Priyanka Gandhi: ప్రియాంక చరిష్మా తెలంగాణాలో వర్కౌట్ అయ్యేనా?

తెలంగాణాలో అధికారం చేపట్టేందుకు టీకాంగ్రెస్ శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. పదేళ్ల క్రితం తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం మారే పార్టీకి లేదు. గల్లీ గల్లీలో హస్తం జెండా కనిపించేది.

Priyanka Gandhi: తెలంగాణాలో అధికారం చేపట్టేందుకు టీకాంగ్రెస్ (Telangana Congress) శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. పదేళ్ల క్రితం తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం మారే పార్టీకి లేదు. గల్లీ గల్లీలో హస్తం జెండా కనిపించేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయాక ఆ పార్టీ పునాదులు బలహీన పడ్డాయి. నిజానికి తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయింది. ఆ సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ తెచ్చింది నేనేనని, తెలంగాణ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడనని బలమైన ప్రతిపాదనలతో ప్రజలకు చేరువయ్యారు. ఇక్కడ కెసిఆర్ మాటలు ఎంత బలంగా వినిపించాయో, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పరిస్థితి అంత బలహీన పడింది.

తెలంగాణాలో కాంగ్రెస్ కేవలం పది సీట్లకు పరిమితమైంది. కాంగ్రెస్ పేరుమీద గెలిచిన ఎమ్మెల్యేలు కూడా కెసిఆర్ గూటికి చేరారు. దీంతో తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి భూస్థాపితమైంది అనుకున్నారందరూ. కానీ పరిస్థితులు మారాయి. ప్రజల్లో ఆలోచన శక్తి పెరిగింది. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ పై వ్యతిరేకత చూపిస్తున్నారు. తెలంగాణ ఏర్పడితే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో చెప్పిన కెసిఆర్ కేవలం మాటలకే పరిమితమయ్యారు అనేది ప్రజలు అర్ధం చేసుకున్నారు. దీంతో తెలంగాణాలో అధికార పార్టీని నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజానీకం లేదు. దీంతో తెలంగాణ ప్రజలు మళ్ళీ టీకాంగ్రెస్ వైపు చూస్తున్నారు.

తెలంగాణాలో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత పరిస్థితులు మారాయి. గతంలో కంటే కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా కనిపిస్తుంది. అయితే సీనియర్స్, జూనియర్స్ అనే అంతర్గత పోరు ఉన్నప్పటికీ ఢిల్లీ పెద్దల జోక్యంతో తెలంగాణ కాంగ్రెస్లో కాస్త మార్పు వచ్చింది. మరోవైపు ఇటీవల కర్ణాటకలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. బీజేపీని భారీ మెజారిటీతో ఓడించి కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవాన్ని ప్రదర్శించింది. ఇక కర్ణాటక ఫలితాల తరువాత ఢిల్లీ కాంగ్రెస్ తెలంగాణపై ఫోకస్ చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తెలంగాణ గడ్డపై అడుగుపెట్టింది. దీంతో తెలంగాణాలో అధికార మార్పిడి జరిగి, కాంగ్రెస్ అధికారం చేపట్టాలి అంటే కేవలం ప్రియాంక గాంధీ ఒక్కరి వల్ల మాత్రమే సాధ్యమవుతుందని టీపీసీసీ భావిస్తుంది.

తెలంగాణాలో ప్రియాంక గాంధీతో పాదయాత్ర (Padayatra) చేయించేందుకు టీపీసీసీ భావిస్తుంది. ప్రియాంక గాంధీ చరిష్మా తెలంగాణాలో వర్కౌట్ అవుతుందని భావించిన తెలంగాణ కాంగ్రెస్ పదిరోజులకొకసారి ఆమెతో బహిరంగ సభలు, పాదయాత్రలతో ముందుకెళ్లాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రియాంక గాంధీ చరిష్మా ఉపయోగపడుతుందని అభిప్రాయానికి వచ్చారట. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏకమై ఇప్పటికే ప్రియాంకతో ఈ విషయాన్ని ఆమెకు చెప్పినట్టు తెలుస్తుంది. దీనికి ప్రియాంక గాంధీ సముఖత చూపినట్టుగా చెప్తున్నారు. మొత్తానికి తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రియాంక గాంధీ ఛరిష్మాని బాగా వాడుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తుంది.

Read More: Priyanka Gandhi: ప్రియాంక గాంధీ ప్రధాని అభ్యర్థి అయితే మోడీ ఇంటికే…