కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత వస్త్రాలపై జీఎస్టీ ఎత్తివేస్తామంటూ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. జోడోయాత్రలో ఉన్న ఆయన్ను చేనేత రంగం ప్రతినిధులు, పోరు రైతులు కలిసారు. రాహుల్ కు తమ సమస్యలన్నింటినీ విన్నవించుకున్నారు. ఇందిరమ్మ హయాంలో తమకు ఇచ్చిన భూములను ఇఫ్పుడు లాగేసుకుంటున్నారని గిరిజన సంఘాలు రాహుల్ కు ఫిర్యాదు చేశాయి.
పోడు భూముల సమస్యలను పరిష్కరించడంతోపాటుగా భూమి పట్టాలు అందజేసి శాశ్వత హక్కులు కల్పించాలని రాహుల్ కు వినతి పత్రం సమర్పించారు. భారత్ లో కీలకమైన వ్యవసాయ రంగం తర్వాత పెద్దదైన చేనేత రంగంపై ప్రజలు ఆధారపడి జీవిస్తుండటంతో వస్తువులపై జీఎస్టీ ఎత్తివేసేలా చూడాలని చేనేత కార్మికులు రాహుల్ గాంధీని కోరారు.