Site icon HashtagU Telugu

KTR Strategy : ఆంధ్ర కార్డును కేటీఆర్ ఇప్పుడెందుకు బయటకు తీశారు?

Why Did Ktr Take Out The Andhra Card Now

Why Did Ktr Take Out The Andhra Card Now

By: డా. ప్రసాదమూర్తి

KTR Playing Andhra Card : సాధారణ పరిస్థితుల్లో నాయకులు సాగించే రాజకీయాలకు, ఎన్నికలు దగ్గర పడిన సమయంలో వాళ్లు ప్లే చేసే మైండ్ గేమ్ రాజకీయాలకు చాలా తేడా ఉంటుంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత వారి ముందుండే లక్ష్యాలు వేరుగా ఉంటాయి. అధికారంలోకి వస్తే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, చేసిన వాగ్దానాలను అమలుపరిచే అంశాల మీద వారు దృష్టిని కేంద్రీకరిస్తారు. పాలక పక్షం ఒకరకంగా, ప్రతిపక్షం మరొకరకంగా సాధారణ సమయంలో రాజకీయ లక్ష్యాలతో ముందుకు సాగుతారు. కానీ ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడు అందరి లక్ష్యం ఒకటే. అదే విజయం.

ఆరు నూరైనా తిమ్మిని బమ్మి చేసినా బమ్మిని తిమ్మి చేసినా ఎన్నికల్లో గెలవడమే పరమావధిగా వారు పావులు కదుపుతారు. తెలంగాణ ముఖ్యమంత్రి కొడుకు, మంత్రివర్గంలో కీలకమైన వ్యక్తి కేటీఆర్ (KTR) మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కొంచెం ఆశ్చర్యాన్ని, కొన్ని అనుమానాల్ని, మరిన్ని ఊహాగానాలను రేకెతిస్తున్నాయి.

KTR చేసిన వ్యాఖ్యలలో జమిలి ఎన్నికల మీద ఒకటి.. ఆంధ్ర నాయకుల మీద మరొకటి కీలకంగా చర్చకు దారి తీసాయి. గతంలో జమిలి ఎన్నికలకు ఆమోదం తెలుపుతూ తాము కేంద్రానికి ఉత్తరం రాసినప్పటికీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ తలపెట్టిన ప్రయత్నాలు కరెక్ట్ కాదని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. సరే, ఆ మాట అలా ఉంచితే ఆంధ్రా నాయకులు తిరిగి దొడ్డిదారిన తెలంగాణలో ప్రవేశించి ఇక్కడ తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారని, వారికి ప్రతిపక్షాలు ఆశ్రయమిస్తున్నాయని తీవ్రంగా కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఆయన ఈ మాటలు అనడంలో ఎవరి వైపు బాణాలు ఎక్కుపెట్టారో మనకు అర్థమవుతుంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారైంది.

17వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించబోతున్న సభకు రెండు రోజులు ముందే షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జరుగుతుందని వార్త. అలాగే కేవీపీ రామచంద్రరావు తాను 40 సంవత్సరాలుగా హైదరాబాదులో ఉంటున్నానని, తనను తెలంగాణ వాడిగా గుర్తించాలని చేసిన వ్యాఖ్యలు కూడా కేటీఆర్ మనసులో ఉన్నాయి. అంతేకాదు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటాన్ని నిలువెల్లా వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో బిజెపి కార్యకలాపాలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా నిర్దేశిస్తున్నట్టు కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఒకప్పుడు హైజాక్ చేసి అణచివేయాలని చూసిన కేవీపీ రామచంద్రరావు తనను తెలంగాణ వాదిగా గుర్తించమని ప్రాధేయపడటం ఏమిటని ఆయన ఎద్దేవా చేశారు.

Also Read:  AP Govt : ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు భద్రతను పెంచిన ఏపీ సర్కార్..

ఇదంతా సరే. ఇప్పుడే కేటీఆర్ ఎందుకు ఆంధ్రా కార్డు బయటకు తీసినట్టు? దీనివల్ల ఆయన తెలంగాణ ప్రజలకు, రాజకీయ వర్గాలకు, మీడియా వర్గాలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారనేది స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలను పార్టీలోకి చేర్చుకోవడమే కాదు ఆమె ద్వారా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని ఆంధ్రాలో వైసీపితో సంబంధాలు నెలకొల్పు కోవడానికి ప్రణాళికలు రచిస్తోందన్న ఊహాగానాలను బిఆర్ఎస్ నాయకులు గట్టిగా పట్టించుకున్నట్లు అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపి రెడ్డి సామాజిక వర్గం నాయకత్వంలో ఆంధ్రాలో ప్రభుత్వాన్ని నడుపుతున్న విషయం తెలిసిందే. జగన్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయితే ఆ ప్రభావం తెలంగాణలో ఉన్న ఆయన సామాజిక వర్గం మీద పడవచ్చు. షర్మిల రాకతో జరిగే ప్రయోజనం కంటే జగన్ ద్వారా ఒనగూరే మేలు ఇంకా ఎక్కువగా ఉంటుంది.

ఇలాంటి సమయంలో చూస్తూ ఊరుకుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టే అవుతుంది. అందుకే కేటీఆర్ ఆంధ్రా కార్డును బయటకు తీశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగిన కాలంలో ఆంధ్రా తెలంగాణ మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ఆ కార్డు ఎంతగానో ఉపయోగపడింది. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు పోరాడి గెలుచుకున్న ఈ రాష్ట్రాన్ని తిరిగి ఆంధ్ర నాయకుల అధిపత్యంలోకి పోనిస్తే మళ్లీ మన గతి అంతే అని చెప్పడం ద్వారా తెలంగాణ ప్రజల మనోభావాలను రెచ్చగొట్టవచ్చు. తద్వారా ఎన్నికలలో తమకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవచ్చు. మతపరమైన కులపరమైన ప్రాంతీయమైన భావోద్వేగాలు ప్రజలలో చాలా వేగవంతంగా పనిచేస్తాయి.

రాజకీయ నాయకులకు ఈ విషయం అర్థమైనంతగా మరొకరికి తెలియదు. అందుకే కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రా నాయకులు తెలంగాణలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగానే ఉన్నామని ప్రజలకు ఒక సందేశాన్ని వర్తమానాన్ని పంపడానికి ఈ మీడియా చాట్ ఏర్పాటు చేశారు. అదే సందర్భంగా ప్రతిపక్షం తమను దెబ్బతీయడానికి ఆంధ్రా నాయకులను రంగంలోకి దింపుతుందని చెప్పడంలో ఆయన ఉద్దేశం మనకు స్పష్టమే.

తాము రాష్ట్రం కోసం అహర్నిశలు పాటుపడుతుంటే తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా అన్ని కుట్రలూ పన్నిన ఆంధ్రా నాయకులతో ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపిలు అంట కాగుతున్నాయని చెప్పడమే ఆయన ఉద్దేశం. ప్రజలలో సహజంగా ఉవ్వెత్తున పొంగే భావోద్వేగాలను పసిగట్టి వాటిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో తండ్రి కంటే రెండు ఆకులు ఎక్కువే చదువుకున్నాడు తనయుడు అని కేటీఆర్ మరోసారి నిరూపించుకున్నారు.

Also Read:  Chandrababu – Legal Battle : ఒకే రోజు ఐదు పిటిషన్లు.. చంద్రబాబు కేసులో ఇవాళ విచారణ