Barrelakka : బర్రెలక్క గెలుస్తుందా?

సోషల్ మీడియాలో బర్రెలక్క (Barrelakka) అని ప్రసిద్ధికెక్కిన శిరీష ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొల్లాపూర్ లో పోటీ చేస్తున్న విషయం ఈ ఎన్నికలలో ఒక సంచలన సందర్భంగా మారింది.

  • Written By:
  • Updated On - November 27, 2023 / 02:48 PM IST

By: డా. ప్రసాదమూర్తి

Barrelakka : తెలంగాణ ఎన్నికలు ఒక ఎత్తు, బర్రెలక్క ఎన్నిక ఒక ఎత్తు. ఒకపక్క ప్రధాన రాజకీయ పక్షాలు ఎవరి మార్గాన వారు ప్రచారాన్ని ఉదృతం చేశారు. ప్రచారానికి ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. అందుకే పార్టీలన్నీ తమ తమ పథకాలను వాగ్దానాలను ఆలోచనలను ప్రజల వద్దకు తీసుకువెళ్లే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో బర్రెలక్క (Barrelakka) అని ప్రసిద్ధికెక్కిన శిరీష ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొల్లాపూర్ లో పోటీ చేస్తున్న విషయం ఈ ఎన్నికలలో ఒక సంచలన సందర్భంగా మారింది. పార్టీల బలాబలాలు, విజయాలు, పరాజయాలు, పరిశీలనలు, ఊహలు, అంచనాలు, సర్వేలు వాటంతట అవి సాగుతున్నప్పటికీ బర్రెలక్క (Barrelakka) విజయం సాధిస్తుందా లేదా అనే విషయం మీద కూడా అందరూ ఫోకస్ చేస్తున్నారు. నియామకాల విషయంలో అధికార బిఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం వహించిందని, చదువుకున్న వాళ్లకి ఉద్యోగాలు లేవని, అందుకే తాను బర్రెలు కాసుకొని పాలు అమ్ముకొని బతుకుతున్నానని ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత శిరీష బర్రెలక్కగా విపరీతమైన ప్రచారం పొందింది.

We’re Now on WhatsApp. Click to Join.

తర్వాత ఆమె మీద అక్కసుతో పోలీసులు కేసులు పెట్టడం, శిరీషలో మరింత తిరుగుబాటు వైఖరిని పెంచింది. ఇంత పెద్ద రాజ్యాన్ని పాతికేళ్ల ఒక మారుమూల గ్రామానికి చెందిన దళిత పడుచు ఎన్నికలలో నిలబడి ఢీకొనాలని నిర్ణయించుకుంది. ఆమెలోని ఈ తెగువ ఈ సాహసం పార్టీలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరినీ ఆకర్షించాయి. అందుకే ఎక్కడెక్కడ నుంచో వివిధ ప్రాంతాల నుంచి వివిధ వర్గాల ప్రజలు అశేషంగా కొల్లాపూర్ నియోజక వర్గానికి వచ్చి బర్రెలక్కకు మద్దతుగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇంతలో బర్రెలక్క (Barrelakka) తమ్ముడిపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇదంతా అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇదిలా ఉంటే జెడి లక్ష్మీనారాయణ లాంటి మాజీ అధికారులు స్వయంగా కొల్లాపూర్ వెళ్లి బర్రెలక్కకు మద్దతుగా ప్రచారం చేయడం మరో సంచలన వార్తగా మారింది. దళిత బహుజన మేధావి ప్రముఖ అంబేద్కరిస్టు, రచయిత కంచ ఐలయ్య, కొందరు యువ సమూహాలతో కూడి స్వయంగా కొల్లాపూర్ వెళ్లి బర్రెలక్కకు మద్దతు తెలిపారు. అంతేకాదు ప్రధాన పార్టీలన్నీ బర్రెలక్కకు మద్దతు తెలిపి స్వచ్ఛందంగా పోటీ నుంచి విరమించుకుంటే మంచిదని కూడా కంచ ఐలయ్య రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేశారు. దీనితో కొల్లాపూర్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

పార్టీలకు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా బర్రెలక్కకు అందుతున్న మద్దతు నిజానికి ఓట్ల రూపంలో తర్జుమా అవుతుందా లేదా అనేది ప్రస్తుతానికి ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నే. అయితే ఈ ఎన్నికలలో ప్రధాన పక్షాల నుండి పోటీ చేస్తున్న వారు ఆషామాషీ రాజకీయ నాయకులు కాదు. దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తులు ఇక్కడ బరిలో ఉన్నారు. ఈ సందర్భంలో హేమాహేమీలను తట్టుకొని శిరీష విజయం సాధిస్తుందా అనేది కొంచెం అనుమానమే.

గెలిచినా ఓడినా శిరీష (Barrelakka) విజేతే!

