరాలు ఇవీ..
- మూసీ రివర్ ఫ్రంట్(Musi Riverfront) అభివృద్ధి ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు 6 నెలల క్రితమే కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.
- దీంతో తదుపరి దశలో కేంద్ర ఆర్థిక శాఖను తెలంగాణ సర్కారు సంప్రదించింది. హైదరాబాద్ వికాసం కోసం ఈ ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇవ్వమని కోరింది.
- అయితే మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించనిదే క్లియరెన్స్ ఇవ్వలేమని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది.
- ఆ ప్రాజెక్టు డీపీఆర్‌కు సాంకేతిక అనుమతులు, పర్యావరణ అనుమతులు మంజూరైన తర్వాతే క్లియరెన్స్ ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
- కేంద్ర ఆర్థిక శాఖ కోరిన విధంగా మొత్తం ప్రక్రియను తెలంగాణ సర్కారు పూర్తి చేయడానికి మరో మూడు నెలల టైం పడుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
- సమగ్ర డీపీఆర్ తయారయ్యాక.. వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతుల కోసం అప్లై చేయాలి.
- ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను 2024 సంవత్సరం ఆగస్టులో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అందించింది.
- మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా మురుగునీటి శుద్ధీకరణ, వరదనీరు సవ్యంగా వెళ్లేలా చర్యలు, వర్షపునీరు-మురుగునీరు కలిసి వెళ్లకుండా చర్యలు, ల్యాండ్‌స్కేప్ డెవలప్‌మెంట్ వంటి చర్యలన్నీ చేపడతారు.