Sharmila Strategy : షర్మిల వ్యూహం ఫలిస్తుందా.. వికటిస్తుందా?

తన డిమాండ్లను అంగీకరించలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని కక్షతోనే షర్మిల (Sharmila) సింగిల్ గా ఎన్నికల్లో దిగుతున్నట్టు అందరూ భావిస్తున్నారు.

  • Written By:
  • Updated On - October 12, 2023 / 01:29 PM IST

By: డా. ప్రసాదమూర్తి

Sharmila Strategy : తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది కానీ ఇంకా రాజకీయ పార్టీల వ్యూహాల ప్రతి వ్యూహాల మబ్బులు వీడలేదు. ఎన్నికల షెడ్యూల్ రావడానికి 50 రోజులు ముందుగానే అభ్యర్థుల జాబితాను విడుదల చేసి బీఆర్ఎస్ నాయకులు మంచి జోష్ లో ఉన్నారు. అధికార పార్టీకి ఏకైక ప్రతిద్వందిగా తెరపైకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థుల జాబితాను ఖరారు చేయలేదు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు నాయకుల ఉరుకులు పరుగులు ఆగలేదు. ఒక పార్టీలో టిక్కెట్ దొరక్కపోతే మరొక పార్టీలోకి దూకే జంపు జిలానీలు ఇంకా ఎంతమంది ఉన్నారో స్పష్టత రాలేదు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటిస్తే తప్ప ఇటు ప్రజలకు గాని, అటు పార్టీలకు గాని ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కొన్ని వారాలుగా అధిష్టానంతో కలిసి అన్ని కసరత్తులూ చేస్తోంది.

బీఆర్ఎస్ ఎప్పుడో తన అభ్యర్థులను ప్రకటించింది కాబట్టి అటు నుంచి తమ పార్టీలోకి ఉరికే నాయకులెవరూ, వారిలో ముఖ్యులు ఎవరూ, వారికి ఏ సీట్లు ఇవ్వాలి అనే విషయంలో కూడా ఇంకా ఎదురుచూపులోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇదే సమయంలో వైయస్సార్టీపి అధినేత్రి వైయస్ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని విలీనం చేస్తారని గత కొన్నాళ్లుగా జరుగుతున్న ఊహాగానాలకు బ్రేక్ పడింది. ఆమె సొంతంగా రాష్ట్రంలో 100 స్థానాలకు పోటీ చేస్తున్నట్టు ప్రకటించేశారు. దీనితో ఆమె ప్రభావం ఏ పార్టీ మీద ఉంటుంది.. ఏ మేరకు ఉంటుంది.. ఏ స్థానాల్లో ఉంటుంది అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.

We’re now on WhatsApp. Click to Join.

రాజకీయాల్లో కక్షలు.. పగలు.. పార్టీల మధ్యనే గాని ప్రజలకు ఉండవు. సామాన్య ఓటరు నుంచి పార్టీ కార్యకర్త వరకు తన ఓటు వృధా కాకూడదని అనుకుంటారు. వైయస్ షర్మిల (YS Sharmila) తన పార్టీని ఎన్నికల యుద్ధంలో ఒంటరిగా నడిపించడానికి సిద్ధం కావడం వెనుక కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం కుదరకపోవడమే కారణమన్న విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ తాను పెట్టిన షరతులను అంగీకరించలేదు. అందుకే ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయలేదు అనేది కూడా సామాన్యుడు సైతం అర్థం చేసుకునే విషయమే. ఇక మిగిలింది ఆమె రాష్ట్రమంతా పోటీ చేస్తుందా కొన్ని చోట్ల పోటీ చేస్తుందా? ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది? అసలు ఆమె బలం ఎంత? ఇలాంటి విషయాలు పార్టీలే కాదు ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు.

తన డిమాండ్లను అంగీకరించలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని కక్షతోనే షర్మిల (Sharmila) సింగిల్ గా ఎన్నికల్లో దిగుతున్నట్టు అందరూ భావిస్తున్నారు. మరో ఆప్షన్ కూడా ఆమెకు లేదు. అధికార బీఆర్ఎస్ పై యుద్ధం ప్రకటించిన తాను ఆ పార్టీతో చేతులు కలపలేదు. బిజెపితో కలిసే ప్రయత్నాలు ప్రారంభంలోనే బెడిసి కొట్టాయి. ఇప్పుడు కాంగ్రెస్ తో ఇలా అయింది. కాంగ్రెస్ ను దెబ్బ కొట్టడమే ఆమె ప్రధాన లక్ష్యమైంది. మరి అలా దెబ్బ తీసే బలం షర్మిల పార్టీకి తెలంగాణలో ఉందా? షర్మిల స్వయంగా తాను పోటీ చేసే రెండు స్థానాలను ప్రకటించారు పాలేరు, మిర్యాలగూడలో ఆమె పోటీ చేస్తారట. అలాగే తన తల్లి వైయస్ విజయమ్మతో సికింద్రాబాద్ నుండి పోటీ చేయిస్తారని చెబుతున్నారు.

