Gurram Vijaya Lakshmi : ఆమె పేరు.. గుర్రం విజయలక్ష్మి. అక్రమంగా 325 విల్లాలను నిర్మించింది. వీటిలో 65 విల్లాలకు మాత్రమే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అనుమతులు ఉన్నాయి. మిగతా విల్లాలకు గ్రామ పంచాయతీల అనుమతులను తీసుకొని సరిపెట్టుకున్నారు. మొత్తం 325 విల్లాలలో 260 విల్లాలను గుర్రం విజయలక్ష్మి విక్రయించి సొమ్ము చేసుకుంది. ఈవిధంగా దాదాపు రూ.300 కోట్ల మోసానికి తెరలేపింది. బుధవారం అర్ధరాత్రి అమెరికాకు పారిపోయేందుకు గుర్రం విజయలక్ష్మి యత్నించింది. పాస్‌పోర్టు, వీసా తనిఖీ సమయంలో లుక్‌అవుట్ నోటీసు ఉన్నట్లు ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని దుండిగల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో గుండెపోట్లు వచ్చినట్లు విజయలక్ష్మి(Gurram Vijaya Lakshmi) నటించింది. వెంటనే అక్కడికి చేరుకున్న దుండిగల్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
Also Read :Phone Tapping Case : బీఆర్ఎస్ హయాంలో 18 మంది హైకోర్టు జడ్జీలపై నిఘా
- గుర్రం విజయలక్ష్మి (48) హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఉన్న బాలాజీనగర్ వాస్తవ్యురాలు.
- ఆమె శ్రీలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్, శ్రీలక్ష్మి మాగ్నస్ కన్‌స్ట్రక్షన్స్ అండ్, భావన జీఎల్‌సీ క్రిబ్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది.
- 2018లో మల్లంపేటలోని 170/3, 170/4, 170/4ఎ సర్వే నెంబర్లలో విల్లాలను నిర్మించింది.
- ఆమె విక్రయించిన దాదాపు 260 విల్లాలు అక్రమమని ఫిర్యాదులు వచ్చాయి.
- 2021-2024 మధ్య దుండిగల్ పోలీస్‌స్టేషన్‌లో విజయలక్ష్మిపై 7 కేసులు నమోదయ్యాయి.
- దీంతో 2021లో అప్పటి జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ విచారణ జరిపించి 201 విల్లాలను సీజ్ చేశారు. అయినా తన పలుకుబడితో వాటికి విజయలక్ష్మి రిజిస్ట్రేషన్లు చేయించింది.
- ఈ విల్లాలలో స్థానిక కత్వ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో నిర్మించినవి 26 ఉన్నాయి.
- 2024 సంవత్సరం సెప్టెంబరులో హైడ్రా ఆధ్వర్యంలో 15 విల్లాలను కూల్చివేశారు.
- ఆమె నిర్మించిన విల్లాలలో స్విమ్మింగ్ పూల్, యోగాహాల్, ఇన్‌డోర్, అవుట్‌డోర్ మొదలైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపింది. అయితే వాటిలో కనీసం డ్రైనేజీ, నీటి సదుపాయం, కరెంట్ మీటర్లు, కాంపౌండ్ వాల్ వంటి సదుపాయాలను కూడా కల్పించలేదు.