Site icon HashtagU Telugu

CM KCR: ‘డ్రగ్స్’పై కేసీఆర్ ఆదేశాలు బేఖాతర్!

Cm Kcr

Cm Kcr

దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఒకటి. విద్య, వైద్యం, ఉపాధి.. ఇలా ఎన్నో రంగాలకు అనుకూలం. అందుకే భాగ్యనగరానికి గ్లోబల్ సిటీగా పేరుంది. ఒకవైపు ఐటీసంస్థలు, వాణిజ్య కార్యాకలాపాలతో ప్రపంచస్థాయిలో ప్రభావం చూపుతుంటే.. మరోవైపు లెక్కకు మించి డ్రగ్స్ కేసులు వెలుగుచూస్తుండటంతో నగర ఖ్యాతి మసకబారుతోంది. ప్రధానంగా దేశ భవిష్యత్తుకు నడుంబిగించాల్సిన యువత డ్రగ్స్ బారిన పడటం, విలువైన జీవితాలను నాశనం చేసుకుంటుండటం ఆందోళన కల్గించే విషయం.

అయితే పల్లెల్లు, పట్టణాలు అనే తేడా లేకుండా నిషేధిత డ్రగ్స్ అంతటా  దొరుకుతుండటంతో యువత, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు డ్రగ్స్ బారిన పడుతున్నారు. గోవా తర్వాత ఆ స్థాయిలో డ్రగ్స్ విక్రయాలు హైదరాబాద్ లోనే జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో స్వయంగా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ వేదికగా ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. డ్రగ్స్ సరఫరాలో ఎంతటివాళ్లనైనా విడిచిపెట్టవద్దని, పోలీసుల కఠినంగా వ్యవహరించాలని  ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో రాడిసన్ బ్లూ హోటల్‌లోని పబ్‌పై దాడితో సహా హైదరాబాద్‌లో వరుస డ్రగ్స్ దందా వెలుగుచూస్తుండటంతో మరోసారి డ్రగ్స్ ఇష్యూ తెరపైకి వచ్చింది. అయితే డ్రగ్స్ పై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రతిపాదించిన ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్’ అవసరాన్ని మరోసారి దృష్టికి తెచ్చింది. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ, ఇతర భాగస్వాములతో సమన్వయంతో కొత్త వింగ్‌ను ప్రారంభించాలని ఈ సమావేశంలో స్వయంగా సీఎం పోలీసు శాఖను ఆదేశించినప్పటికీ నేటికీ కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం.

డ్రగ్స్ ను అరికట్టేందుకు నగర పోలీసులు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్-న్యూ)ను ప్రారంభించారు. ప్రారంభమైనప్పటి నుండి, H-NEW వివిధ రకాల డ్రగ్స్‌తో సంబంధం ఉన్న దాదాపు 20 కేసులను గుర్తించింది. 100 మంది వ్యక్తులను అరెస్టు చేసింది. అయితే కొత్త వింగ్ కార్యకలాపాలను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, మరికొన్ని రోజుల సమయం పట్టొచ్చని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. జనవరిలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం తర్వాత డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీసీఏ), ఇప్పుడు ఐఏఎస్‌ అధికారుల నేతృత్వంలోని ఎక్సైజ్‌ శాఖలకు ఐపీఎస్‌ అధికారులను నియమించాలనే ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చినా పెద్దగా ఏమీ జరగలేదు. ఎక్సైజ్ శాఖను బలోపేతం చేయడంతోపాటు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగం వంటి వాటిపై దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.