By: డా. ప్రసాదమూర్తి
South First Pre Poll Survey : తెలంగాణ ఎన్నికల సమయం ఇక దగ్గరకు వచ్చింది. రేపటితో ప్రచారం ముగుస్తుంది. అతి కీలకమైన ఈ చివరి దశలో అన్ని పార్టీలకు ప్రతిక్షణమూ అమూల్యమైనదే. ఆఖరి రోజుల్లో ఏ పార్టీ పోల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో, దాని మీదే ఓటర్ నిర్ణయం ఆధారపడుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే తరుణంలో వివిధ జాతీయ స్థాయి సంస్థలు చేస్తున్న సర్వేలు కూడా ఓటర్ మైండ్ సెట్ మీద తీవ్రమైన ప్రభావం చూపించవచ్చు అనేది మరో అంచనా. తాజాగా వెలువడిన సౌత్ ఫస్ట్ ప్రీ పోల్ సర్వే తెలంగాణలో ఆసక్తికరమైన పరిణామాలు ఉండవచ్చని చెప్తోంది. పీపుల్స్ పల్స్ సంస్థతో కలిసి సౌత్ ఫస్ట్ వెబ్సైట్ చేసిన ఈ సర్వే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు రావచ్చు అని చెప్తోంది. ఈ సర్వే ప్రకారం అధికార బీఆర్ఎస్ పార్టీ కంటే ఓటు శాతంలోనూ సీట్ల శాతంలోనూ కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని గణనీయంగా పెంచుకుంటుందని అర్థమవుతుంది.
We’re Now on WhatsApp. Click to Join.
2018లో 47% ఓట్లను కైవసం చేసుకున్న అధికార బిఆర్ఎస్ పార్టీ ఈ తాజా సర్వే ప్రకారం 37. 6% మాత్రమే సంపాదించగలదని చెప్తోంది. అంటే గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో అధికార పార్టీ పది శాతం ఓట్లను కోల్పోతున్నట్టు లెక్క. ఇది ఆ పార్టీకి తీవ్రమైన నష్టం కలిగించే ఫలితమే. ఇది ఇలా ఉంటే ఈ తాజా సర్వే ప్రకారం గతంలో 28.4 శాతం మాత్రమే ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 42.5% ఓట్లు సాధిస్తుందని తెలుస్తుంది. ఇదే నిజమైతే కాంగ్రెస్ పార్టీకి 57 నుంచి 62 స్థానాలు, బీఆర్ఎస్ కు 41 నుంచి 48 మధ్య స్థానాలు వస్తాయని సౌత్ ఫస్ట్ సర్వే (South First Survey) చెబుతోంది. అలాగే బీజేపీకి గతంలో ఏడు శాతం మాత్రమే ఓట్లు రాగా ఇప్పుడు ఆ ఓటు శాతం రెట్టింపు అయ్యే అవకాశం ఉన్నట్టు ఈ సర్వే ద్వారా అర్థమవుతుంది. గతంలో బిజెపికి ఏడు శాతం మాత్రమే ఓట్లు వస్తే అది ఇప్పుడు 13.2% గా పెరుగుతుంది. కానీ ఓటు శాతం పెరిగినా బిజెపికి మూడు నుంచి 6 మధ్యలో మాత్రమే స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే చెబుతోంది.
ఈ సర్వేలో మరో సంచలమైన విషయం బయటపడింది. తెలంగాణలో పురుషులలో అత్యధిక శాతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మహిళలు బీఆర్ఎస్ వైపు ఉన్నట్టు సర్వే చెప్తోంది. అయితే మహిళల మొగ్గులో రెండు పార్టీల మధ్య రెండు శాతం మాత్రమే తేడా కనిపిస్తుంది. కానీ పురుషుల సంఖ్యలో దాదాపు 11% పైగా ఆ తేడా కనిపిస్తుంది.
ఈ సర్వే ప్రకారం ఏం జరగొచ్చు?:
సౌత్ ఫస్ట్ సర్వే (South First Survey) ప్రకారం కాంగ్రెస్ పార్టీవారు చెబుతున్నట్టు 80 కి పైగా సీట్లు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ సర్వే ఇచ్చిన లెక్కల ద్వారా చూస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి 60 కంటే తక్కువ స్థానాలు ఏమాత్రం తగ్గినా అప్పుడు ఏం జరుగుతుందనేది పెద్ద ప్రశ్నార్థకం. బిజెపి, ఎంఐఎం కలిసి 10 లేదా 12 స్థానాలు సాధించినా ఒకవేళ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే తిరిగి బీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వం ఏర్పరిచే అవకాశాలు ఉంటాయి. అలాగే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీలో ఏ కొద్ది శాతం తగ్గినా ఎమ్మెల్యేల అమ్మకాలు కొనుగోళ్ళ వ్యవహారం జోరుగా సాగుతుంది. అప్పుడిక ఓటర్ల తీర్పుకి విలువ ఏమీ ఉండదు. కొనుక్కునే వాడి శక్తిని బట్టి, అమ్ముడు పోయే వాడి స్వార్థాన్ని బట్టి ఎన్నికల అనంతర రాజకీయం ఉంటుంది.
ఇప్పటికే వచ్చిన అనేక సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఒక ఎడ్జ్ ఉంటుందని మాత్రం అర్థమైంది. ఆ ఎడ్జ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతగా ఉంటుందా లేక మెజార్టీ స్వల్పంగా తగ్గి రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే అది తీవ్ర గందరగోళానికి దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా, చేయకపోయినా ఆ పార్టీకి గతంలో కంటే ఓట్ల శాతం లోనూ సీట్ల శాతం లోను గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. అది దేశవ్యాప్త రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి చాలా లాభం చేకూర్చే విషయం.
ఇంకా కొద్ది రోజుల్లోనే విషయం తేలిపోతుంది. చూడాలి, ఓటర్ తీర్పు ఎలా ఉంటుందో. ఆ తీర్పు స్పష్టంగా ఉంటుందా అస్పష్టంగా ఉంటుందా? అస్పష్టంగా ఉంటే అది ఏ పరిణామాలకు దారితీస్తుంది అనేది ఇప్పుడు మనకు ఊహకు అందని విషయం.
Also Read: Election Campaign : క్లైమాక్స్ కు చేరుకున్న తెలంగాణ ఎన్నికల ప్రచారం