Site icon HashtagU Telugu

KTR : పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలి..? కేటీఆర్ వినూత్న క్యాంపెయినింగ్‌

Formula E Race

Formula E Race

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ తమ సత్తా చాటాలని చూస్తుంది. ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ వినూత్న క్యాంపెయినింగ్‌ మొదలుపెట్టారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వరుస సన్నాహక సమావేశాలు జరుపుతూ వస్తున్న కేటీఆర్.. సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎందుకు ఓటెయ్యాలో వివరించారు. తెలంగాణ గళాన్ని పార్లమెంట్లో గట్టిగా వినిపించేది బీఆర్ఎస్ మాత్రమే అని .. లోక్ సభలో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ఎన్ని సార్లు వివరించారో లెక్కలతో సహా తెలిపారు.

16,17 లోక్ సభ సమావేశాల్లో ఏ ఏ పార్టీలు కేంద్రానికి ఎన్ని ప్రశ్నలు సంధించారో గణాంకాలు విడుదలయ్యాయి. ఈ లెక్కల ప్రకారం బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని 4,754 సార్లు ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ 1271, బీజేపీ 190 సార్లు మాత్రమే ప్రశ్నించారు. ‘‘2014లో రాష్ట్రం సాధించినప్పుడు తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక టీఆర్ఎస్. 2024లో కూడా తెలంగాణకున్న ఏకైక గొంతుక మన పార్టీ మాత్రమే. నాడు.. నేడు.. ఏనాడైనా.. తెలంగాణ గళం.. తెలంగాణ బలం.. తెలంగాణ దళం.. మనమే..అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

అలాగే మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ..కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని.. ఐదేళ్లలోపే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుని ఇంటికి పోతుందని అన్నారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అమలుచేయలేక చేతులెత్తేసిందని.. గ్యారంటీలు అమలు చేస్తే కర్ణాటక ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలుతుందని అక్కడి ఆర్థిక సలహాదారు హెచ్చరించినట్లు హరీష్ రావు గుర్తు చేశారు. ఇంకా 100 రోజులు కాలేదు కాబట్టి కాంగ్రెస్ గ్యారెంటీలపై మాట్లాడడం లేదని.. 100 రోజుల తర్వాత అమలు చేయకపోతే ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని హరీష్ రావు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ రాష్టరాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. విభజన సమస్యలు ఇంకా అమలు కాలేదన్న ఆయన.. ఈ సమయంలో ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు లేకపోతే తెలంగాణకు నష్టం వాటిల్లుతుందని చెప్పుకొచ్చారు.

Read Also : Telangana – Adani : తెలంగాణలో అదానీ రూ.12,400 కోట్ల పెట్టుబడులు.. వివరాలివీ