గత రెండు రోజులుగా మత ఉద్రిక్తతలు చెలరేగుతున్న నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ ఇవాళ ఏం చెప్పబోతున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ చాలా ప్రశాంతంగా ఉన్నది. ఈ క్రమంలో బీజేపీ పార్టీ వల్ల హైదరాబాద్‌లో మత సామరస్యం దెబ్బతినడమే కాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. నగరంలో జరుగుతున్న పరిణామాలపై సీఎం కేసీఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఈ రోజు రంగారెడ్డి జిల్లా కొత్త కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కొంగరకలాన్‌లో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ఈ సభలో కేసీఆర్ కచ్చితంగా హైదరాబాద్‌లోని పరిస్థితులను వెల్లడిస్తూనే.. అందుకు కారణమైన బీజేపీపై తప్పకుండా విరుచుకపడతారని భావిస్తున్నారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల కారణంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. వాటికి ఆజ్యం పోసేలా బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా మాట్లాడారు. వీరిద్దరి కారణంగానే మత ఘర్షణలు ప్రారంభమయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే ఉండదని.. దీనికి కారకులు ఎంతటి వారైనా చట్ట ప్రకారం శిక్షిస్తామని ఇప్పటికే కేసీఆర్ సమీక్షలో చెప్పినట్లు సమాచారం.