Telangana CPM : సిపిఎం పోటీ ఎవరికి లాభం?

  • Written By:
  • Updated On - November 6, 2023 / 01:32 PM IST

By: డా. ప్రసాదమూర్తి

Telangana CPM :  తెలంగాణ ఎన్నికల్లో ఇక రోజు రోజుకూ రాజకీయ పరిణామాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎవరెవరు ఎటువైపు..? ఎవరి ప్రయత్నాలు ఎవరికి ఫలిస్తాయి..? ఇలాంటి విషయాల్లో సందేహాలు కూడా క్రమక్రమంగా ఒక కొలిక్కి చేరుకుంటున్నాయి. వామపక్షాలు ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకుంటాయి అనే విషయం మీద ఒక ఉత్కంఠత ఇప్పటివరకు నెలకొని ఉంది. దానికి ఇప్పుడు తెరపడింది. అధికార బీఆర్ఎస్ ఆహ్వానం కోసం ఎదురు తెన్నులు చూసిన వామపక్షాల వైపు కేసీఆర్ కన్నెత్తి కూడా చూడలేదు. ఆ తరువాత కాంగ్రెస్ తో ఎన్నికల బంధానికి ఎన్నాళ్లుగానో వామపక్షాలు ఎదురు చూశాయి. ఈ ఎదురుచూపులు కూడా ఫలించలేదు. కానీ కాంగ్రెస్ తెలంగాణలో క్రమక్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా ఉండాలని సిపిఐ కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధపడింది. ఒక్క సీటు ఇస్తామన్నా దానికి సిపిఐ అంగీకరించింది.

కానీ సిపిఎం (CPM) మాత్రం ఒక సీటుతో రాజీ పడడానికి ఇష్టపడలేదు. సిపిఎం 5 సీట్లు అడిగినట్లు తెలుస్తోంది. వారికి రెండు సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ముందు వాగ్దానం చేసిందట. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు సిపిఎం (CPM) ఒంటరిగా 17 స్థానాల్లో పోటీ చేస్తానని ప్రస్తుతానికి 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు గణనీయంగా ఉండే ఖమ్మం జిల్లాలో సిపిఎం పోటీ చేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుంది అనేది పలువురు పలు ఊహాగానాలు సాగిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

సిపిఎం (CPM)తో చర్చలు సాగించిన కాంగ్రెస్, రెండు సీట్లు ఇస్తామని వాగ్దానం చేసి తిరిగి ఎందుకు వెనక్కి తగ్గిందో తెలియదు. కీలకమైన నియోజకవర్గాల్లో అధికార బీఆరెస్ తో కాంగ్రెస్ ముఖాముఖి తలపడాలి. ఆ పోరాటంలో మధ్యలో మరొకరు దూరితే ఆ మేరకు కాంగ్రెస్కే ప్రమాదం ఉంటుంది. ఆ విషయాన్ని కాంగ్రెస్ గ్రహించి తెలివిగా సిపిఎంతో పొత్తు విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉండాల్సింది. అలా జరగలేదు. అది సరే. సిపిఐ పార్టీ నాయకులు మాత్రం తమకు సీట్లు ప్రధానం కాదని, జాతీయ రాజకీయాల ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణలో కాంగ్రెస్తో కలిసి ఎన్నికలలో ఉండడం తమకు ప్రధానమని చెప్పారు.

అందుకే తాము ఒక ఎమ్మెల్యే సీటు, ఒక ఎమ్మెల్సీ సీటుకు అంగీకారం తెలిపినట్టు వారు చెబుతున్నారు. అంతేకాదు ఇటు కాంగ్రెస్ ని, అటు సిపిఎం ని కూడా ఒప్పించడానికి సిపిఐ నాయకులు ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి కీలకమైన దశలో పంతాలకు పోతే అది మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుందని ఇంత చరిత్ర ఉన్న రాజకీయ నాయకులకు తెలియదా? కానీ అటు కాంగ్రెస్ పంతంగానే ఉంది ఇటు సిపిఎం పోటీలోకి దూకనే దూకింది.

