ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..ఆ తర్వాత సావిత్రి లెవల్లో నటించిన భార్య

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రాజేశ్వరి అనే మహిళకు ఆరు నెలల క్రితం శరత్ అనే వ్యక్తితో ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. కట్టుకున్న భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారన్న

Published By: HashtagU Telugu Desk
Wife Killed Husband

Wife Killed Husband

అక్రమ సంబంధాలు రోజు రోజుకు ఎక్కువై పోతున్నాయి. భర్త ఉండగానే మరో వ్యక్తి తో అక్రమ సంబంధం పెట్టుకొని కట్టుకున్న భర్త ను , కడుపున బిడ్డలను హత్య చేయడానికి కూడా కొంతమంది మహిళలు వెనుకాడడం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రాజేశ్వరి అనే మహిళకు ఆరు నెలల క్రితం శరత్ అనే వ్యక్తితో ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. కట్టుకున్న భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారన్న విషయాన్ని మరిచి రాజేశ్వరి ప్రియుడి మోజులో పడింది. భర్త మద్యం తాగి వేధిస్తున్నాడని, తాను బాగా చూసుకుంటానని ప్రియుడు నమ్మించడంతో, తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను వదిలించుకోవాలని రాజేశ్వరి నిర్ణయించుకుంది. క్షణికావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసింది.

పక్కా ప్లాన్ – సావిత్రి రేంజ్ లో నటన

గురువారం రాత్రి భర్త కృష్ణ మద్యం సేవించి నిద్రిస్తున్న సమయంలో, రాజేశ్వరి తన ప్రియుడు శరత్ ను ఇంటికి రప్పించింది. ఇద్దరూ కలిసి అత్యంత కిరాతకంగా కృష్ణ కాళ్లు, చేతులు కట్టేసి, ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్లుగా తెల్లవారేసరికి రాజేశ్వరి తన నటనను మొదలుపెట్టింది. భర్త స్పృహలో లేడని నాటకమాడి ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ డాక్టర్లు చనిపోయాడని చెప్పిన తర్వాత, తన పుట్టింటి వారికి ఫోన్ చేసి సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేసింది. సావిత్రి లెవల్లో ఆమె చేసిన నటన చూసి మొదటి ఎవరూ అనుమానించలేదు.

పోలీసుల విచారణ – బయటపడ్డ అసలు నిజం

కృష్ణ మృతిపై అతని తల్లి అంజమ్మకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు రాజేశ్వరిని తమదైన శైలిలో విచారించగా, ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం బలపడింది. చివరకు పోలీసుల విచారణలో తన ప్రియుడితో కలిసి భర్తను చంపినట్లు ఆమె ఒప్పుకుంది. పోలీసులు నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని శనివారం రిమాండ్ కు తరలించారు. సోషల్ మీడియా పరిచయాలు, వివాహేతర సంబంధాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే ఇటువంటి దారుణమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ ఘటన హెచ్చరిస్తోంది.

  Last Updated: 22 Feb 2026, 11:34 AM IST