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న హర్షవర్ధన్ రెడ్డి చాలా కాలంగా ఈ నియోజకవర్గ ప్రజలకు సుపరిచితులు. వారిద్దరూ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కి, టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారినటువంటి వాళ్లే. అయినప్పటికీ కొల్లాపూర్ నియోజక వర్గంలో వారు పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులుగా పేరు ఉంది. రాజకీయ బలం, ధనబలం, కులబలం.. ఇలా అనేక బలాలు ఉన్న మదపుటేనుగుల్లాంటి ఈ రాజకీయ నాయకులతో ఇంకా రాజకీయాలలో ఓనమాలు కూడా సరిగా నేర్చుకోని ఒక పాతికేళ్ల పడుచు పిల్ల ఎలా తలపడుతుంది.. ఈ యుద్ధం ఎలా చేస్తుంది అనేది పెద్ద ప్రశ్నగా మారింది. గ్రౌండ్ రిపోర్టు చూస్తే ఆమెకు మద్దతుగా ప్రచారం చేస్తున్నవారు కొల్లాపూర్ నియోజక వర్గం వెలుపల నుంచి వచ్చిన వాళ్లే ఎక్కువ. ఆంధ్ర ప్రాంతం నుంచి దేశంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి ఎక్కువగా యువజనులు తరలివస్తున్నారు. ఇక మీడియా వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఆమె చుట్టూ గుమిగూడి ఆమె ఇంటర్వ్యూలు చేయడం, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అనే ఒక పెద్ద తతంగం నడుస్తుంది. ఈ హడావిడి మొత్తం ఆమెకు అనుకూలంగా ఓట్లు సాధించే విషయంలో ఎంతవరకు సహాయపడుతుందనేది ఆలోచించాల్సిందే.

అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం శిరీష గెలుస్తుందా ఓడిపోతుందా అని కాదు. “అవినీతి బంధు ప్రీతి, చీకటి బజారు.. అలముకున్న ఈ దేశం ఎటు దిగజారు” అని మహాకవి శ్రీశ్రీ ఒక పాటలో హెచ్చరించినట్టు 70 వసంతాల స్వతంత్ర భారతం ఈనాడు అవినీతికి ఆలవాలంగా మారింది. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మల్లాంటి అనేక రాజ్యాంగ వ్యవస్థలు అధికార పార్టీలకు జేబు సంస్థలుగా మారిపోయాయి. కులం మతం రాజ్యమేలుతున్నాయి. ఎటు చూసినా ప్రజాస్వామ్యం పాప పంకిలమైపోయినట్టు కనిపిస్తోంది. ఇలాంటి వాతావరణంలో ఒక లేత మొగ్గ లాంటి అమ్మాయి ఈ మొత్తం వ్యవస్థ మీద తిరుగుబాటుగా ఎన్నికలలో నిలబడటమే ఒక గొప్ప విషయమని భావించాలి. అందుకే పాప పంకిలమైన ఈ ప్రజాస్వామ్యంలో వికసించిన పసిడి మొగ్గలాంటి శిరీషకు మద్దతుగా అన్ని వర్గాల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఫలానా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్న వ్యక్తులు కూడా శిరీష గెలవాలని మాత్రం బలంగా ఆకాంక్షిస్తున్నారు. శిరీష గెలవడం అంటే అసంతృప్తిలో రగిలిపోతున్న యువతరం గెలవడమే. శిరీష గెలవడం అంటే భ్రష్టు పట్టిన ప్రజాస్వామ్యం అగ్ని స్నానం చేసి పునీతం కావడమే. శిరీష గెలవడం అంటే నీతి, మానవత్వం, మంచితనం, నిజాయితీ నిబద్ధత గెలవడమే. కానీ నీతి సూక్తులు, సత్య ప్రవచనాలు వ్యక్తుల్ని గెలిపించలేవు. అంతగా మన ఎన్నికల వ్యవస్థ పంకిలమైపోయింది.

ఇలాంటి నేపథ్యంలో శిరీష గెలవాలని అందరూ కోరుకుంటున్నారు. ఆమె గెలుపులో తమ గెలుపు ఉందని అందరూ ఆశిస్తున్నారు. ఇది జరుగుతుందో లేదో చూడాలి. ఒకవేళ శిరీష ఓడిపోయినా ఆమె సాహసానికి ఆమె ధైర్యానికి ఈ దేశం శిరస్సు వంచి సలాం చేస్తుంది. యువత ముందు ముందు రంగంలోకి దూకడానికి ఆమె చూపిన ఈ సాహసం ఒక ఉదాహరణగా నిలుస్తుంది.

Also Read:  Jaggareddy : ‘సంగారెడ్డి పులి జగ్గారెడ్డి’.. ఆయన కష్టపడి పనిచేసే లీడర్ : రాహుల్ గాంధీ