Sarpanch Salary: తెలంగాణలో సర్పంచుల వేతనం ఎంతో తెలుసా?!

తెలంగాణలో సర్పంచులు ప్రస్తుతం నెలకు రూ.6,500 గౌరవ వేతనం అందుకుంటున్నారు. 2021కి ముందు ఈ మొత్తం కేవలం రూ.5,000 మాత్రమే ఉండేది.

Published By: HashtagU Telugu Desk
Sarpanch Salary

Sarpanch Salary

Sarpanch Salary: తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో గ్రామీణ పాలనలో కీలకమైన పాత్ర పోషించే సర్పంచుల గౌరవ వేతనం (Sarpanch Salary) అంశం మరోసారి ప్రజల దృష్టిని ఆకర్షించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12,751 గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు, పరిపాలనకు నాయకత్వం వహించనున్న కొత్త‌గా ఎన్నిక‌య్యే సర్పంచులు పొందే గౌరవ వేతనం వారి పాత్రకు, శ్రమకు తగినంతగా ఉందా అనే చర్చ జరుగుతోంది.

సర్పంచుల ప్రస్తుత గౌరవ వేతనం రూ.6,500

తెలంగాణలో సర్పంచులు ప్రస్తుతం నెలకు రూ.6,500 గౌరవ వేతనం అందుకుంటున్నారు. 2021కి ముందు ఈ మొత్తం కేవలం రూ.5,000 మాత్రమే ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పాలనా బాధ్యతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వేతనాన్ని పెంచింది. అయినప్పటికీ తమ రోజువారీ జీవన వ్యయాలు, నిరంతర ప్రజా సేవను దృష్టిలో ఉంచుకుంటే ఈ మొత్తం చాలా తక్కువగా ఉందని పలువురు సర్పంచులు, గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Ration Card : తెలంగాణ రేషన్‌ కార్డుదారులకు బిగ్‌షాక్..కేంద్రం ఇలా చేస్తుందని ఊహించరు

ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులతో పోలిక

స్థానిక సంస్థల ఎన్నికైన ఇతర ప్రతినిధులతో సర్పంచుల గౌరవ వేతనాన్ని పోల్చి చూస్తే ఈ అసమానత స్పష్టమవుతుంది.

  • సర్పంచులు: నెలకు రూ.6,500
  • ఎంపీటీసీలు (MPTCs): నెలకు రూ.6,500 (సర్పంచులతో సమానంగా)
  • జడ్పీటీసీలు (ZPTCs) & ఎంపీపీలు (MPPs): నెలకు రూ.13,000

గ్రామ స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సర్పంచ్ పాత్ర అత్యంత కీలకం. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం.. గ్రామంలోని అన్ని కార్యకలాపాలకు సర్పంచే బాధ్యత వహిస్తారు. తమకు జడ్పీటీసీలు, ఎంపీపీలతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ గౌరవ వేతనం ఇవ్వాలని సర్పంచుల సంఘాలు గతంలోనూ ప్రభుత్వాన్ని కోరాయి.

ముఖ్యమంత్రి దృష్టికి వేతనం పెంచే అవకాశం?

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో గ్రామ స్థాయి పాలనను బలోపేతం చేసేందుకు, సర్పంచుల పాత్రను గుర్తించేందుకు గౌరవ వేతనం పెంపు గురించి ఆలోచించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, గ్రామీణ ప్రాంతాల్లో పాలనా బాధ్యతల విస్తరణ దృష్ట్యా, రాబోయే రోజుల్లో సర్పంచుల గౌరవ వేతనంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

  Last Updated: 11 Dec 2025, 10:36 PM IST