Site icon HashtagU Telugu

Kishan Reddy: కాళేశ్వరం అవినీతిపై లేఖ ఎందుకు రాయడం లేదు, రేవంత్ పై కిషన్ రెడ్డి ఫైర్

Kishan Reddy Sensational comments on Congress and BRS and MIM

Kishan Reddy Sensational comments on Congress and BRS and MIM

Kishan Reddy: కాంగ్రెస్‌ పాలన, బీఆర్‌ఎస్‌ నేతలపై విచారణ తదితర అంశాలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపించాలని కోరుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదన్నారు. న్యాయ విచారణ పేరుతో కేసీఆర్‌కు మేలు చేసేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు భూసార పరీక్షలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతోందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోందని విమర్శించారు.

తెలంగాణలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించడం లేదన్నారు. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా నిషేధం విధించి జీవో కూడా తెచ్చారని గుర్తు చేశారు. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారంలో సీబీఐ విచారణకు అంగీకరిస్తుందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన కిషన్ రెడ్డి, సిబిఐకి లేఖ రాయాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. దర్యాప్తు బాధ్యత కేంద్రం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ను కాంగ్రెస్ కాపాడుతోందని అందుకే న్యాయ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.

కుటుంబ పాలన వల్లే కేసీఆర్ ఓడిపోయారని కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒక్క సీటు గెలుచుకున్నా ఫలితం శూన్యం. కాంగ్రెస్ పార్టీ అధినేత ఎవరో తెలియని పరిస్థితి ఉందని అందుకే బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సిట్టింగ్ ఎంపీలకు సీట్ల హామీపై పార్టీలో ఎక్కడా చర్చ జరగలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంఆర్‌పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ నుంచి ఎంపీగా పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ కృషి చేస్తున్నారని గుర్తు చేశారు.