Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం ఏమిటి ? కల్వకుంట్ల కవితపై అభియోగాలు ఏమిటి ?

Delhi Liquor Scam : ఇవాళ (శనివారం) లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.

  • Written By:
  • Updated On - March 16, 2024 / 08:34 AM IST

Delhi Liquor Scam : ఇవాళ (శనివారం) లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. దీనికి సరిగ్గా ఒక రోజు  ముందు (శుక్రవారం) ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్‌  చేయడంతో రాజకీయవర్గాల్లో కలకలం రేగింది.  ఇవాళ ఉదయం  అమిత్ అరోరాతో పాటు కవితను ఏకకాలంలో ఈడీ అధికారులు  ప్రశ్నించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం కవితను  రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)  కేసులో కవితను విచారించేందుకుగానూ తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరనున్నారు. మరోవైపు తన అరెస్టును కోర్టులో ఛాలెంజ్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇంతకీ ఏమిటీ ఢిల్లీ లిక్కర్ కేసు ? ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఏమిటి ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

2021లో అలా మొదలైంది.. 

  • ఢిల్లీ లిక్కర్ స్కాంతో ముడిపడిన కార్యకలాపాలు 2021 సంవత్సరంలో మొదలయ్యాయి.
  • ఆ ఏడాది ఢిల్లీలో మద్యం పాలసీని మార్చేయాలని కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు నిర్ణయించింది.
  • మద్యం దుకాణాలకు సంబంధించి తొలుత ఒక ఎక్స్‌పర్ట్ కమిటీని ఆప్ సర్కారు నియమించింది. ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ సారథ్యంలో ఏర్పాటుచేసిన ఎక్స్‌పర్ట్‌ కమిటీలో ముగ్గురు అధికారులను సభ్యులుగా నియమించారు.
  •  ఎక్స్‌పర్ట్‌ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా 2021 ఫిబ్రవరిలో   ముగ్గురు మంత్రులతో ఇంకొక కమిటీని నియమించారు.
  • చాలా కాలంగా ప్రభుత్వ హయాంలో ఉన్న రిటైల్ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని మంత్రుల కమిటీ సిఫారసు చేసింది. దీనికి 2021 మార్చిలో  ఢిల్లీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
  • ఢిల్లీలోని మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ద్వారా  ప్రభుత్వ ఆదాయం రూ.9500 కోట్లు పెరుగుతుందని  ఢిల్లీ ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది.

Also Read : Kavithas Arrest : కవిత అరెస్టుపై అమిత్ షా ఏమన్నారో తెలుసా ?

ఆ సౌకర్యాలన్నీ కల్పించారు..

  • ఢిల్లీలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి కావాలి. అందుకే  ఢిల్లీ క్యాబినెట్ ఓకే చేసిన కొత్త లిక్కర్ పాలసీని లెఫ్టినెంట్ గవర్నర్ వద్దకు పంపారు.
  • దాదాపు నాలుగు నెలలు పెండింగ్ పెట్టిన తరువాత 2021 నవంబర్‌లో కొత్త పాలసీకి  ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ ఆమోదం తెలిపారు.
  • కొత్తగా ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాలకు ఢిల్లీ డెవలప్‌మెంట్ అధారిటీతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అనుమతి తప్పనిసరి అని లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ స్పష్టం చేశారు.
  •  అనంతరం కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో 849 మద్యం దుకాణాలు   ఏర్పాటు చేశారు.
  • కొత్త లిక్కర్ పాలసీలో భాగంగా మద్యం ధరల విషయంలో ప్రైవేటు వ్యాపారులు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే అవకాశం ఇచ్చారు.
  • తెల్లవారుజామున 3గంటల వరకు షాపులు తెరిచి ఉంచేందుకు వీలు కల్పించారు.
  • మద్యాన్ని హోమ్ డెలివరీ చేసేందుకు అవకాశం ఇచ్చారు.

Also Read :ED Vs Kavitha : ఢిల్లీ ఈడీ ఆఫీసులో కవిత.. కాసేపట్లో విచారణ, మధ్యాహ్నం కోర్టుకు

ఢిల్లీ సీఎస్ నరేష్ కుమార్ చొరవతో బట్టబయలు.. 

