Site icon HashtagU Telugu

Congress : ప్రభుత్వం మారితేనే న్యాయం జరుగుతుందేమో..? – రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు

Secret meeting with Congress MLAs is false: Rajagopal Reddy

Secret meeting with Congress MLAs is false: Rajagopal Reddy

రీజనల్ రింగ్ రోడ్ (RRR) అలైన్‌మెంట్ పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చౌటుప్పల్ డివిజన్‌లోని (ఉత్తర భాగం) రైతులు భూములు కోల్పోతున్నారని, ఈ విషయంలో వారు అధికారులను, ఢిల్లీలోని పెద్దలను కలిసినా న్యాయం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం దివీస్ సంస్థ కోసం రూట్ అలైన్‌మెంట్ మార్చిందని, అదే విధంగా ఇప్పుడు దక్షిణ భాగం అలైన్‌మెంట్ మారాలంటే మొదట ఉత్తర భాగం అలైన్‌మెంట్ మారాలని, అది జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వమే మారాలేమో అని రాజగోపాల్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని సృష్టించాయి.

Nara Lokesh : శ్రీ ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేశ్

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఆదివారం భూ నిర్వాసితులతో నిర్వహించిన సమావేశంలో రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు జరిగిన అన్యాయాన్ని తాను తట్టుకున్నానని, కానీ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మాత్రం మౌనంగా ఉండలేనని అన్నారు. అవసరమైతే ట్రిపుల్ ఆర్ (RRR) రద్దయినా సరే, ఉత్తర భాగం భూ నిర్వాసితుల హక్కులను కాపాడుతానని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. తన నియోజకవర్గ ప్రజల కోసం ఎలాంటి పోరాటానికైనా, ఏ త్యాగానికైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, ప్రజలకు అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడటానికి వెనుకాడనని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తనకు పదవుల కన్నా తన ప్రాంత ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని, ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా చెబుతానని అన్నారు. ట్రిపుల్ ఆర్ పనుల వల్ల మునుగోడు నియోజకవర్గ ప్రజలే ఎక్కువగా భూములు కోల్పోతున్నారని, వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి, అవసరమైతే కేంద్ర మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. గతంలో మంత్రి పదవిపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారగా, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ విషయంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త సవాళ్లను విసిరేలా కనిపిస్తున్నాయి.