Pawan Kalyan : తెలంగాణలో జనసేన జెండా ఎగరాలి..వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తాం – ‘పవన్ కళ్యాణ్’..!

తెలంగాణ రాజకీయాల్లో విద్యార్థులు ప్రముఖ పాత్ర పోషించాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan Telangana

Pawan Kalyan Telangana

తెలంగాణ రాజకీయాల్లో విద్యార్థులు ప్రముఖ పాత్ర పోషించాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. తెలంగాణ రాజకీయ సమరంలో జనసేన పార్టీ ఉంటుందని, భవిష్యత్తులో జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించిన యువత, ఆడపడుచులకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలో చర్చించుకొని, ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లి సత్తా చాటుదామన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని స్థానాల్లో పోటీ చేద్దామని చెప్పారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలను పరామర్శించి, వారికి రూ. 5 లక్షల ఆర్ధిక సాయం చేయడానికి శుక్రవారం ఉదయం ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనకు బయలుదేరిన పవన్ కళ్యాణ్ కి గ్రేటర్ హైదరాబాద్ జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మెట్టుగూడ, ఉప్పల్, నాగోలు, ఎల్బీనగర్ సర్కిల్స్ లో గజమాలలతో సత్కరించాయి. మెట్టుగూడలో ఆడపడుచులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బోనాలతో అపూర్వ స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా వపన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ తెలంగాణ ప్రాంతమంటే నాకెంతో ఇష్టం.

ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆడపడుచులు స్వాగతం పలకడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేద్దామని నిర్ణయించుకున్నాం. అయితే కొన్ని కారణాల వల్ల నా మాటను మన్నించి ఇక్కడి నేతలు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బలాబలాలు పరిశీలించుకొని అన్ని ప్రాంతాల్లో పోటీ చేద్దాం. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేసి జనసేన సత్తా చూపిద్దాం. తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన 17వేల పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి కొందరికి వయో పరిమితి సడలింపు ఇబ్బందులు ఉన్నాయని ఆడపడుచులు నా దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కచ్చితంగా మాట్లాడతాను. ఎస్టీలకు సంబంధించి 10 శాతం రిజర్వేషన్లు రావాల్సి ఉందని, దానిపై కూడా మాట్లాడతాన”ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి నేమూరి శంకర్ గౌడ్, పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంఛార్జి రామ్ తాళ్లూరి, తెలంగాణ విద్యార్ధి విభాగం అధ్యక్షులు సంపత్ నాయక్, వీర మహిళ విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీమతి పొన్నూరి శిరీషతోపాటు గ్రేటర్ హైదరాబాద్ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.

  Last Updated: 20 May 2022, 04:49 PM IST