Site icon HashtagU Telugu

CM KCR : మమత ఓడిన చోట కేసీఆర్ నెగ్గుతారా? రాష్ట్రపతి ఎన్నికల్లో కీ రోల్ పోషిస్తారా?

Rahul Mamta Kcr Stalin

Rahul Mamta Kcr Stalin

ఇప్పటికైతే ఏ ఫ్రంట్ లేదంటూ జార్ఖండ్ పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. అలాగని ఫ్రంట్ ప్రయత్నాలు ఆగిపోయాయని చెప్పలేం. ఎందుకంటే యూపీ ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఇది చాలా కీలకపాత్ర పోషించనుంది. అందుకే ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ పై మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. కేంద్రంలో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఫ్రంట్ పెట్టాలంటే దానికి కొన్ని కీలక అంశాలపై స్పష్టత రావాలి.

థర్డ్ ఫ్రంట్ విషయంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తొలి అడుగు వేశారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించిన తరువాత ఆమె ముంబై వెళ్లారు. శరద్ పవార్, ఉద్దవ్ థాకరేలను కలిశారు. కానీ వాళ్లిద్దరూ మహారాష్ట్రలో కాంగ్రెస్ తో కలిసి ఉన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూపీఏ శకం ముగిసిందని.. ఇక రాబోయేది ప్రాంతీయ పార్టీల ఆధ్వర్యంలో ఏర్పడే కొత్త ఫ్రంట్ అని అప్పుడే స్పష్టత ఇచ్చారు. కానీ కాంగ్రెస్ లేకుండా జాతీయస్థాయిలో బీజేపీని ఎదుర్కోవడానికి వేరే ప్రత్యామ్నాయం లేదని థాకరేతోపాట పవార్ కూడా అంతే స్పష్టంగా చెప్పారు.

కొత్త ఫ్రంట్ విషయంలో అప్పుడు మమతాబెనర్జీకి చుక్కెదురు అయ్యింది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం పట్టవదలని విక్రమార్కుడిలా ఫ్రంట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందుకే మోదీ వ్యతిరేకులతో విందు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆమధ్య ఎన్నికల స్ట్రాటజిస్ట్ అయిన ప్రశాంత్ కిషోర్ కూడా ఇలాంటి ప్రయత్నమే చేశారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో ఢిల్లీలో రెండు గంటలపాటు విందు సమావేశం జరిపారు.

రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మమతా బెనర్జీ చెప్పిన విషయాన్ని నితీశ్ కు చేరవేశారు ప్రశాంత్ కిషోర్. కానీ నితీశ్ ఆ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. కాంగ్రెస్ మద్దతు లేకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవడం కష్టమన్న పవార్, ఉద్దవ్ ల అభిప్రాయాన్నే ఆయనా వ్యక్తం చేశారు. పైగా నితీశ్ ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. కాంగ్రెస్ లేకుండా రాష్ట్రపతి ఎన్నికలకు వెళ్లడానికి ఆయనకు ఇష్టం లేదు. దానికోసం ఎన్డీఏతో బ్రేకప్ చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు.

రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పాత్ర లేకుండా చేయడానికి మమతా బెనర్జీ ఇన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా అవి నెరవేరే ఛాన్స్ కనిపించడంలేదు. కానీ మమత ఫెయిలైన చోట నెగ్గడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పావులు కదపడానికి ప్రతిపక్షాలు ఇంతగా ప్రయత్నిస్తున్నా అవేవీ నెరవేరే ఛాన్స్ లేదన్నది బీజేపీకి తెలుసు. ఒకవేళ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చి ప్రతిపక్షాలది పైచేయి అయితే తప్ప రాజకీయ సమీకరణాలు మారకపోవచ్చు. అప్పుడు నితీశ్ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లి పోటీ చేసే ఛాన్సూ ఉండదు. మరి కేసీఆర్ ఎందుకు ఇంతగా ప్రయత్నాలు చేస్తున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.