Telangana Politics: దళిత సీఎం ‘డిక్లరేషన్’ కావాలి !

దళితుడ్ని ముఖ్యమంత్రి చేయగలరా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే దళిత ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించగల సాహసం కాంగ్రెస్ పార్టీ చేయగలదా ?

  • Written By:
  • Updated On - May 7, 2022 / 01:24 PM IST

by Sk.Zakeer

దళితుడ్ని ముఖ్యమంత్రి చేయగలరా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే దళిత ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించగల సాహసం కాంగ్రెస్ పార్టీ చేయగలదా ? అనే ప్రశ్నలకు ఆ పార్టీ హైకమాండ్ జవాబివ్వవలసి ఉన్నది.రైతు సంఘర్షణ పేరుతో పెట్టినా మరో పేరుతో పెట్టినా ముమ్మాటికీ రాజకీయసభే ! రాజకీయ పార్టీ రాజకీయ కార్యకలాపాలు కాకుండా ఇంకేమి చేస్తుంది. కాంగ్రెస్ సన్నాసుల మఠం కాదు కదా ! తనకు ముఖ్యమంత్రి పదవి వద్దని,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే తన ప్రాధాన్యత అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ‘వరంగల్ డిక్లరేషన్’ సభలో అన్నారు.ఇప్పుడు ‘ముఖ్యమంత్రి’ మాట ఎందుకు ? ఎవరు సీఎం కావాలో ప్రజలు నిర్ణయిస్తారు. ఎవర్ని అధికారంలోకి తీసుకురావాలన్నది ప్రజలు ఇవ్వనున్న అంతిమతీర్పు !

‘డిక్లరేషన్’ అంటే తెలుగులో వాంగ్మూలం అనీ,ప్రకటన అనీ,నివేదిక అనీ చాలా అర్ధాలున్నవి.వరంగల్ లో రైతు సంఘర్షణ సభ ద్వారా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘అధికారిక ప్రకటన’ చేశారనే అనుకోవాలి. తెలంగాణలో రైతాంగం, దళితులు, మైనారిటీలు, ఆదివాసీలు,ఇతర వెనుకబడిన వర్గాలు,నిరుద్యోగులు వంటి వివిధ సెక్షన్ల ప్రజలతో ‘కనెక్టు’ కావడానికి రాహుల్ గట్టిగానే ప్రయత్నించారు. అయితే ఆయా వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీల సంగతెలా ఉన్నా,అదే వర్గాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేయగలరా ? అన్నదే ఇప్పుడు చర్చ! రాహుల్ గాంధీ తన పర్యటనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్యకు నివాళులు అర్పించడం శుభ పరిణామం.కానీ ఆ దళిత నాయకునికి ‘నివాళి’తోనే సరిపెట్టుకుంటారా లేక దళితులకు రాజకీయ అధికారంలో తగిన ‘వాటా’ ఇవ్వగలరా ? అనేది ప్రశ్నార్థకమే! ఇటీవల కత్తి వెంకటస్వామి,సతీష్ మాదిగ వంటి వారి మాటల్లో చెప్పాలంటే ‘తెలంగాణ కాంగ్రెస్ లో రెడ్ల ఆధిపత్యం నిర్మూలన జరగనంత వరకు దళితులకు,బలహీనవర్గాలకు రాజకీయ అధికారంలో వాటా లభించదు’.దళితులకు రాజ్యాధికారం ఇవ్వడమే దామోదరంసంజీవయ్యకు సరైన నివాళి!

