Family Digital Health Cards: తెలంగాణ ప్రాంతంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజలకు అక్టోబర్ 3 నుంచి ప్రయోగాత్మకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. కుటుంబాల గుర్తింపు, కుటుంబ డిజిటల్ కార్డుల వివరాలకు సంబంధించి అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి అధ్యయనం చేయాలని అధికారులను కోరారు.
ప్రతి రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఆర్డీఓ స్థాయి అధికారులు, పట్టణ సెగ్మెంట్‌లో మున్సిపల్ జోనల్ కమిషనర్ స్థాయి అధికారి సర్వేను పర్యవేక్షించాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలను పర్యవేక్షించేందుకు నియమించిన ఉన్నతాధికారులను పర్యవేక్షణ అధికారులుగా నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయం తదితర సంక్షేమ పథకాల్లో ఉన్న డేటా ఆధారంగా కుటుంబాలను గుర్తించాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే బ్యాంకు ఖాతాలు, పాన్‌కార్డుల వంటి అనవసర సమాచారం సేకరించడాన్ని అధికారులు మానుకోవాలని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “కుటుంబ డిజిటల్ కార్డులో(Family Digital Health Cards) మహిళలే ఇంటి యజమానిగా గుర్తించాలి. ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వాళ్ళ వివరాలను కార్డు వెనుక భాగంలో పొందుపర్చాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతకుముందు డిజిటల్ కార్డులపై సీఎం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కార్డుల రూపకల్పలో ఆయా రాష్ట్రాలు సేకరించిన వివరాలు, కార్డులతో కలిగే ప్రయోజనాలు, లోపాలను అధికారులు సీఎంకు వివరించారు. ఇదంతా ఒక పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శులు అజిత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శులు సంగీత సత్యానారాయణ, మాణిక్ రాజ్, షానవాజ్ ఖాసీం, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Also Read: Hyderabad: 826 కోట్లతో కేబీఆర్ పార్క్ ఆరు జంక్షన్ల అభివృద్ధికి రేవంత్ గ్రీన్ సిగ్నల్