Telangana : గంజాయి వ్యాపారులపై పోలీసుల యుద్ధం

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక మంది గంజాయి వ్యాపారులపై కొరడా ఝుళిపించడంతో తెలంగాణ పోలీసులు విజయం సాధించారు. అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో నిరంతరం నిఘా కొనసాగిస్తూ బలమైన నిఘా నెట్‌వర్క్ అమలుచేస్తున్నారు.

  • Written By:
  • Updated On - November 15, 2021 / 10:44 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక మంది గంజాయి వ్యాపారులపై కొరడా ఝుళిపించడంతో తెలంగాణ పోలీసులు విజయం సాధించారు. అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో నిరంతరం నిఘా కొనసాగిస్తూ బలమైన నిఘా నెట్‌వర్క్ అమలుచేస్తున్నారు. ఆంధ్రా ఒడిశా బోర్డర్ నుంచి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల మీదుగా హైదరాబాద్‌కు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తుల కదలికలపై పోలీసులు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ సమన్వయంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

గతంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌పై సమాచారం అందితేనే పోలీసు, ఎక్సైజ్ శాఖలు చిరువ్యాపారులపై చర్యలు తీసుకునేవాళ్లు. అయితే రాష్ట్రంలో డ్రగ్స్ ను నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెలలో పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, నిఘా పెంచాలని ఆదేశాలు జరీ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అందుకు తగ్గట్టుగానే గంజాయి మాఫియాను ఉక్కుపాదంతో ఎదుర్కొనేందుకు రెండు శాఖలు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాయి. అప్పటి నుండి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు AOB నుండి నిషిద్ధ వస్తువులను స్మగ్లింగ్ చేస్తున్న అనేక ముఠాలను అరెస్టు చేస్తున్నారు.

ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో నిఘా పెట్టడం సత్ఫలితాలను ఇస్తున్న కీలక కార్యక్రమాల్లో ఒకటని అధికారులు తెలిపారు. రోడ్డు మార్గంలో గంజాయి పొందుతున్న చిరువ్యాపారులపై నిఘా వేయడంతో కొందరు రైలు మార్గాల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నారు. అయితే సాధారణ కంపార్ట్ మెంట్లలో పోలీసులు తనిఖీలు చేస్తుండటంతో స్మగ్లర్లు ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్లలో ప్రయాణిస్తున్నారు. పోలీసులు పటిష్టమైన నిఘా ఏర్పాటుచేయడంతో పలువురు పట్టుబడ్డారు. గత కొన్ని రోజుల్లో డజనుకు పైగా వ్యక్తులను అరెస్టు చేశారు.

ఈ అరెస్టయిన వ్యక్తులు కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారు. స్మగ్లర్ల పని తీరును వివరిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మాట్లాడుతూ నిషేధిత పదార్థాన్ని స్మగ్లింగ్ చేసేందుకు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారని అన్నారు. హైవేపై ఏదైనా పోలీసుల కదలికను గమనించినట్లయితే వెంటనే అప్రమత్తమవుతున్నారు. కార్లలో సాధారణ ప్రయాణికులుగా వ్యవహరిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల గట్టి నిఘా వేయడంతో స్మగ్లర్లు భయపడిపోతున్నారు. ఒక నల్లగొండ జిల్లాలోనే పోలీసులు జరిపిన దాడుల్లో 35 వేల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. 110 మంది స్మగ్లర్లను కూడా అరెస్ట్ చేశారు. ఖమ్మం, వరంగల్ పోలీసులు ప్రధాన రహదారులపై నిఘా వేసి వేలకొద్దీ గంజాయి నిల్వలను పట్టుకున్నారు. మొత్తానికి పోలీసులు చేస్తున్న దాడులు మంచి ఫలితాలు ఇస్తుండటంతో స్మగ్లర్లు గంజాయిని సప్లయ్ చేయడానికి భయపడిపోతున్నారు.