Minister: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మేడ్చల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గంలోని ఐదు మండలాల లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మండలి చీప్ విప్ మహేందర్ రెడ్డి, కలెక్టర్ మనుచౌదరితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని ఉద్ఘాటించి చెప్పారు. పేదవాడు ఆత్మగౌరవంతో బతికేలా ఉండడానికి రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం అందచేస్తున్నామని అన్నారు.
మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 40 వేల రేషన్ కార్డులు అందచేసామని మరో 60 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నవి పూర్తి కాగానే అందిస్తామని అన్నారు. లక్ష మంది రేషన్ కార్డులో చేర్పులు చేపడుతున్నట్లు తెలిపారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న భారాస ప్రభుత్వంలో మీ సేవల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన రేషన్ కార్డులు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను నెరవేర్చడంలో సఫలీకృతం అయ్యామని ఇంకా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా భారాస, భాజపా అని లేకుండా అందరికి సంక్షేమ పథకాలు ఫలాలు అందేలా చూస్తున్నట్లు తెలిపారు.
Also Read: Rakhi : రాఖీ పండుగ హిందువులు ఎందుకు జరుపుకుంటారు?..ఇంకా ఏ మతాలు వారు చేసుకుంటారో తెలుసా…?
విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీ లు ఏర్పాటు చేసి వారిని సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రేషన్ కార్డు ఉండడం సమాజంలో ఓ గుర్తింపు అని ఆరోగ్య శ్రీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రధాన ఆధారం అని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వజ్రేష్ యాదవ్, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.