Telangana BJP : తెలంగాణ బీజేపీకి ఏమైంది..? కాంగ్రెస్ దూకుడుతో తేలిపోతున్న క‌మ‌లం.. కోవ‌ర్టులే కార‌ణ‌మా?

నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయం మేమే అంటూ బ‌రిలో నిలిచిన‌ బీజేపీ ఎందుకు ఒక్క‌సారిగా వెనుక‌బడిపోయింది? ప్ర‌జ‌ల్లో క‌మ‌లం పార్టీకి ఆద‌ర‌ణ లేద‌న్నవాద‌న ఎందుకు తెర‌పైకి వ‌చ్చింది?

  • Written By:
  • Updated On - June 7, 2023 / 12:57 PM IST

తెలంగాణ(Telangana)లో మ‌రికొద్ది నెల‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల(Assembly Elections) నోటిఫికేష‌న్ రానుంది. ఈ క్ర‌మంలో అధికార బీఆర్ఎస్(BRS) పార్టీకి ఎన్నిక‌ల్లో గ‌ట్టి షాకిచ్చేందుకు కాంగ్రెస్‌(Congress), బీజేపీ(BJP)లు నువ్వానేనా అన్న‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. క‌ర్ణాట‌క(Karnataka) ఎన్నిక‌ల ఫ‌లితాల ముందు వ‌ర‌కు తెలంగాణ‌లో బీజేపీ హ‌వా కొన‌సాగింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేది బీజేపీనే అన్న వాద‌న‌సైతం రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి వ్య‌క్త‌మైంది. కానీ, క‌ర్ణాట‌క ఫ‌లితాల అనంత‌రం సీన్ రివ‌ర్స్ అవుతుంది. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ అద్భుత విజ‌యంతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం విధిత‌మే. ఆ ప్ర‌భావం తెలంగాణ‌పై స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. క‌ర్ణాట‌క ఫ‌లితాల‌తో కాంగ్రెస్ నేత‌ల్లో వెయ్యి ఏనుగుల బ‌లం వ‌చ్చిన‌ట్లుగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఊహించ‌ని రీతిలో ఆ పార్టీ ప్ర‌జ‌ల్లో ఒక్క‌సారిగా పుంజుకుంది. కాంగ్రెస్ నేత‌లుసైతం పాద‌యాత్ర‌ల‌తో ప్ర‌జ‌ల్లోకి దూసుకెళ్తున్నారు. పార్టీ నేత‌లంతా ఏక‌తాటిపైకి వ‌స్తున్నారు. దీంతో కాంగ్రెస్ దూకుడు ముందు క‌మ‌లం తేలిపోతుంద‌న్నవాద‌న రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి వినిపిస్తోంది.

నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయం మేమే అంటూ బ‌రిలో నిలిచిన‌ బీజేపీ ఎందుకు ఒక్క‌సారిగా వెనుక‌బడిపోయింది? ప్ర‌జ‌ల్లో క‌మ‌లం పార్టీకి ఆద‌ర‌ణ లేద‌న్నవాద‌న ఎందుకు తెర‌పైకి వ‌చ్చింది? ప్ర‌స్తుతం బీజేపీ శ్రేణుల‌ను ఈ ప్ర‌శ్న‌లు క‌ల‌వ‌రానికి గురిచేస్తున్నాయి. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు తోడు కేంద్ర పార్టీ అధిష్టానం తెలంగాణ‌పై ప్ర‌త్యేక దృష్టిసారించ‌లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ముఖ్యంగా క‌ర్ణాట‌క ఫ‌లితాల ముందు వ‌ర‌కు పొంగులేటి, జూప‌ల్లితో పాటు ప‌లువురు కాంగ్రెస్ నేత‌లుసైతం బీజేపీలోకి వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌రువాత కాంగ్రెస్ కు రాష్ట్రంలో ఒక్క‌సారిగా ప్ర‌జాద‌ర‌ణ పెరిగిన‌ట్లు స‌ర్వేలు చెబుతుండ‌టంతో వారు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు క‌మ‌లం పార్టీని కోవ‌ర్టుల బెడ‌ద వేదిస్తోంద‌న్న వాద‌నలేక‌పోలేదు. ఇదే విష‌యాన్ని హైదరాబాద్ నగరంలో బీజేపీ కీలక నేతల్లో ఒకరైన పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ బ‌హిరంగంగానే పేర్కొన్నారు. బీజేపీలో సీఎం కేసీఆర్ కోవ‌ర్టులు ఉన్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మ‌రో 15 రోజుల్లో మ‌రిన్ని విష‌యాలు వెల్ల‌డిస్తాన‌ని చెప్పారు. నందీశ్వ‌ర్ గౌడ్ వాద‌న‌ల్లో నిజంలేక‌పోలేద‌ని కొంద‌రు బీజేపీ నేత‌లు పేర్కొంటున్నారు. బీజేపీలో కేసీఆర్ కోవ‌ర్టులు ఉండ‌టం వ‌ల్ల‌నే అనుకున్న‌ల‌క్ష్యాన్ని చేరుకోలేక‌పోతున్నామ‌ని కొంద‌రు బీజేపీ నేత‌లు వాపోతున్నార‌న్న చ‌ర్చ జ‌రుగుతుంది.

ఏపీ బీజేపీలో ప‌రిస్థితే తెలంగాణ బీజేపీలో క‌నిపిస్తుంద‌న్న వాద‌న లేక‌పోలేదు. ఏపీ బీజేపీలో చంద్ర‌బాబు వ‌ర్గం, జ‌గ‌న్ వ‌ర్గాలుగా కొంద‌రు బీజేపీ నేత‌లు విడిపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. తెలంగాణ బీజేపీలోనూ బీఆర్ఎస్ వ‌ర్గం ఉంద‌ని, పార్టీలోని అంత‌ర్గ‌త విష‌యాలు కేసీఆర్‌కు చేరుతున్నాయ‌ని ప‌లువురు పార్టీ నేత‌లు పేర్కొంటున్నారు. ఇప్ప‌టికైనా కేంద్ర పార్టీ అధిష్టానం రంగంలోకి దిగ‌కుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌టం అటుంచితే.. క‌నీసం ఐదు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనైనా గెలిచే ప‌రిస్థితి ఉండ‌ద‌న్న వాద‌న‌ను ప‌లువురు బీజేపీ నేత‌లు వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇలాంటి ప‌రిస్థితుల్లో త్వ‌ర‌లో తెలంగాణ‌లో అమిత్‌షా, జేపీ న‌డ్డాల ప‌ర్య‌ట‌న‌లు ఉండ‌టంతో వీరు తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఏ మేర‌కు జోష్ నింపుతార‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

Also Read : Telangana Politics: రాహుల్ చాతుర్యం, కాంగ్రెస్ లోకి పొంగులేటి, జూపల్లి!