విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య బాధాకరమని.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) వెల్లడించారు. యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడికి గురి చేయవద్దని స్పష్టం చేశారు. ఒత్తిడి ఉండకూడదనే ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ తీసేయాలని ముఖ్యమంత్రి చెబుతున్నారని తెలిపారు. సాత్విక్ ఆత్మహత్య విషయంలో వస్తున్న ఆరోపణలన్నింటిపై విచారణ జరిపిస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
ఇంటర్ విద్యార్థి సాత్విక్ రాత్రి పదిన్నర గంటలకు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందిందని నార్సింగి ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సెక్షన్ 305 కింద కేసు నమోదు చేశామన్నారు. సాత్విక్ మృతికి బాధ్యులైన ఆచార్య కృష్ణారెడ్డి, నరేష్ పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చామని తెలిపారు. కాలేజీలో ఒత్తిడి, వేధింపుల వల్లనే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశాకరి వెల్లడించారు.
క్యాంపస్‌లో విద్యార్థుల మీద భౌతిక దాడి జరిగినట్టు వీడియోలు హల్చల్ అవుతున్నాయన్నారు. ఆ వీడియోల పైన సైతం విచారణ చేస్తున్నామని.. అందులో కొన్ని పాత వీడియోలు కూడా ఉన్నాయన్నారు.ఈ కేసులో ఇప్పటికే ఆచార్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుంటామన్నారు. సాత్విక్ కుటుంబానికి చట్టపరమైన న్యాయం జరిగేలా చూస్తామన్నారు.