Bandi Sanjay: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపులపై సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్లను డిస్మిస్ చేయడంతో నిరాశలో ఉన్న జర్నలిస్టులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) బాసటగా నిలిచారు. ఈ దుస్థితికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాల వైఫల్యమే కారణమని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టులందరికీ న్యాయపరమైన సమస్యలు లేకుండా ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న బండి సంజయ్, సుప్రీంకోర్టు తీర్పు గురించి తెలుసుకున్న వెంటనే ఒక ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వైఫల్యమే కారణం
జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీతో సహా ఇతర హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులను రద్దు చేస్తూ 2024లో ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడం దురదృష్టకరం. ఇది కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల వైఫల్యమే. న్యాయ నిపుణులతో చర్చించకుండా హడావిడిగా జీవోలు జారీ చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. న్యాయస్థానంలో వాదనలు సరిగ్గా వినిపించకపోవడం కూడా ఈ దుస్థితికి కారణమని ఆయన విమర్శించారు.
Also Read: Online Gaming Bill: రాజ్యసభలో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం.. ఏ రకమైన యాప్‌లు నిషేధించబడతాయి?
ఓటు రాజకీయాలు
ఓట్ల కోసం అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు పార్టీలు జర్నలిస్టులను గాలికొదిలేశాయని బండి సంజయ్ దుయ్యబట్టారు. ఓట్లపై ఉన్న శ్రద్ధ జర్నలిస్టులతో సహా పేద వర్గాల సంక్షేమంపై లేదని అన్నారు.
బీజేపీ అండగా ఉంటుంది
జర్నలిస్టులెవరూ బాధపడొద్దని, బీజేపీ వారికి అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. “రాష్ట్రంలో ఈసారి అధికారంలోకి వచ్చేది బీజేపీయే” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అధికారంలోకి రాగానే ఇళ్లు కట్టించి ఇస్తాం
బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా న్యాయ నిపుణులతో ముందుగా చర్చించి జర్నలిస్టులందరికీ ఇళ్లను నిర్మించి ఇస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. అప్పటి వరకు జర్నలిస్టులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఆదుకోకపోతే బీజేపీ ఆ బాధ్యతను తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.