Skill University: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో (Skill University) విప్రో భాగస్వామి కావాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. హైదరాబాద్ లో విప్రో సంస్థ కార్యకలాపాల పురోగతిని వివరించేందుకు శుక్రవారం నాడు ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి రాఘవన్ సచివాలయంలో శ్రీధర్ బాబును కలిసారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఐటి, ఎఫ్ ఎంసీజీ రంగాల్లో పేరు గడించిన విప్రో తమ సంస్థకు అవసరమయ్యే మానవ వనరులకు స్కిల్ యూనివర్సిటీలో స్వయంగా శిక్షణ ఇచ్చి (ఇండస్ట్రీ డ్రివెన్ ట్రెయినింగ్) నియమించుకోవాలని సూచించారు.
డా. రెడ్డీస్ ల్యాబ్స్ ఇదే తరహాలో 80 మంది నిరుద్యోగ యువతకు తమ అవసరాలకు తగినట్లుగా శిక్షణ ఇస్తోందని ఆయన తెలిపారు. ఎఫ్ ఎంసీజీ ఉత్పత్తుల పరిశ్రమలను ద్వితీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటు చేయాలని శ్రీధర్ బాబు కోరారు. రాష్ట్రంలోని 117 శాసనసభ నియోజక వర్గాల్లో మహిళల కోసం మినీ పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. అక్కడి మౌలిక సదుపాయాలను వినియోగించుకుని పరిశ్రలకు ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంతాల వారికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. సమావేశంలో విప్రో కార్పోరేట్ వ్యవహారాల ప్రతినిధి వినయ్ రావత్, టీజీఐఐసీ సీఈవో వి.మధుసూదన్‌లు పాల్గొన్నారు.
Also Read: Kakinada Port : రేషన్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టం – డిప్యూటీ పవన్ వార్నింగ్
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీలో భాగంగా ఇటీవల సీఎం రేవంత్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అదానీపై అమెరికా కోర్టు చీటింగ్ కేసు నమోదు చేయడంతో దేశంలో అలజడి నెలకొంది. ఈ క్రమంలో అదానీపై అన్ని పార్టీలు విమర్శలు చేశాయి. ఈ క్రమంలోనే అదానీ గతంలో తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీకి రూ. 100 కోట్లు ప్రకటించారు. ఈ రూ. 100 కోట్లపై తాజాగా బీఆర్ఎస్ విమర్శలు చేయడంతో సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదానీ ప్రకటించిన రూ. 100 కోట్లను తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేయొద్దని లేఖ రాసినట్లు తెలిపిన విషయం తెలిసిందే.