తెలంగాణలో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిల సమస్య తలనొప్పిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూ.1,200 కోట్ల బకాయిలను విడుదల చేయకపోతే సెప్టెంబర్ 15 నుంచి ఇంజినీరింగ్ కళాశాలలను మూసివేస్తామని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేట్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ (FATHE) ప్రకటించింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
ఈ సమస్యపై ప్రభుత్వం ఈరోజు చర్చించనున్నట్లు సమాచారం. ఒకవేళ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఇంజినీరింగ్ కళాశాలలు సోమవారం నుంచి మూతబడే అవకాశం ఉంది. ఈ పరిణామం విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇప్పటికే పలుమార్లు ఫెడరేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇంజినీరింగ్ కళాశాలలే కాకుండా ఇంటర్, డిగ్రీ కళాశాలలు కూడా ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కళాశాలల యాజమాన్యాలు కోరుతున్నాయి. లేకపోతే రాష్ట్రంలో ఉన్నత విద్యారంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.