Site icon HashtagU Telugu

HYD : ప్రియుడి మోజులో పడి.. కట్టుకున్నోడిని కడతేర్చిన ఇల్లాలు

Wife Kills Hus

Wife Kills Hus

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చిందో భార్య. ప్రియుడి మోజులో పడి ఇద్దరు కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు (Illegal Affair) అనేవి కామన్ గా మారిపోయాయి. భర్త , భార్య ఉన్నప్పటికీ వివాహేతర సంబంధాన్ని పెట్టుకొని చాలామంది తమ కాపురాలను పాడుచేసుకోవడమే కాకుండా తమ బిడ్డలా భవిష్యత్ ను రోడ్డు పాలుచేస్తున్నారు. అంతే కాదు ఈ అక్రమ సంబంధాల కారణంగా కొన్ని కొన్ని సార్లు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడం..ప్రాణాలు తీయడం కూడా చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్​ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

జయప్రకాశనగర్ (Jayaprakash nagar) లోని శిఖర అపార్డ్ మెంట్ లో నివాసం ఉండే సీసీ కెమెరా టెక్నీషియన్ విజయ్ కుమార్ (Vijay Kumar) కు భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. బోరబండకు చెందిన రాజేశ్ తో శ్రీలక్ష్మి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. అయితే వీరిద్దరి మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన శ్రీలక్ష్మి.. చంపించాలని ప్లాన్ వేసింది. ఇదే విషయం రాజేశ్​తో చెప్పడంతో అతడు కూడా ఓకే అన్నాడు. తనకు పరిచయమున్న సనత్​నగర్​కు చెందిన పటోళ్ల రాజేశ్వర్ ​రెడ్డి మద్దతు కోరాడు. రౌడీషీటర్ అయిన రాజేశ్వర్ ​రెడ్డిపై ఇదివరకే మొత్తం 8 కేసులు ఉన్నాయి. రాజేశ్వర్ ​రెడ్డి సూచనతో మహ్మత్ మైతాబ్ అలియాస్ బబ్బన్ సాయం కూడా హత్య చేయడానికి తీసుకున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 1న విజయ్​కుమార్ తన పిల్లల్ని పాఠశాలలో దింపేందుకు వెళ్లాడు. అప్పటికే ఇంటి సమీపంలో ఉన్న రాజేశ్‌, పటోళ్ల రాజేశ్వర్‌ రెడ్డి, మైతాబ్‌ను శ్రీలక్ష్మి ఇంటికి పిలిపించి, బాత్​రూంలో దాచింది.

We’re now on WhatsApp. Click to Join.

విజయ్ ఇంటికి రాగానే శ్రీలక్ష్మి లోపలి నుంచి గడి పెట్టింది. వెంటనే రాజేశ్, రాజేశ్వర్ రెడ్డి, మైతాబ్ బాత్​రూమ్​లో నుంచి బయటకు వచ్చి కసరత్తులకు ఉపయోగించే డంబెళ్లు, ఇనుప రాడ్లతో విచక్షణా రహితంగా విజయ్​పై దాడి చేశారు. అప్పుడు విజయ్ భయంతో తనను చంపొద్దని, కావాలంటే ఎంతైనా కొట్టి వదిలేయాలని ప్రాదేయపడ్డాడు. కానీ వాటిని పట్టించుకోకుండా ఆ ముగ్గురు అతన్ని చంపేశారు. విజయ్ మరణించాడని నిర్ధారించుకున్న ఆ ముగ్గురు, మృతదేహాన్ని బాత్​రూమ్​లో పడేసి వెళ్లిపోయారు. అనంతరం శ్రీలక్ష్మి ఇంట్లోని రక్తపు మరకలను తుడిచేసి, శవంపై దుస్తులను మార్చేసి తన భర్త గుండెపోటుతో మరణించాడని నాటకం మొదలుపెట్టింది. శ్రీలక్ష్మిని నమ్మిన కుటుంబ సభ్యులు, బంధువులు నిజమేననుకుని విజయ్ అంత్యక్రియలు పూర్తి చేసారు.

విజయ్ హత్య తర్వాత రాజేష్ వికారాబాదాద్ వెళ్లిపోయాడు. విషయం బయటకు పొక్కితే జైలుకి వెళ్లాల్సి వస్తుందని మూడన్నర నెలలపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. విజయ్​ను కొడుతుండగా తనను చంపొద్దని వేడుకోవడం తనకు పదే పదే గుర్తుకొచ్చి, పశ్చాత్తాపంతో కుంగిపోయాడు. దీంతో గురువారం మధురానగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి జరిగిన విషయం చెప్పేశాడు. ఒక వ్యక్తిని చంపినందుకు మానసిక ప్రశాంతత కరవైందని, తను లొంగిపోతున్నట్లు పోలీసులకు తెలిపాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, రాజేశ్వర్‌ రెడ్డి, శ్రీలక్ష్మి, రాజేశ్‌, మైతాబ్‌పై కేసు నమోదు చేశారు.

Read Also : AP Elections : ఏపీ ఎన్నికల్లో.. మహిళలు ఎలా ఓటు వేశారు..?

Exit mobile version