Telangana Elections: ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను టీఆర్ఎస్ కోరుకుంటోందా? ఈ ముందస్తు మాటలేంటి?

టీఆర్ఎస్ నేతల మాటలను విశ్లేషిస్తే ఒక ప్రధాన అంశం కనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - May 17, 2022 / 10:30 AM IST

టీఆర్ఎస్ నేతల మాటలను విశ్లేషిస్తే ఒక ప్రధాన అంశం కనిపిస్తోంది. ముఖ్యంగా తుక్కుగూడ సభ తరువాత బీజేపీపై విసిరిన సవాళ్లను గమనిస్తే.. పార్లమెంట్ రద్దు చేయండి ఎన్నికలకు వెళ్దాం అంటూ కౌంటర్స్ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ గాని, తలసాని గాని ఇవే వ్యాఖ్యలు చేశారు. నిశితంగా గమనిస్తే.. టీఆర్ఎస్ ఈసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగాలని కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది.
నిజానికి ఒకేసారి ఎన్నికలు జరగడం అన్నది టీఆర్ఎస్ చేతిలో లేదు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ముందు అసెంబ్లీ జరగాల్సిందే. ఆ తరువాతే లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి.

గతంలో ఈ స్ట్రాటజీ సగమే సక్సెస్ అయింది. రెండోసారి అధికారంలోకి రాగలిగింది, కాని సారు కారు పదహారు నినాదంలో మాత్రం ఓడిపోయింది. ఈసారి రెండు రకాలుగా దెబ్బపడొచ్చన్న సంకేతాలు టీఆర్ఎస్‌కు స్పష్టంగా కనిపిస్తున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పొరపాటున అసెంబ్లీ ఎన్నికల్లో గాని ఫలితం అటూ ఇటూ వస్తే.. ఇక లోక్‌సభ స్థానాలపై పూర్తిగా నమ్మకం పోగొట్టుకోవాల్సిందే. గత ఎన్నికల్లో
బీజేపీ నాలుగు, కాంగ్రెస్ రెండు, ఎంఐఎం ఒకటి గెలిచింది. అసెంబ్లీ ఫలితాల్లో గనక టీఆర్ఎస్ చతికిలబడినా, ఓడినా.. ఈసారి ఆమాత్రం కూడా రాకపోవచ్చు. అందుకే, అసెంబ్లీ ఎన్నికలతో పాటే పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగితే.. కొంతైనా నష్ట నివారణ జరుగుతుందన్నది టీఆర్ఎస్ ఆలోచనగా కనిపిస్తోంది.

కారు గుర్తుకు ఓటు వేసేవాళ్లను, పార్లమెంట్ ఓటును కూడా కారుపైనే వేయించేలా ఏదో ఒక ప్లాన్ చేసుండే వారు. కాని, చేజేతులా ఆ అవకాశాన్ని పోగొట్టుకుంది టీఆర్ఎస్. అందుకే, మొన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వచ్చినప్పుడు… ఇద్దరం ఎన్నికలకు వెళ్దాం, ప్రజాక్షేత్రంలోనే చూసుకుందాం అంటూ సవాళ్లు విసిరింది ఈ కోణంలోనే అన్నది రాజకీ విశ్లేషకుల మాట. అయినా.. ఒక్క టీఆర్ఎస్ కోరుకున్నంత మాత్రాన పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు వస్తాయనుకోవడం అసమంజసం, అసంభవం. అయినా సరే టీఆర్ఎస్ నేతలు తమ మాటలు, సవాళ్లతో ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా మాత్రం కనిపిస్తోంది.