MLC By Poll : రెండు రోజులు వైన్ షాప్స్ బంద్

వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాలోని వైన్స్ షాపులు, బార్లను 48 గంటల పాటు బంద్ చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు

  • Written By:
  • Publish Date - May 24, 2024 / 05:47 PM IST

మందు బాబులకు బాడ్ న్యూస్. ఈ నెల 27న ఉమ్మడి నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భాంగా వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాలోని వైన్స్ షాపులు, బార్లను 48 గంటల పాటు బంద్ చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో రేపు (మే 25) సాయంత్రం 4.00 గంటల నుంచి 27న సాయంత్రం 4.00 గంటల వరకు వైన్ షాపులు, బార్‌లు బంద్ కానున్నాయి.
తెలంగాణలో లోక్​సభ ఎన్నికల పోరు ముగియగా, ఈ నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. 2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ తరఫున అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో పట్టభద్రుల ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ పోరులో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, గులాబీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఏనుగుల రాకేశ్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రచారానికి మరో 2 రోజులు మాత్రమే గడువు ఉండడంతో సన్నాహక భేటీలతో పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, మరోవైపు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ విజయం సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అదేవిధంగా ఈ ఎన్నికల్లోనూ బీజేపీ సైతం గట్టి పోటీ ఇస్తోంది. ఈ సమరంలో కలిసొచ్చేదెవరికో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Read Also : Jeevan Reddy : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫై భూకబ్జా కేసు నమోదు