TRS Rajya Sabha: టీఆర్ఎస్ లో రాజ్యసభ అభ్యర్థుల లొల్లి.. ఆ ముగ్గురు నేతలకు ఛాన్సెంత?

ఏ రాష్ట్రంలో అయినా సరే రాజ్యసభకు పార్టీ తరపున ఎవరినైనా పంపించాలంటే.. సీనియర్ నేతలను కాని, సమీకరణాల ద్వారా మరికొందరు నేతలను కాని ఎంపిక చేస్తాయి పార్టీలు. వారంతా రేసులో ఉన్నవారే అయ్యుంటారు.

  • Written By:
  • Updated On - March 23, 2022 / 11:16 AM IST

ఏ రాష్ట్రంలో అయినా సరే రాజ్యసభకు పార్టీ తరపున ఎవరినైనా పంపించాలంటే.. సీనియర్ నేతలను కాని, సమీకరణాల ద్వారా మరికొందరు నేతలను కాని ఎంపిక చేస్తాయి పార్టీలు. వారంతా రేసులో ఉన్నవారే అయ్యుంటారు. కానీ తెలంగాణలో మాత్రం ఈ రాజకీయం భిన్నంగా ఉంటుంది. అసలు రేసులో లేని.. ఎవరూ ఊహించని వ్యక్తులను సడన్ గా తెరపైకి తీసుకువస్తారు కేసీఆర్. అంతే వేగంగా వారిని రాజ్యసభకు పంపిస్తారు. మరి త్వరలో ఖాళీ కాబోతున్న మూడు రాజ్యసభ స్థానాల విషయంలో టీఆర్ఎస్ ప్లానేంటి?

టీఆర్ఎస్ తరుపున ఎన్నికైన రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు… కొన్ని నెలల్లో రిటైర్ కాబోతున్నారు. ఆ మూడు స్థానాలూ టీఆర్ఎస్ కే వస్తాయి. కాకపోతే ఈసారి రేసులో ఉన్నవారిలో ఎవరు అధిష్టానం దృష్టిలో ఉన్నారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు మాజీ ఎంపీ వినోద్ ఇంకా దాదాపు పదిమంది నేతలు వీటికోసం రేసులో ఉన్నారు. మరి వీరిలో ఎవరిని అదృష్టం వరించనుంది?

రాబోయే కాలంలో రాజ్యసభ సభ్యుల సంఖ్య కూడా చాలా విషయాల్లో కీలకం కానుంది. అందుకే ఈసారి రాజ్యసభ అభ్యర్థులను జాగ్రత్తగా ఎంపిక చేసే అవకాశముంది. పార్టీ విధేయులకే ఇస్తారా? లేక లో ప్రొఫైల్ ఉన్నవారికీ కట్టబెడతారా అన్నది పార్టీలో డిస్కషన్ నడుస్తోంది. పార్టీ పరంగా చూస్తే.. బోయినపల్లి వినోద్ కు ఛాన్స్ ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పుట్టుక నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు కూడా. ఒకవేళ సామాజిక సమీకరణాలను కానీ లెక్కలోకి తీసుకోవాల్సి వస్తే.. మరికొందరి పేర్లు తెరపైకి వచ్చే ఛాన్సుంది.

దళితుల కోటాలో చూస్తే.. మోత్కుపల్లి నరసింహులకు అవకాశముంది. కానీ ఇదే కోటాలో ఆయన మరో పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే మోత్కుపల్లికి కేసీఆర్ పూర్తి భరోసా ఇస్తారని చెప్పలేం. కానీ ఆయన మాత్రం ఈసారి రాజ్యసభ సీటు దక్కడం ఖాయం అనే నమ్మకంతో ఉన్నారు. ఎప్పుడూ ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకునే కేసీఆర్ ఈసారి రాజ్యసభ అభ్యర్థుల విషయంలో ఎలాంటి స్కెచ్ వేస్తారో చూడాలి.