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారితోనూ, ‘కేసీఆర్ వ్యతిరేక మీడియా సంస్థల’ అధిపతులతోనూ రాహుల్ గాంధీ హోటల్‌లోనే ప్రత్యేకంగా సమావేశం కావడం ఒక ముఖ్యమైన ఘట్టం.ఆశ్చర్యంగా సదరు మీడియా సంస్థల అధిపతులంతా ‘చంద్రబాబు అనుకూల,జగన్ వ్యతిరేక ‘వ్యక్తులు కావడం మరో కోణం! ప్రజాగాయకుడు గద్దర్ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.గద్దర్ ఇదివరకు టెన్ జన్ పథ్ లో కాలు మోపిన మనిషే.తర్వాత ఏమి జరిగిందో తెలియదు కానీ ఆయన కాంగ్రెస్ తో కలిసి ప్రయాణించకుండా దూరంగానే ఉన్నారు.ఇటీవల గద్దర్ ఎక్కువగా ‘భక్తి రస’ కార్యక్రమాల్లో కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని రాహుల్ మరోసారి స్పష్టం చేశారు.టిఆర్ఎస్ తో పొత్తుపై మాట్లాడే కాంగ్రెస్ నాయకులను పార్టీ నుంచి బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు. ఎంత పెద్దవారినైనా పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పారు. టీఆర్ఎస్‌తో పొత్తు కోరుకునే కాంగ్రెస్ నాయకులు ఎవరైనా టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోవచ్చని రాహుల్ అన్నారు.కేసీఆర్ తో పొత్తులు కోరుకుంటున్న నాయకులు ఎవరో రాహుల్ గాంధీకి,మాణిక్యం ఠాగూర్,ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ కు ఖచ్చితంగా తెలుసు.రాహుల్ రెండు రోజుల పర్యటనలో ‘కేసీఆర్ కు అండర్ కవర్ గా పనిచేస్తున్న వ్యక్తులు’ ఆయన చుట్టే ఉన్నారు. ”ఎంతోమంది త్యాగాలతో తెలంగాణ వచ్చింది. ఏ ఒక్కరి వలన తెలంగాణ కల సాకారం కాలేదు” అని రాహుల్ గాంధీ అన్నారు.కానీ 2014 లో తెలంగాణ అవతరణ తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రచారం చేయడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది.కేసీఆర్ ను దూషించడమే పనిగా పెట్టుకున్న టీకాంగ్రెస్ నాయకులు అసలు పని వదిలేశారు.2018లోనూ దారుణమైన పెర్ఫార్మెన్స్ చూపింది.పైగా గెలిచినా 19 మంది ఎమ్మెల్యేలలో 12 మంది టిఆర్ఎస్ లో ‘విలీనం’ కావడం పార్టీకి చావుదెబ్బ. .

”తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడలేదు. రాజరికం నడుస్తోంది. కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చాము”అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కంఠశోషగా మిగిలిపోతాయి.తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లు కావస్తున్నవి.తెలంగాణ అవతరణకు ఎవరి కాంట్రిబ్యూషన్ ఏమిటో 2022 లో కానీ 2023,2024 లో కానీ చర్చించడం అర్ధరహితం.నిష్ప్రయోజనం. ప్రజాభిమానం పొందనంత వరకు,దూరమై పోయిన దళిత, మైనారిటీ,బహుజన వర్గాలను మరలా ఆకర్షించనంతవరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కేసీఆర్ తో పోటీ పడజాలదు.అసాధ్యం కూడా.

ఇక తెలంగాణ ఇచ్చింది తామే అంటూ కాంగ్రెస్ నాయకత్వం ఎంతగా గొంతు చించుకున్నా ఫలితం ఉండదు.కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో టీకాంగ్రెస్ విఫలమవుతున్నట్టు ఆ పార్టీలోనే చర్చ ఉన్నది.అలాగే కొన్ని అంశాల్లో ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొని ఉన్న అసంతృప్తిని,వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకునే విషయంలోనూ సరైన వ్యూహం లేదు.ఎత్తుగడలు లేవు.2023 లో జరిగే ఎన్నికల్లో ‘తెలంగాణ ఇచ్చినదెవరు’ అనే అంశం ఎంతమాత్రం ఒక ఫ్యాక్టర్ కాబోదు.అది ముగిసిన అధ్యాయం.ఒడిసిన ముచ్చట.టిఆర్ఎస్ ఏమి చేయలేదో,తాము ఏమి చేయగలమో కాంగ్రెస్ పార్టీ చెప్పగలగాలి.కేసీఆర్ అభివృద్ధి నమూనాకు ‘ప్రత్యామ్నాయ నమూనా’ను వెల్లడించగలగాలి.ప్రజల్ని కన్విన్సు చేయగలగాలి.అప్పుడే కాంగ్రెస్ కు అధికారం దక్కవచ్చు. అంతే తప్ప ఇంకా పాత చింతకాయ పచ్చడి మాటలను జనం నమ్మేలా లేరు.జనానికి ఆచరణలో కనిపించాలి.దాన్ని వాళ్ళు నమ్మాలి.కాంగ్రెస్ కు అధికారం ఇస్తే పదవుల కోసం కొట్టుకుంటారనో,గెలిచిన ఎమ్మెల్యేలు కేసీఆర్ గూటికి చేరిపోతారనో ప్రజలలో నాటుకుపోయి ఉన్న అభిప్రాయాన్ని తొలగించడం సాధ్యమేనా అన్నది సమీక్షించుకోవలసి ఉన్నది.

