KTR Challenge: ముందస్తుకు మేం రెడీ.. బీజేపీకి ‘కేటీఆర్’ సవాల్!

కేటీఆర్ (KTR) సంచలన కామెంట్స్ చేశారు. దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేసి రండి.

  • Written By:
  • Updated On - January 28, 2023 / 04:31 PM IST

తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ (KTR) సంచలన కామెంట్స్ చేశారు. ‘‘దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేసి రండి. ముందస్తు ఎన్నికలకు అందరం కలిసే పోదాం‘’ అని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ(BJP)కు మంత్రి కేటీఆర్‌(KTR) సవాల్‌ విసిరారు. నిజామాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై (Central Govt) నిప్పులు చెరిగారు. స్థానిక ఎంపీ అర్వింద్‌పై ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్‌ను రద్దు చేసి ముందస్తుకు వస్తే.. తాము కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమని తేల్చి చెప్పారాయన.

‘కేంద్రం తెలంగాణ (Telangana)పై సవతి తల్లి ప్రేమ చూపుతోంది. పునర్విభజన చట్టంలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఒక్కపైసా అదనంగా తెలంగాణకు ఇవ్వలేదు. నేను చెప్పింది తప్పైతే రాజీనామాకు సిద్దం. బీజేపీ నేతలు (BJP Leaders) నా సవాల్‌ను స్వీకరిస్తారా?’ అని కేటీఆర్ సవాల్ విసిరారు. ‘నిజామాబాద్ నుండే ఎమ్మెల్యేలు, ఎంపీలు భారీ మెజార్టీతో గెలవాలి. స్వరాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి నిజామాబాద్ కార్పొరేషన్‌లో రూ.936.69 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం. పట్ణణ ప్రగతి కింద రూ.76 కోట్లు ఖర్చు చేశాం.

నిజామాబాద్‌కు కేసీఆర్ (KCR) ఇటీవల రూ.100 కోట్లు మంజూరు చేశారు. సీసీ రోడ్ల కోసం ప్రత్యేకంగా రూ.19 కోట్లు మంజూరు చేశాం. నిజామాబాద్‌లో త్వరలో ఐటీ హబ్‌ను ప్రారంభించబోతున్నాం. అన్ని మున్సిపాలిటీలకు రూ.50 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నాం. నిజామాబాద్ ఎంపీ కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలి. ఒక్క రూపాయి అభివృద్ధి పనైనా అరవింద్ (MP Arvind) చేశారా? ఫార్మాసిటీ ఏర్పాటుపై కేంద్రం నుంచి ఉలుకుపలుకు లేదు. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. రాష్ట్రానికి విద్యాసంస్దలను కేటాయించలేదు. ఢిల్లీ నేతలేమో అవార్డులు ఇస్తారు.. గల్లీ నేతలేమో కారుకూతలు కూస్తారు’ అని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే ప్రతిపక్షాల నాయకులు ‘‘కేసీఆర్ ఏ క్షణంలోనైనా ముందస్తుకు వెళ్లే అవకాశాలున్నాయి’’ అని తేల్చి చెప్పిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ముందస్తు వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారింది.

Also Read: Zero Covid Cases: గుడ్ న్యూస్.. తెలంగాణలో కరోనా కేసులు ‘నిల్’