తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చేసిన కాంగ్రెస్ హామీ ప్రస్తుతం తీవ్ర రాజకీయ, న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకుంది. 2023 ఎన్నికల సమయంలో “కామారెడ్డి డిక్లరేషన్” ద్వారా బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని ప్రకటించి, కాంగ్రెస్ బీసీ ఓటర్లను ఆకర్షించింది. అనంతరం హౌస్-టు-హౌస్ సర్వే చేసి, బీసీలు 56% జనాభా ఉన్నారని రిపోర్టు ప్రకటించారు. ఆ డేటా ఆధారంగా విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను అసెంబ్లీలో ఆమోదం చేశారు. కానీ ఇది సుప్రీం కోర్టు 50% రిజర్వేషన్ క్యాప్‌ను దాటిపోవడం వల్ల, ఆ బిల్లులు అమల్లోకి రావడం కోసం న్యాయపరమైన అవరోధాలు ఎదురవుతున్నాయి.
Jobs : RRBలో 5,810 ఉద్యోగాలు.. అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడంటే !!
ఆమోదించిన బిల్లులపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు స్టే చేసింది. స్టే ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో SLP ఫైల్ చేసింది. కానీ సుప్రీంకోర్టు కూడా హైకోర్టు స్టేను సమర్థిస్తూ కేసును తిరస్కరించింది. దీంతో 42% బీసీ రిజర్వేషన్ల అమలు ప్రస్తుతానికి పూర్తిగా నిలిచిపోయినట్లైంది. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో బిల్లును చేర్చితే ఈ రిజర్వేషన్లు చెల్లుబాటు అయ్యే అవకాశమున్నప్పటికీ, దానికి పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ అవసరం. ప్రస్తుత రాజకీయ సమీకరణల్లో ఇది సాధ్యం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమల్లో ఉండటానికి కారణం కూడా ఇదే. తెలంగాణలో అదే విధానం అమలుకావడానికి కేంద్ర ఆమోదం తప్పనిసరి.
ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పుల వలన 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయటం అసాధ్యమని స్పష్టమైనప్పటికీ, ప్రభుత్వం ఈ విషయాన్ని బహిరంగంగా అంగీకరించడానికి మొహమాటపడుతోంది. రిజర్వేషన్లు ఇచ్చిన తరువాత స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ఆ హామీ నెరవేర్చడం అసాధ్యమయ్యే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు నిజాలు వివరించకుండా మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే, ముఖ్యంగా బీసీ వర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో బీసీలు మోసపోయామని భావించే ప్రమాదం కూడా పెరుగుతోంది. కాబట్టి ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను పారదర్శకంగా తెలియజేసి, చట్టబద్ధమైన మార్గాల్లో సాధ్యమైన పరిష్కారాలను ముందుకు తెచ్చే అవసరం ఉంది.
