TRS Politics: టీఆర్ఎస్ కు ‘ఆ ముగ్గురు’ దడ.. పార్టీ వీడితే అంతేనా!

టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తరువాత తెలంగాణలో ఆ పార్టీకి ఎదురేలేదు. రాజకీయంగా బాగా లబ్దిపొందింది. సీట్లు, ఓట్లు పరంగా అప్పుడప్పుడు ఇబ్బందులు పడినా..

  • Written By:
  • Updated On - March 13, 2022 / 12:50 PM IST

టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తరువాత తెలంగాణలో ఆ పార్టీకి ఎదురేలేదు. రాజకీయంగా బాగా లబ్దిపొందింది. సీట్లు, ఓట్లు పరంగా అప్పుడప్పుడు ఇబ్బందులు పడినా.. చివరకు 2014లో అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి నిన్నమొన్నటి వరకు కేసీఆర్ చేసిందే శాసనం. పార్టీలో కాని, ప్రభుత్వంలో కాని ఆయనే నెంబర్ వన్. కానీ గత కొన్నాళ్లుగా కేసీఆర్ పైన, టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా బీజేపీ రాజకీయ దాడి చేస్తోంది. దీంతోపాటు ఇప్పుడు చేరికలు, వలసలను బాగా ప్రోత్సహిస్తోంది. అందులో భాగమే ఆ ముగ్గురు నేతలపై గురి.

ఇన్నాళ్లూ వేరే పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి వలసలు ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారినట్టే కనిపిస్తోంది. అందుకే గులాబీ తోటలో ఇమడలేకపోతున్న అసంతృప్తులకు గాలం వేసే పనిలో సీరియస్ గా పనిచేస్తోంది బీజేపీ. అలాంటివారిలో ముగ్గురు నేతలతో టచ్ లో ఉంది. ఎందుకంటే ఆ ముగ్గురు కీలక నేతలను హైకమాండ్ ఈమధ్య కాలంలో అసలు పట్టించుకోవడమే లేదు. పైగా ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. అందుకే వారికి కూడా ఇది చాలా కీలకమైన సమయం.

బీజేపీతో టచ్ లో ఉన్నట్టుగా చెబుతున్న ఆ నేతలు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇదే ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వీరు ముగ్గురికీ టీఆర్ఎస్ లో అంతగా ప్రాధాన్యత దక్కడం లేదని పార్టీ వర్గాలే భావిస్తున్నాయి. అందుకే వారి అనుచర గణం నుంచి కూడా పార్టీ మార్పుపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.

జూపల్లి కాంగ్రెస్ తో పాటు టీఆర్ఎస్ హయాంలోనూ మంత్రిగా చేశారు. కానీ గత ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి పోటీ చేసినా కాంగ్రెస్ చేతిలో ఓటమి తప్పలేదు. తరువాత పార్టీ ఆయనను దూరం పెట్టింది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను కాకుండా సొంత అభ్యర్థులను నిలబెట్టారు. విజయం సాధించారు. అప్పటి నుంచి కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారని.. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ కష్టమన్న అభిప్రాయం ఉంది. దీంతో ఆయన కమలం గూటికి చేరుతారని ప్రచారం జరుగుతోంది.

తుమ్మల నాగేశ్వరరావుకు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ టిక్కెట్ ఇస్తుందన్న గ్యారంటీ లేదు. హైకమాండ్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ కనిపించడం లేదు. పైగా ఆయన సొంత నియోజకవర్గంలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఉపేంద్ర రెడ్డిని గులాబీ బాస్ అక్కున చేర్చుకున్నారు. అందుకే ఆయన కూడా పార్టీ నుంచి బయటకు రావాలనుకుంటున్నట్టు సమాచారం. అదే జరిగితే.. ఖమ్మంలో టీఆర్ఎస్ కు క్షేత్రస్థాయిలో రాజకీయంగా కొన్ని ఇబ్బందులు తప్పవు.

ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిస్థితి చూస్తే.. ఆయన వర్గరాజకీయాలు చేస్తున్నారని పార్టీ అధిష్టానం గుర్రుగా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారని పార్టీ భావిస్తోంది. కాకపోతే టీఆర్ఎస్ తనకు టిక్కెట్ ఇస్తే కారులోనే ఉంటారని.. లేకపోతే కమలం గూటికి వెళ్లొచ్చని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆయన కూడా పార్టీని వీడితే.. ఖమ్మంలో గులాబీకి దెబ్బ పడినట్టే. మరి గులాబీ బాస్ దీనిని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు?

ఒకవేళ ఈ ముగ్గురు నేతలూ పార్టీని వీడితే మాత్రం టీఆర్ఎస్ కు లాభం ఎంతో చెప్పలేం కాని.. క్షేత్రస్థాయిలో నష్టం తప్పదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.