Telangana Budget 2024: బడ్జెట్ లో మైనారిటీలను మోసం చేసిన కాంగ్రెస్

2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం సమర్పించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో మైనారిటీల సంక్షేమానికి సరిపడా నిధులు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండించింది బీఆర్ఎస్ మైనారిటీ.

Telangana Budget 2024: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం సమర్పించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో మైనారిటీల సంక్షేమానికి సరిపడా నిధులు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండించింది బీఆర్ఎస్ మైనారిటీ. సుమారు రూ.2.75 లక్షల కోట్ల బడ్జెట్‌లో మైనారిటీల సంక్షేమానికి రూ.2,262 కోట్లు కేటాయించారని అసహనం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేత అబ్దుల్లా సోహైల్. కాంగ్రెస్ ప్రకటించిన బడ్జెట్లో ముస్లింలకు ప్రకటించిన రూ.2,262 మొత్తం బడ్జెట్ తో పోలిస్తే కేవలం 0.82% మాత్రమేనని చెప్పారు. 2023-24లో మునుపటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కేటాయింపుల కంటే కేవలం రూ. 62 కోట్లు మాత్రమే ఎక్కువ అని అబ్దుల్లా సోహైల్ తెలిపారు.

ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో మైనారిటీ సంక్షేమ పథకాల ప్రస్తావన లేదని హైలైట్ చేశారు. 40 పేజీల ప్రసంగంలో మైనారిటీ అనే పదాన్ని కేవలం ఐదు సార్లు మాత్రమే ప్రస్తావించారు, ఏ పథకానికి సంబంధించి నిర్దిష్ట సూచన లేదు. మైనారిటీల కోసం ప్రస్తుతం ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లను బలోపేతం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, కానీ ఎలాంటి కేటాయింపులు చేయలేదని సోహైల్ ఎత్తిచూపారు. ఎస్సీ పాఠశాలల నిర్మాణానికి రూ.1000 కోట్లు, ఎస్టీ పాఠశాలలకు రూ.250 కేటాయిస్తే మైనార్టీ పాఠశాలలకు ఎలాంటి కేటాయింపులు జరగలేదన్నారు.

మైనారిటీల కోసం రూ.4,000 కోట్ల బడ్జెట్ హామీ ఎక్కడ అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మైనారిటీల డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ ఆయన ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ పాలనతో పోలిస్తే సంక్షేమ బడ్జెట్‌ రెట్టింపు పేరుతో మైనారిటీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని సోహైల్‌ ఆరోపించారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేసిన మైనారిటీలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోంది. మొదటగా ముస్లింలకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లేకుండా చేసి, ఇప్పుడు బడ్జెట్‌లో విస్మరించి ముస్లిం సంక్షేమాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.

4,000 కోట్ల బడ్జెట్, మైనారిటీలకు సబ్‌ప్లాన్, ఇతర హామీలను నిలబెట్టుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్‌ఎస్ పార్టీ ఆందోళన చేపడుతుందని అబ్దుల్లా సోహైల్ ప్రకటించారు.

Also Read: KTR: రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటుంది: కేటీఆర్