”ప్రజల్లో నిరంతరం పనిచేసే వ్యక్తులకే టిక్కెట్లు ఇవ్వాల”న్నది టీకాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపాదన.ఈ ప్రతిపాదన సమంజసమైనది, ఎవరూ ఆక్షేపించలేనిది.కానీ ‘కోటా’ ల మాటేమిటి? తాను ప్రతిపాదించిన అంశానికి అసలు ఆయనే కట్టుబడి ఉంటారా? ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన జడ్చర్ల,ఉమ్మడి ఖమ్మంకు చెందిన పినపాక వంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు తాము చెప్పిన వాండ్లకే టికెట్టు ఇవ్వాలని కోరుతున్న నాయకులు ఎవరు? తాను చెప్పిన వాండ్లకే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు,పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో టికెట్లు ఇవ్వ్వాలని డిమాండ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ఎవరు? చింత చచ్చినా పులుపు చావని వాళ్ళు కాంగ్రెస్ లో కోకొల్లలు.’అధికార దాహం’ తో ఉన్న వాళ్ళు లెక్కకు మించి కనిపిస్తున్నారు.అందుకే ఈ జాడ్యం వారిని వదిలిపెట్టడం లేదు.

తెలంగాణలో 19 ఎస్.సీ,12 ఎస్.టీ.అసెంబ్లీ నియోజకవర్గాలున్నవి.వాటిపై బీజేపీ ఇప్ప్పటికే ఫోకస్ పెట్టింది.ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం ‘ప్రత్యేక కార్యాచరణ’అమలు చేస్తున్నారు.ఇందుకోసం ఒక కమిటీని కూడా నియమించారు.టీ.కాంగ్రెస్ ఈ వ్యవహారంలో బాగా వెనుకబడి ఉన్నది.టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ‘గాంధీభవన్’ ను చక్కబెట్టుకోవడానికే సమయం సరిపోవడం లేదు.జగ్గారెడ్డి ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నాయకుల ‘అసమ్మతి’ తాత్కాలికంగా సద్దుమణిగినందున ఇప్పుడిప్పుడే పార్టీ పటిష్టం కోసం రేవంత్ వ్యూహాలు రచిస్తున్నారు.రాహుల్ గాంధీ రాక పార్టీకే కాకుండా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి నాయకత్వానికి గొప్ప ఊపునిచ్చింది.ఇది రేవంత్ సమర్ధతకు బూస్ట్ వంటిది.

ఇదిలా ఉండగా కాంగ్రెస్,బీజేపీ విమర్శలను దీటుగా తిప్పిగొట్టగల వాళ్ళు టిఆర్ఎస్ లో కనీసం అరడజను మందికి పైగా ఉన్నారు.టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మంత్రులు నిరంజనరెడ్డి, జగదీశ్ రెడ్డి,హరీశ్ రావు,ఎమ్మెల్సీ కవిత,ప్రభుత్వ విప్ బాల్క
సుమన్ వంటి వారు ప్రత్యర్థులను చీల్చి చెండాడుతున్నారు.కాంగ్రెస్,బీజేపీల కామెంట్స్ కు టిఆర్ఎస్ నాయకుల నుంచి తక్షణ స్పందన కనిపిస్తోంది.రాజకీయపార్టీ సమర్ధ నాయకత్వానికి ఇలాంటివి మచ్చుతునకలుగా భావించాలి.”రాహుల్ గాంధీకి వడ్లు తెలియదు.ఎడ్లు తెలియదు.పొలిటికల్ టూరిస్టులు వచ్చిపోతుంటారు.పట్టించుకోకండి. మోనా మహబూబ్ నగర్ కు ఒకడు,వరంగల్ కు నిన్న ఇంకొకడు వచ్చి వెళ్లారు” అంటూ కేటీఆర్ శనివారం వరంగల్ పర్యటనలో వ్యంగాస్త్రాలు సంధించారు.ఇలా మెరుపు వేగంతో ప్రత్యర్థులపై ‘దాడి చేయగల’ వాళ్ళు టిఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలలో లేరు.ఇది టిఆర్ఎస్ కు అదనపు బలం.అలాగే ఇతర పార్టీలన్నీ ‘బయటి పార్టీల’ని,తమ పార్టీ మాత్రమే ‘ఇంటి పార్టీ’ అని ప్రజల మనస్సులో ముద్ర వేయడంలో టిఆర్ఎస్ నాయకత్వం నిరంతరం సక్సె స్ అవుతున్నది.కేసీఆర్ సిలబస్ ను అర్ధం చేసుకోవడం,దానికి కౌంటర్ గా వ్యూహాన్ని డిజైను చేయడం చాలా కష్టం!!