Telugu States Polls: ఉమ్మ‌డిగా ఎన్నిక‌ల దిశ‌గా..!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల హ‌డావుడి క‌నిపిస్తోంది. అన్న‌ద‌మ్ములుగా మెలుగుతోన్న కేసీఆర్, జ‌గ‌న్ ఒకేసారి ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

  • Written By:
  • Updated On - May 7, 2022 / 01:23 PM IST

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల హ‌డావుడి క‌నిపిస్తోంది. అన్న‌ద‌మ్ములుగా మెలుగుతోన్న కేసీఆర్, జ‌గ‌న్ ఒకేసారి ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుత క్షేత్ర‌స్థాయి ప‌రిణామాల క్ర‌మంలో సెటిల‌ర్ల ఓటు బ్యాంకును బేస్ చేసుకుని ఇద్ద‌రూ ఒకే టైంలో ఎన్నిక‌ల‌కు వెళ్లే లాజిక్ ను ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌, వైసీపీ పార్టీలు ఎన్నిక‌ల ప్ర‌చారానికి తెర‌దీశాయి. దీంతో చంద్ర‌బాబు, రేవంత్ గత ఏడాది నుంచి చెబుతోన్న `ముంద‌స్తు` కంటే ఒకేసారి తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎన్నిక‌ల‌కు వెళ్లే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఆ మేర‌కు ప్ర‌శాంత్ కిషోర్ రూట్ మ్యాప్ ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్ నాటికి తెలంగాణ ప్ర‌భుత్వం గ‌డువు ముగిస్తుంది. ఆరు నెల‌లు ముందుగా అంటే వ‌చ్చే ఏడాది మే లేదా జూన్ నెల‌లో షెడ్యూల్ ను ప్ర‌క‌టించ‌డానికి ఈసీకి అధికారం ఉంది. అదే, ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి 2024 మే వ‌ర‌కు గ‌డువు ఉంది. అంటే వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్ షెడ్యూల్ ప్ర‌క‌టించే అధికారం కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఉంది. ఒక వేళ ఇద్ద‌రు సీఎంలు క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లాలి అనుకుంటే జ‌గ‌న్ క‌నీసం ఏడాది ముందుగా ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సి ఉంటుంది. తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం ఈసారి గ‌డువు వ‌ర‌కు ఉన్న త‌రువాత ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి అవకాశం ఉంది. జ‌గ‌న్ స‌ర్కార్ మాత్రం ముందస్తుకు సిద్ధ‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అలాంటి ప్ర‌చారానికి బ‌లం చేకూరేలా తాజాగా స‌జ్జ‌ల రామ‌క్రిష్ణాడ్డి ఏడాదికో, రెండేళ్ల‌కో ఎన్నిక‌లంటూ ప‌రోక్షంగా ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌స్తావ‌న తీసుకురావ‌డంతో రెండు రాష్ట్రాల్లోనూ చ‌ర్చ‌నీయాశంగా మారింది.

అసెంబ్లీ , లోక్ స‌భ ఎన్నిక‌లు వేర్వేరుగా జ‌రిగితే ప్రాంతీయ పార్టీల‌కు అనుకూలంగా ఉంటుంది. ఆ ఈక్వేష‌న్ 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఫ‌లించింది. పైగా న్యూట్ర‌ల్ ఓట‌ర్లు ఎక్కువ‌గా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్రాంతీయ పార్టీల‌ వైపు, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో జాతీయ పార్టీల‌కు మ‌ద్ధ‌తు ఇస్తుంటారు. అధికారాన్ని డిసైడ్ చేసే న్యూట్ర‌ల్ ఓట‌రు నాడి ప్ర‌కారం తెలుగు రాష్ట్రాల సీఎంలు ముంద‌డుగు వేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అంతేకాదు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆశించిన ఫ‌లితాల‌ను సాధిస్తే, జాతీయ రాజ‌కీయాల్లో వ్యూహాల‌కు స్వేచ్ఛ‌గా ప‌దును పెట్ట‌డానికి అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే బీహార్ రాష్ట్రం మీద క‌న్నేసిన కేసీఆర్ ఆ రాష్ట్రం నుంచి పీకే, అస‌రుద్దీన్ రూపంలో కొన్నినైనా ఎంపీల‌ను సంపాదించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. అన్న‌ద‌మ్ములుగా ఉంటోన్న కేసీఆర్, జ‌గ‌న్ పార్టీల మ‌ధ్య ఎలాగూ స్నేహ‌భావం ఉంది. ఆ రెండు పార్టీల మ‌ధ్య క్విడ్ ప్రో కో న‌డుస్తోంది. దీంతో జ‌గ‌న్ కు వ‌చ్చే ఎంపీల సంఖ్య కూడా కేసీఆర్ కు అండ‌గా ఉంటుంది. ఫ‌లితంగా జాతీయ రాజ‌కీయాల్లో `కీ` రోల్ పోషించ‌డానికి లైన్ క్లియ‌ర్ అవుతుంది.

