Revanth Reddy: డ్రగ్స్ వ్యవహారంలో కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్..

తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మేనల్లుడు ప్రణయ్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణలపై ఆయన స్పందించారు.

Published By: HashtagU Telugu Desk
Ktr Revanth Reddy

Ktr Revanth Reddy

తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మేనల్లుడు ప్రణయ్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. ప్రణయ్ రెడ్డితోపాటు తన కుటుంబంలోని పిల్లలందరినీ తీసుకొస్తా అని.. వారి నుంచి రక్తం, ఇతర నమూనాలను సేకరించాలన్నారు. కానీ అదే సమయంలో కేటీఆర్ నమూనాలు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ చేశారు.

పబ్ పై పోలీసుల దాడి చేయడంతో దాదాపు 142 మంది పట్టుబడ్డారు. కానీ వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వారి నుంచి నమూనాలు ఎందుకు సేకరించలేదన్నారు. తెలంగాణలో డ్రగ్స్ వినియోగంపై సీఎం కేసీఆర్ సీరియస్ గానే ఉన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వాటిని నిర్మూలించాల్సిందే అని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయినా డ్రగ్స్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.

2014 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ కు 2017 వరకు టాలీవుడ్ పై పట్టు లేదని.. అందుకే గతంలో డ్రగ్స్ కేసును ముందుకు తెచ్చి ఆ రంగాన్ని కేటీఆర్ తన గుప్పిట్లో పెట్టుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఈడీకి మొత్తం సమాచారాన్ని ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా ఇప్పటివరకు ఆ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో పబ్ లు 24 గంటలు నడవడానికి, మద్యం విక్రయాలకు పర్మిషన్ ఇచ్చింది టీఆర్ఎస్ సర్కారే అని ఆరోపించారు.

తాజాగా వెలుగుచూసిన డ్రగ్స్ కేసులో వివిధ రాజకీయ పార్టీల్లోని ప్రముఖుల పిల్లలు ఉన్నారు. దీంతో ఈ కేసు అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ కొందరు ముఖ్యమైన వ్యక్తుల పిల్లలను అదుపులోకి తీసుకోలేదని.. వారిని ముందే పంపించేశారని ఆరోపణలు వెలుగుచూశాయి.

  Last Updated: 06 Apr 2022, 08:43 AM IST