Site icon HashtagU Telugu

Priyanka Gandhi : టీ కాంగ్రెస్ సంక్షోభానికి `ప్రియాంక` గాంధేయం!

Priyanka Gandhi

Priyanka Gandhi

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏమి జ‌రుగుతుంది? ఆ పార్టీలో తాత్కాలిక సంక్షోభ‌మా? సునామీనా? అనే చ‌ర్చ సీరియ‌స్ గా జ‌రుగుతోంది. మాజీ ఎంపీ , కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్ మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి వాయిస్ బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత ఏఐసీపీ అప్ర‌మ‌త్తం అయింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దాసోజు శ్ర‌వ‌ణ్ రాత‌పూర్వ‌కంగా ఇచ్చిన ఫిర్యాదుల‌ను అధ్య‌య‌నం చేస్తుంద‌ట‌. ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌ల త‌రువాత అంత‌ర్గ‌తంగా పార్టీలో జ‌రుగుతోన్న మాఫియా గురించి ఆరా తీస్తుంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న వాళ్లంద‌రూ మూకుమ్మ‌డిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వాల‌కాన్ని త‌ప్పుబ‌డుతున్నారు. అంతేకాదు, ఆయ‌న‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్ ఠాకూర్, రాజకీయ వ్యూహ‌క‌ర్త సునీల్ క‌నుగోలు క‌లిసి చేస్తోన్న దందాపై దాసోజు వెలుగెత్తి చాటారు. తాజాగా మ‌ర్రి శ‌శిథ‌ర్ రెడ్డి ఆ ముగ్గురితో పాటు ఏఐసీసీ ప్ర‌ధాని కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ ను కూడా క‌లిపేశారు. ఆ న‌లుగురు కలిసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీని నాశ‌నం చేస్తున్నార‌ని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కొన్ని ద‌శాబ్దాలుగా పార్టీలో ఉంటోన్న క్ర‌మ‌శిక్ష‌ణ‌గ‌ల `మ‌ర్రి` కూడా తిర‌గ‌బ‌డ‌డంతో సీడ‌బ్ల్యూసీ అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని పెట్టుకుంది.

Also Read: TDP: తండ్రీ కొడుకుల ప‌క్కా ప్ర‌ణాళిక‌

తెలంగాణ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జి మాణిక్ ఠాకూర్ బుధ‌వారం నిర్వ‌హించిన మునుగోడు స్ట్రాట‌జీ క‌మిటీ స‌మావేశంలో అస‌హ‌నంగా ఉన్నారు. ఆ స‌మావేశానికి మ‌ధుయాష్కీ, ఉత్త‌మ్, జానారెడ్డి , భ‌ట్టీ త‌దిత‌ర సీనియ‌ర్లు ఎవ‌రూ రాలేదు. కేవ‌లం మ‌నుగోడు. నుంచి వ‌చ్చిన కొంద‌రు లీడ‌ర్ల‌తో మాత్ర‌మే ఆయ‌న భేటీ అయ్యారు. క‌రోనా కార‌ణంగా రేవంత్ రెడ్డి ఈ మొత్తం వ్య‌వ‌హారానికి దూరంగా ఉన్నారు. రేపోమాపో ఠాకూర్ ప‌ద‌వి ఊడుతుంద‌ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బాగా చ‌ర్చ జ‌రుగుతోంది. బ‌హుశా అందుకేనేమో, సీనియ‌ర్లు ఆయ‌న స‌మావేశానికి డుమ్మా కొట్టారు. అత్య‌వ‌స‌రంగా గురువారం సాయంత్రం ఢిల్లీలో జ‌రిగే సీడ‌బ్ల్యూసీ స‌మావేశం త‌రువాత ప్రియాంక గాంధీని తెలంగాణ ఇంచార్జిగా నియ‌మించ‌డానికి రంగం సిద్ధం అయింది. ఆమెకు ఫుల్ ఛార్జి ఇవ్వ‌డానికి ఏఐసీపీ ఇప్ప‌టికే సూత్ర‌ప్రాయంగా నిర్ణ‌యం తీసుకుంది.

తెలంగాణ ఇంచార్జిగా ప్రియాంక‌గాంధీ వ‌చ్చిన త‌రువాత సునీల్ క‌నుగోలు, పీసీసీ చీఫ్‌, కేసీ వేణుగోపాల్ , ఠాకూర్ వ్య‌వ‌హారాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డానికి సీనియ‌ర్లు సిద్ధంగా ఉన్నార‌ట‌. అదే జ‌రిగితే, భారీ మార్పులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జ‌రిగే అవ‌కాశం లేక‌పోలేదు. విచిత్రంగా మ‌ర్రి శ‌శిథ‌ర్ రెడ్డి ఏఐసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వేణుగోపాల్ పై ఆరోప‌ణ‌ల‌కు దిగిన రోజే ఈడీ దాడుల‌ను నిర్వ‌హించింది. ఆయ‌న సోలార్ సొల్యూషన్స్, సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లలో వాటాలు ఇప్పిస్తానని అమాయకులను మోసం చేశారని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ క్ర‌మంలో ఒక మ‌హిళ పై లైంగిక వేధింపులు చేసిన కేసు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. మొత్తం మీద దాసోజు, మ‌ర్రి చెప్పిన `మాఫియా` వ్య‌వ‌హారం ప్రియాంక వ‌చ్చిన త‌రువాత ఒక్కొక్క‌టి బ‌య‌ట‌కు వ‌స్తుందా? ప్ర‌స్తుతం పొడ‌చూపిన సంక్షోభాన్ని వెంట‌నే నివారిస్తుందా? లేక సునామీ వ‌ర‌కు వెళ్లే వ‌ర‌కు వేచిచూస్తుందా? అనేది చూడాలి.

Also Read: AP Employees : ఏపీ ఉద్యోగుల‌కు `జ‌గ‌న్ మార్క్` క్ర‌మ‌శిక్ష‌ణ‌