  • 2022 ఏప్రిల్‌లో ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ (సీఎస్) గా నరేష్ కుమార్ నియమితులయ్యారు.
  • ఉద్యోగంలో చేరగానే లిక్కర్ పాలసీని స్టడీ చేసిన నరేష్ కుమార్.. ఈ పాలసీ తయారీలో, మద్యం దుకాణాల కేటాయింపులోనూ అవకతవకలు జరిగాయని గుర్తించారు.
  • కొత్త లిక్కర్ పాలసీలోని అవకతవకల వివరాలతో ఢిల్లీ సీఎస్ నరేష్ కుమార్ ఒక నివేదికను రూపొందించారు. దీన్ని లెప్ఠ్‌నెంట్ గవర్నర్‌కు సమర్పించారు.
  • ఈ నివేదిక ఆధారంగా లెఫ్టనెంట్ గవర్నర్ 2022 సంవత్సరం జులైలో సీబీఐ విచారణకు ఆదేశించారు.
  • ఈక్రమంలోనే లిక్కర్ పాలసీని రద్దుచేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ఆదాయం పెరగకపోవడం వల్లే కొత్త పాలసీని రద్దు చేశామని అసెంబ్లీలో తెలిపింది.
  • మద్యం పాలసీలో మార్పులు చేసి నాటి ఢిల్లీ ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి 145కోట్ల రూపాయల నష్టం చేశారని సీబీఐ గుర్తించింది. మద్యం వ్యాపారులు ప్రభుత్వానికి కట్టాల్సిన రూ.145 కోట్లను కొవిడ్ సంక్షోభం పేరుతో ఏకపక్షంగా ఢిల్లీ ప్రభుత్వం మాఫీ చేసిందని సీబీఐ కేసు పెట్టింది.
  • ఎల్‌-1 కేటగిరి లైసెన్సుల జారీలో లంచాలు తీసుకుని పర్మిషన్‌లు ఇచ్చారని సీబీఐ ఆరోపించింది. రిటైల్ వెండర్లకు క్రెడిట్ నోట్లు  జారీచేయడం ద్వారా లంచాలు ఇచ్చినట్లు తేల్చారు.
  • ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఒక మద్యం వ్యాపారి కోటి రూపాయలు తరలించినట్లు సీబీఐ గుర్తించింది.
  • మనీష్ సిసోడియా అనుచరులు దినేష్ అరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండేలు ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించినట్లు గుర్తించారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎంట్రీ.. 

  • ఢిల్లీ మద్యం పాలసీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అసలైన పెట్టుబడిదారు అని.. ఆమె బినామీగా వ్యవహరించిన అరుణ్‌ పిళ్లై తన వాంగ్మూలంలో చెప్పారని ఈడీ అనుబంధ చార్జిషీట్‌లో పేర్కొంది. రూ.100 కోట్ల ముడుపుల గురించి కవితకు తెలుసని పిళ్లై అంగీకరించారని తెలిపింది.
  • సౌత్‌ గ్రూప్‌ (శరత్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ మాగుంట, కె.కవిత తరఫున ప్రాతినిధ్యం వహించిన అరుణ్‌ పిళ్లై, అభిషేక్‌ బోయినపల్లి, బుచ్చిబాబు)తో కలిసి మనీశ్‌ సిసోడియా, ఇతర ఆప్‌ నేతల ప్రతినిధి విజయ్‌నాయర్‌ ఈ కుట్ర చేశారని వివరించింది.
  • మద్యం విధానం రూపకల్పనకు ముందు, తర్వాత కూడా విజయ్‌నాయర్‌తో కవిత పలుసార్లు సమావేశమయ్యారు.
  • సమీర్‌ మహేంద్రు వాంగ్మూలం ప్రకారం.. తన వెనక ఎవరున్నారో చెప్పాలని అడగ్గా తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె ఎమ్మెల్సీ కవిత అని సమీర్‌కు అరుణ్‌ పిళ్లై వెల్లడించారు.
  • 2022 తొలినాళ్లలో హైదరాబాద్‌లోని కవిత నివాసంలో జరిగిన సమావేశంలో ఆమెతోపాటు సమీర్‌ మహేంద్రు, శరత్, అరుణ్‌ పిళ్లై, అభిషేక్‌ బోయినపల్లి, కవిత భర్త అనిల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ్‌ పిళ్లై తన కుటుంబ సభ్యుడితో సమానమని, అతడితో కలసి వ్యాపారం చేస్తున్నామని, తమ వ్యాపారాన్ని భారీగా ముందుకుతీసుకెళ్లాలని భావిస్తున్నామని సమీర్‌కు కవిత తెలిపారు.
  • ఈ సమయంలోనే ఇండోస్పిరిట్స్‌ ఎల్‌1 దరఖాస్తు సమస్యపై కవిత ఆరా తీశారు.  రూ.100 కోట్ల ముడుపులకు బదులుగా కవితకు ఇండోస్పిరిట్స్‌లో వాటా ఇవ్వడంపై.. ఆమెకు, ఆప్‌ నేతలకు మధ్య అవగాహన/ఒప్పందం ఉందని అరుణ్‌ పిళ్లై తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఆ సౌత్‌ గ్రూపులో మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ మాగుంట, శరత్‌రెడ్డి, కె.కవిత ప్రముఖ వ్యక్తులని తెలిపింది. ఈ సౌత్‌గ్రూపునకు ప్రతినిధులుగా అభిషేక్‌ బోయినపల్లి, అరుణ్‌ పిళ్లై, బుచ్చిబాబు వ్యవహరించారని తెలిపింది.
  • రూ.100 కోట్ల ముడుపులు బదిలీ చేయడానికి విజయ్‌ నాయర్, దినేశ్‌ అరోరాలతో కలిసి అభిషేక్‌ బోయినపల్లి కుట్ర చేశారని పేర్కొంది.  ఢిల్లీ మద్యం వ్యాపారంలో వచ్చిన సొమ్ముతో సదరు వ్యక్తులు హైదరాబాద్‌లో ప్రాపర్టీలు కొన్నారని ఈడీ పేర్కొంది.  ఫీనిక్స్‌ శ్రీహరితో కలిసి కవిత భర్త అనిల్, బుచ్చిబాబు హైదరాబాద్‌లో ప్రాపర్టీలు కొన్నారని తెలిపారు.