Site icon HashtagU Telugu

MIM Strategy: బీఆర్ఎస్ కు ఓవైసీ షాక్.. ఆదిలాబాద్ లో బరిలో ఎంఐఎం?

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మొన్నటి వరకు బీఆర్ఎస్ కు పోటీగా బీజేపీ తెరపైకి వచ్చింది. కర్ణాటక రిజల్ట్స్ తో తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. అయితే ఈ పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీ కలవరపడుతోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుండటంతో తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారబోతున్నాయి. ఈ క్రమంలో ఆదిలాబాద్‌లోని మొత్తం 10 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

అసద్ పోటీకి దిగితే జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతాయి. జిల్లాలో చాలా స్థానాల్లో పోటీలు చతుర్ముఖంగా మారాయి. ముధోల్, ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ నియోజకవర్గాలన్నింటిలోనూ ఎన్నికల పోరు చతుర్ముఖ పోటీగా మారనుంది. అంతేకాకుండా చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాలు, సిర్పూర్‌లలో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ముస్లిం ఓట్లపై కన్నేసిన టీఆర్‌ఎస్‌ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీ కలవర పడుతుంది. అయితే బీఆర్‌ఎస్‌తో ఎంఐఎం బంధాన్ని తెంచుకుంటే ఏంటి అనేది పెద్ద ప్రశ్న.

తెలంగాణలో ముస్లింలు ఎటువైపు వెళ్తారు? ఇప్పటి వరకు అధికార బీఆర్‌ఎస్‌కు ముస్లింలు, సెటిలర్‌ ఆంధ్రా ఓటర్లే ​​పెద్ద ఆస్తి. ముస్లింలు ఎంఐఎం వైపు మొగ్గు చూపితే తెలంగాణ రాష్ట్రంలోని 25కి పైగా నియోజకవర్గాల్లో ఆ పార్టీ అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయి. కర్ణాటక ఎన్నికలు ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా రావడంతో ఓవైసీ స్వరం మార్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో ఓవైసీ ఏ పార్టీ మద్దతు ఇస్తారో, ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని పలువురు రాజకీయ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

Also Read: Earphones Effect: షాకింగ్.. ఇయర్ ఫోన్స్ వాడకంతో వినికిడి కోల్పోయిన బాలుడు!

Exit mobile version