మిత్రులుగా కలిసి పోటీ చేద్దామని కాంగ్రెస్ పార్టీతో విలీనానికి కూడా సిద్ధమై, ఇప్పుడు ఆ పార్టీతో ఒత్తు కుదరకపోవడం వల్ల తాను విజయం సాధించడం కంటే ఆ పార్టీ విజయవకాశాలను దెబ్బతీయటమే ప్రధాన ఎజెండాగా షర్మిల పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత ఎక్కడ ఉన్నదో అక్కడ కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు మెరుగుగా ఉంటాయి. అలాంటి చోట తన పార్టీ పోటీకి దిగితే తన లక్ష్యం నెరవేరవచ్చు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్లు ఎలాగూ మరోవైపు చూడరు. వ్యతిరేకత ఉన్న ఓటర్ల విషయంలోనే ప్రతిపక్షాలు వలలు వేస్తాయి. అలాంటి చోట్ల షర్మిల తన పార్టీ అభ్యర్థులను పోటీకి పెట్టాలని నిర్ణయించినట్లు కనిపిస్తోంది.

Also Read:  KCR: సారే కావాలి.. కారే రావాలి అంటూ దివ్యాంగుడి జన చైతన్య యాత్ర

తాను స్వయంగా పోటీ చేస్తానని చెబుతున్న రెండు నియోజకవర్గాలు పాలేరు, మిర్యాలగూడ రెండూ కాంగ్రెస్ కి, అలాగే కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సిద్ధంగా ఉన్న కమ్యూనిస్టులకు అనువైన స్థానాలు. వాటిలో అధికార పార్టీకి వ్యతిరేక ఓటర్లను ఏ కొద్దిశాతం చీల్చినా.. అది కాంగ్రెస్ పార్టీ మీద దెబ్బ పడుతుంది. సికింద్రాబాద్ లో తల్లి విజయమ్మను నిలబెట్టాలని షర్మిల చూస్తున్నారు. సికింద్రాబాద్ లో ఎక్కువగా ఆంధ్రా ఓటర్లు ఉంటారు. వారిలో రెడ్డి ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంటుంది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూలంగా వాతావరణం ఉంటుంది. అలాంటి చోట తల్లిని రంగంలో దింపడం ద్వారా తాము గెలవకపోయినా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి కాంగ్రెస్ ను దెబ్బతీయవచ్చు. ఇప్పటికే కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.

అలాంటప్పుడు ఆంధ్రా ఓటర్ల ప్రాబల్యం ఉన్నచోట రెడ్డి ఓటర్లను చీల్చడం సులువని షర్మిల భావించవచ్చు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం సంపూర్ణ మద్దతు అందించవచ్చు అన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. అలాంటి తరుణంలో తమ పార్టీ నుంచి రెడ్డి అభ్యర్థులను కొన్ని కీలకమైన స్థానాల్లో బరిలో దింపడం వల్ల ప్రతిపక్ష ఓట్లు చీల్చి కాంగ్రెస్ ను దెబ్బ కొట్టవచ్చు. అందుకే పిట్టా రామ్ రెడ్డి (సూర్యాపేట) అర్జున్ రెడ్డి (కల్వకుర్తి) వెంకటేశ్వర రెడ్డి (వనపర్తి) రామలింగారెడ్డి (గజ్వేల్) నరసింహారెడ్డి (సిద్దిపేట) ఇట్లా కొంతమంది అభ్యర్థులను కొన్ని కీలక స్థానాల్లో వైయస్ షర్మిల నిలబెడుతున్నారు.

ఎన్నికల రాజకీయం అంటే గెలుపు ప్రధానంగా ఉంటుంది కానీ తాము ఎలాగూ గెలవలేం అని తేలిపోయినప్పుడు గెలిచేవారిని ఓడించడమే ప్రధాన ధ్యేయంగా మారిపోతుంది. షర్మిల వ్యూహమంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయవకాశాలను బలహీనపరచి ఆ పార్టీకి ఓటమికి తాను కారణమైతే చాలు. కాంగ్రెస్ పార్టీ అపజయమే తన విజయంగా షర్మిల వ్యూహం రచించినట్టుగా కనిపిస్తోంది. అంతా సరేగాని కక్షపూరిత రాజకీయాలు, తన విజయావకాశాల కంటే ఎదుటివారి అపజయాలే కీలకంగా వ్యూహాలు రచించడం రాజకీయ పార్టీలకు సరిపడవచ్చు. కానీ ఓటర్లకు మాత్రం గెలుపు గుర్రాల మీదే ధ్యాస ఉంటుంది. ఏమాత్రం విజయావకాశాలు లేని పార్టీకి ఓటు వేసి తమ ఓటును వృధా చేసుకోవాలని ఓటర్లు కోరుకోరు. ఓటరు మైండ్ లో ఎప్పుడో అంతిమ నిర్ణయం రూపుదిద్దుకొని ఉంటుంది.

అదే అంతిమంగా బ్యాలెట్ పత్రం మీద ఆమోదముద్రగా పడుతుంది. షర్మిల ఒక్క సీటులోనైనా గెలిచినా గెలవకపోయినా కాంగ్రెస్ ను దెబ్బ తీయాలని రచిస్తున్న వ్యూహం మరి ఫలిస్తుందా.. వికటిస్తుందా.. ఇది డిసెంబర్ 3న తేలిపోతుంది. అప్పటివరకు వేచి చూడాల్సిందే. అయితే షర్మిల తీసుకున్న ఈనాటి నిర్ణయం తన రాజకీయ భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్న విషయం మాత్రం షర్మిలతో పాటు అందరూ అంగీకరించాల్సిందే. పరోక్షంగా అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చడానికే షర్మిల తెలంగాణలో తిష్ఠ వేసిందన్న ఆరోపణలకు కూడా ఆమె నిర్ణయం కొంత బలం చేకూర్చుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read:  YS Sharmila : కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి షర్మిల కుట్ర..?