సిపిఎం ప్రస్తుతం అభ్యర్థులను ప్రకటించిన 14 స్థానాలు, మరో మూడు స్థానాలు కలిపి మొత్తం 17 స్థానాలు ఖమ్మం నల్గొండ జిల్లాల్లో కీలకమైనవి. ఈ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మెరుగైన అవకాశాలు ఉన్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. అలాంటప్పుడు కాంగ్రెస్ అయినా కొంత రాజీ పడాలి లేదా సిపిఎం అయినా కొంత దిగి రావాలి. అలా జరగలేదు సరే, కాంగ్రెస్తో చర్చలు సఫలం కాలేదు. మరి సిపిఎం అలాంటప్పుడు ఏం చేయాలి? తాము పోటీ చేస్తామన్న ఆ నాలుగైదు నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమై, మిగతా వాటిలో దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాల్సిందిగా తమ పార్టీ సానుభూతిపరులకు సందేశం పంపాలి.

Also Read:  Kodandaram: కాళేశ్వరం డ్యామ్ లా బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం: కోదండారం వ్యాఖ్యలు

అలా ఇక్కడ జరగలేదు. కాంగ్రెస్ పార్టీ తమను నిర్లక్ష్యంగా చూసింది కాబట్టి ఆ పార్టీని ఓడించడమే తమ ధ్యేయంగా మారింది అన్నట్టు సిపిఎం ఇప్పుడు కీలకమైన 17 స్థానాల్లో అభ్యర్థులను నిలబెడుతోంది. సిపిఐ ప్రదర్శించిన దేశ ప్రయోజనాల నీతిని ఆశయాన్ని సిపిఎం ప్రదర్శించడానికి ఎందుకు వెనుకాడుతోంది అనేది ముఖ్యమైన ప్రశ్న. నిన్న జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తమ పోటీకి మూడు లక్ష్యాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఒకటి తమ పార్టీ అభ్యర్థులను అసెంబ్లీకి పంపించడం, తద్వారా ప్రజా సమస్యలపై చట్టసభల్లో పోరాటం చేయడం, రెండు సోదర వామపక్ష పార్టీ సిపిఐ అభ్యర్థుల కు మద్ధతు ఇవ్వడం,మూడు బిజెపిని అడ్డుకోవడం- ఈ మూడు అంశాలతో తాము ఎన్నికలలో పోటీకి దిగుతున్నట్టు సిపిఎం పత్రికా ప్రకటనలో కూడా పేర్కొంది. కానీ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే హిందుత్వ రాజకీయాలతో దేశంలో సామరస్యాన్ని దెబ్బతీసే దిశగా సాగుతున్న బిజెపిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ఉమ్మడిగా సాగిస్తున్న ప్రయత్నంలో భాగంగా, తెలంగాణలో వామపక్షాలు కాంగ్రెస్కు భేషరతుగా మద్దతు ప్రకటించాల్సి ఉంది అని పలు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో బహుముఖ పోటీ జరగడం వల్ల అధికార పార్టీకి లాభం జరుగుతుంది.

అలా లాభం జరగడానికి ఎవరు ఏ విధంగా సహాయపడినా అది ఎన్నో సందేహాలకు దారి తీస్తుంది. అసలే బిజెపి, తాము గెలవకపోయినా కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రాకూడదన్న వ్యూహంతో ముందుకు నడుస్తోంది. సిపిఎం ఇప్పుడు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసి తాము గెలిచే అవకాశాలు లేకపోయినా, కాంగ్రెస్ ను దెబ్బతీసే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని నిరూపించుకోవడం వల్ల ఏ ప్రయోజనాలను వారు ఆశిస్తున్నారు అనేది ఆ నాయకులే చెప్పాలి. అంతేకాదు కలిసి వచ్చే సర్వశక్తులనూ కలుపుకొని ముందుకు సాగాల్సిన కాంగ్రెస్, ఇలా కామ్రేడ్లను దూరం చేసుకుంటే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకొని అడుగులు వేయాల్సి ఉంటుంది.

ఇంకా సమయం మించిపోలేదు. బహుశా కాంగ్రెస్ కి కామ్రేడ్స్ కి మధ్య సయోధ్య కుదరడానికి అవకాశాలు ఇంకా ఉన్నాయన్న ఆశాభావాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. చూడాలి ఈ కీలక సమయంలో ఈ పార్టీల నాయకులు ఏ కీలక నిర్ణయాన్ని తీసుకుంటారో.

Also Read:  Congress 3rd List : ఈరోజు కాంగ్రెస్ మూడో జాబితా రిలీజ్ చేస్తుందా..?