Protests Of IT Employees: ఐటీ ఉద్యోగుల నిరసనలపై కేటీఆర్ నిషేధం ఎందుకు..?

ఐటి ఉద్యోగులు (Protests Of IT Employees) చంద్రబాబుకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు చేయడమే కాదు, ర్యాలీగా ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసే ప్రయత్నాలు కూడా చేశారు.

  • Written By:
  • Updated On - September 27, 2023 / 08:41 AM IST

By: డా. ప్రసాదమూర్తి

Protests Of IT Employees: అర్థం లేకుండా రాజకీయ నాయకులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. ఏ ఆలోచనా లేకుండా రాజకీయ నాయకులు ఒక్క మాట కూడా మాట్లాడరు. మాట మాటలో అడుగు అడుగులో రాజకీయ ప్రయోజనాలే నాయకుల పరమ లక్ష్యం. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై సిఐడి కేసులు బనాయించి, ఆయన ప్రజా జీవితంలో లేకుండా తెరమరుగైతే తమ రాజకీయ ఆధిపత్యం యధేచ్ఛగా కొనసాగుతుందని జగన్ ప్రభుత్వం భావించింది. ఆ వ్యూహంలో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేయించి జైల్లో పెట్టారు. అత్యున్నత న్యాయస్థానంలో బాబు అరెస్టుపై వాదనలు సాగుతున్నాయి. ఇది ఇలా ఉంటే చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆంధ్ర నుంచి అమెరికా దాకా ప్రదర్శనలు వెల్లువెత్తాయి.

ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు. ఈ దేశం ఆదేశం అని లేదు. చంద్రబాబు సానుభూతిపరులు, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. ఆ భాగంగానే హైదరాబాదులో కూడా ఐటీ ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అయితే ఈ నిరసన ప్రదర్శనలను చూస్తూ ఊరుకుంటే క్రమంగా రానున్న తెలంగాణ ఎన్నికలలో ఈ ప్రభావం ఉండొచ్చని బి ఆర్ ఎస్ నేతలకు ఆందోళన పట్టుకున్నట్టు ఉంది. అందుకే తాజాగా కేటీఆర్ ఐటీ ఉద్యోగుల నిరసన ప్రదర్శనల పట్ల తీవ్రమైన అభ్యంతరాన్ని తెలియజేశారు. అలాంటి ప్రదర్శనలు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదులో జరగనివ్వమని ఆయన తెగేసి చెప్పారు.

ఐటి ఉద్యోగులు (Protests Of IT Employees) చంద్రబాబుకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు చేయడమే కాదు, ర్యాలీగా ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసే ప్రయత్నాలు కూడా చేశారు. నారా కుటుంబానికి మద్దతుగా ఈ ప్రదర్శనలు సాగుతున్నాయి. మొదట్లో ఈ ప్రదర్శన పట్ల తెలంగాణ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. కానీ ప్రదర్శనల జోరు, రోజురోజుకీ పెరుగుతుండడంతో తెలంగాణలో ఇప్పటికీ తెలుగుదేశం అభిమానులు, సానుభూతిపరులు గణనీయంగా ఉన్నారన్న విషయం స్పష్టమైంది. ఇది ఇలా వదిలేస్తే రానున్న శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభిమానులు, సానుభూతిపరులు తమకు వ్యతిరేక పక్షమైన వారితో చేతులు కలిపే ప్రమాదం ఉంది. అసలే పోటీ కాంగ్రెస్.. బీఆర్ఎస్ మధ్య తగ్ ఆఫ్ వార్ గా మారింది.

ఇలాంటి సమయంలో ప్రతి ఒక్క ఓటూ అతి కీలకంగా మారుతుంది. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారే. ఆయన పార్టీ మారినా తెలుగుదేశంతో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారన్న అభిప్రాయం సర్వత్రా నెలకొని ఉంది. తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం ఏరియాలలో తెలుగుదేశం సానుభూతిపరులు చాలామంది ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి లెక్కించదగిన స్థాయిలో ఓట్లు రావడం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. బీఆర్ఎస్ పార్టీలోనే ఎందరో నాయకులు ఇప్పటికీ తెలుగుదేశం పట్ల సానుభూతితో ఉన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ కి గాని బిజెపికి గాని పరోక్షంగా సహాయపడితే అది బీఆర్ఎస్ గెలుపు ఓటముల మీద గణనీయంగా ప్రభావం చూపించవచ్చు.

Also Read: Byju’s Lay Off: 5 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించిన బైజూస్..!

దేన్నైనా మొగ్గలోనే తుంచి వేయాలన్న సామెత అందరికంటే ఎక్కువగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆయన తనయుడు కేటీఆర్ కు బాగా తెలుసు. ప్రాంతాలవారీగా నియోజకవర్గాల వారీగా గ్రామాల వారీగా ఓటర్ల లెక్కలు బయటకు వస్తున్న ఈ నేపథ్యంలో, చిన్న గడ్డిపోచను కూడా వదులుకోవడానికి నాయకులు సిద్ధంగా ఉండరు. గణనీయమైన సంఖ్యలో ఉన్న తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, ఐటీ ఉద్యోగుల నిరసన ప్రదర్శనతో రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అందుకే కేటీఆర్ ఐటీ ఉద్యోగుల నిరసన ప్రదర్శన పై తీవ్రంగా విరుచుకుపడ్డారు ఎక్కడి సమస్య అక్కడే తేల్చుకోవాలని ఆయన నిష్కర్షగా చెప్పారు. ఆంధ్రా లొల్లి తెలంగాణలో దేనికి అని ఆయన ప్రశ్నలు చేశారు.

ఇక్కడ ఆంధ్రా తెలంగాణ ప్రజలు సామరస్యంగా జీవిస్తున్నారని, ఇలాంటి ఆందోళనలు ప్రదర్శనలతో ఆ సామరస్యం దెబ్బతింటుందని ఆయన పైకి అంటున్నారు. కానీ అసలు దెబ్బ తినేది ఏమిటో లోతుకు వెళ్లి ఆలోచిస్తే అందరికీ అర్థమవుతుంది. ఒక ప్రాంతంలో జరిగిన ఘటనకు ప్రపంచంలో ఎక్కడైనా నిరసన వెల్లువెత్తే అవకాశాలు ఉన్నాయి, సందర్భాలూ ఉన్నాయి, ఉదాహరణలూ ఉన్నాయి. కాబట్టి కేటీఆర్ ఐటి ఉద్యోగుల నిరసన ప్రదర్శనలపై విధించిన నిషేధం వెనుక అసలు ఉద్దేశం మనకు అర్థమవుతుంది. అసలు నిషేధం అంటూ విధిస్తే ఆ అణచివేత కు గురైన వారు మరింత ఉధృతంగా పైకి లేస్తారని చరిత్ర చెబుతోంది. ఈ విషయం కేటీఆర్ కు మాత్రం తెలియదా?