ఏడాదిన్న‌ర నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబు చెప్పిన `ముంద‌స్తు` మాట నిజ‌మ‌య్యేలా ఉంది. ఆ దిశ‌గా వైసీపీ కీల‌క నేత సాయిరెడ్డి కూడా నాలుగు నెల‌ల క్రితం ట్వీట్ చేయ‌డం సంచ‌ల‌నంగా అయింది. ఒక వేళ ముంద‌స్తు వ‌స్తే ఈసారి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ఉండ‌దంటూ సాయిరెడ్డి సెటైర్ వేశాడు. కానీ, ముంద‌స్తు ఎన్నిక‌ల‌ను మాత్రం ఆయ‌న ఖండించ‌లేదు. ఇప్పుడు తాజాగా స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి నోట ఏడాది ముందు ఎన్నిక‌ల ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. ఫ‌లితంగా కేసీఆర్‌, జ‌గ‌న్ ఇద్ద‌రూ క‌లిసి ఒకేసారి ఎన్నిక‌ల‌కు వెళ్లే మాస్ట‌ర్ ప్లాన్ సిద్ధ‌మ‌వుతోంద‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు భావిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని ప‌రిస్థితుల‌పై ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వేలు చేస్తున్నారు. ఇద్ద‌రు సీఎంల‌పై వ్య‌తిరేక‌త ఉంద‌ని స‌ర్వేల సారాంశం. ఎంత మోతాదులో వ్య‌తిరేక‌త ఉందో కూడా స్ప‌ష్టం చేశాడ‌ట‌. దానికి విరుగుడుగా ఎలాంటి రాజ‌కీయాలు చేయాలో..పీకే ఇప్ప‌టికే తెలియ‌చేశాడ‌ని ఆ పార్టీల్లోని టాక్‌. ఆంధ్రా రూపంలో సెంటిమెంట్ ను బాగా రాజేస్తేనే కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేశాడ‌ట‌. ఒక వేళ అదే జ‌రిగితే, తెలంగాణ‌లోని ఏపీ ఓట‌ర్లు టీఆర్ఎస్ కు ఈసారి ఓటు వేసే అవ‌కాశంలేదు. అందుకే, రెండు రాష్ట్రాల‌కు ఒకేసారి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తే ఆ బెడ‌ద నుంచి కేసీఆర్ సేఫ్ అవుతాడు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 15 ల‌క్ష‌ల మంది సెటిల‌ర్ల ఓట్లు ఉన్నాయ‌ని అంచ‌నా. తెలంగాణ వ్యాప్తంగా 60 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో సెటిల‌ర్ల ప్రాబ‌ల్యం ఉంటుంది. ప్ర‌త్యేకించి హైద‌రాబాద్, రంగారెడ్డి, న‌ల్గొండ‌, ఖ‌మ్మం, నిజామాబాద్, వరంగల్ జిల్లాలోని కొంత భాగం సెటిల‌ర్ల ఓట్లు ఎక్కువ‌గా ఉన్నాయి. ఏపీ, తెలంగాణ అసెంబ్లీల‌కు ఒకేసారి ఎన్నిక‌లు జ‌రిగితే, సెటిల‌ర్లు ఎక్కువ మంది ఏపీకి వెళ‌తారు. ఇప్ప‌టికే తెలంగాణ అసెంబ్లీ వేదిక‌గా ఏపీపై సెటైర్లు వేస్తోన్న కేసీఆర్ వాల‌కాన్ని సెటిల‌ర్లు గ‌మ‌నిస్తున్నారు. రాబోవు ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కు వ్య‌తిరేకంగా ఓటు చేసే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంద‌ని పీకే స‌ర్వే సారాంశం. అందుకే, ఒక ఏడాది ముందుకు జ‌గ‌న్ ను ఎన్నిక‌ల‌కు తీసుకొస్తే సెటిల‌ర్ల బెడ‌ద నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చ‌ని కేసీఆర్ యోచ‌న‌ట‌.

ప్ర‌స్తుతం జ‌గ‌న్ స‌ర్కార్ మీద ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంది. ఆ విష‌యాన్ని పీకే స‌ర్వేల ద్వారా తెలుసుకున్న జ‌గ‌న్ ముంద‌స్తు వైపు ఆలోచిస్తున్నాడ‌ని టాక్‌. 2024వ‌ర‌కు ఉంటే, మ‌రింత వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని పీకే ఇచ్చిన స‌ర్వే స‌ల‌హాగా చెబుతున్నారు. ఒక వైపు కేసీఆర్ ఇంకో వైపు జ‌గ‌న్ గెలుపును కోరుకుంటోన్న పీకే మ‌ధ్యే మార్గంగా జ‌గ‌న్ ను ముందస్తుకు తీసుకొచ్చే ప్లాన్ చేశార‌ని వినికిడి. అదే, జ‌రిగితే, సెటిల‌ర్లు సుమారు 15 ల‌క్ష‌ల ఓట‌ర్లు ఏపీకి వెళ్లే అవ‌కాశం ఉంది. వాళ్ల‌లో ఎక్కువ మంది జ‌గ‌న్ వైపు ఉన్నార‌ని అంచ‌నా. ఇలాంటి ఈక్వేష‌న్ల న‌డుమ ముంద‌స్తు ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆ విష‌యాన్ని చంద్ర‌బాబు మ‌హిళాదినోత్స‌వ రోజున సూచాయ‌గా వెల్ల‌డించాడు. చాలా కాలంగా ఆయ‌న ముంద‌స్తు గురించి చెబుతున్న‌ప్ప‌టికీ పెద్ద‌గా వైసీపీ ప‌ట్టించుకోలేదు. కానీ, ఈసారి మాత్రం ఆయ‌న స్టేట్ మెంట్ కు కొన‌సాగింపుగా అన్న‌ట్టు సాయిరెడ్డి అప్ప‌ట్లో చేసిన‌ ట్వీట్‌, స‌జ్జ‌ల తాజాగా చేసిన ఏడాదికి ఎన్నిక‌ల వ్యాఖ్య‌లు తోడు కావ‌డంతో అన్న‌ద‌మ్ములుగా మెలుగుతోన్న కేసీఆర్, జ‌గ‌న్ ఒకేసారి ఎన్నిక‌ల‌కు వెళ‌తార‌ని భావించ‌కుండా ఉండ‌లేం!